హెజ్‌బొల్లా స్థావరాల్లో రష్యా ఆయుధాలు

దక్షిణ లెబనాన్‌లో తమ బలగాలు జరిపిన సోదాల్లో రష్యా ఆయుధాలు దొరికాయని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వెల్లడి

Advertisement
Update:2024-10-17 10:00 IST

ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లాల మధ్య యుద్ధంతో పశ్చిమాసియా భగ్గుమంటున్నది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌ దళాలు హెజ్‌బొల్లాకు చెందిన సొరంగాలను కనుగొన్న విషయం విదితమే. ఈ క్రమంలో ఆ సొరంగాల్లో రష్యాకు చెందిన ఆయుధాలున్నాయని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు పేర్కొన్నారు. ఓ ఫ్రెంచ్‌ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు వెల్లడించారు.

 లెబనాన్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే ఉద్దేశం మాకు లేదు

దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై మా దళాలు చేసిన దాడుల్లో రష్యాకు చెందిన అత్యాధునిక ఆయుధాలు కనుగొన్నాం. లిటానీ నదికి దక్షిణాన లెబనాన్‌ ఆర్మీకి మాత్రమే ఆయుధాలు కలిగి ఉండే అనుమతి ఉందని 2006లో యూఎన్‌ భద్రతామండలి తీర్మానించింది. అయినా హెజ్‌బొల్లా ఆ ప్రాంతాల్లో వందలాది సొరంగాలను తవ్వి.. స్థావరాలుగా మార్చుకున్నది. అక్కడే రష్యాకు చెందిన ఆయుధాలు దొరికాయి. లెబనాన్‌ కొత్త అంతర్యుద్ధం ఒక విషాదంగా మారుతుంది. ఒకరిని రెచ్చగొట్టడం మా లక్ష్యం కాదు. లెబనాన్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొనే ఉద్దేశం మాకు లేదు. లెబనాన్‌ సరిహద్దులో నివసిస్తున్న మా పౌరులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరడమే మా లక్ష్యమని నెతన్యాహూ పేర్కొన్నారు.

లెబనాన్‌ పేజర్ల పేలుడులో ఆసక్తికర విషయాలు

గత నెలలో ఇరాన్‌ మద్దతుతో లెబనాన్‌లో హెజ్‌బిల్లాలో ఇజ్రాయెల్‌ దళాలు చేసిన సోదాల్లో రష్యా, చైనాకు సంబంధించిన ఆయుధాలు కనుగొన్నట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొన్నది. హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్‌ దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి లెబనాన్‌లో సుమారు 1400 మంది మృతి చెందినట్లు లెబనాన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొన్నది. మరోవైపు లెబనాన్‌ పేజర్ల పేలుడులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఏజెంట్లు శక్తి మంతమైన ప్లాస్టిక్‌ పేలుడు పదార్థాలతో బ్యాటరీని రూపొందించారు. ఎక్స్‌రేలకూ కనిపించని స్థాయిలో డిటోనేటర్‌ అమర్చారు. 

Tags:    
Advertisement

Similar News