ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వంకోసం భారత్ కు రష్యా మద్దతు
ప్రస్తుతం ఆర్థిక వృద్ధి పరంగా భారతదేశం అగ్రగామి దేశాల్లో ఒకటి అని తాను భావిస్తున్నట్టు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ అన్నారు. వివిధ రకాల సమస్యలను పరిష్కరించడంలో న్యూ ఢిల్లీకి అపారమైన దౌత్య అనుభవం ఉందన్నారు లావ్రోవ్ .
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత దేశం ఎప్పటినుంచో ప్రయత్నిస్తూ ఉంది. భారత్ ప్రయత్నానికి రష్యా మొదటి నుంచీ మద్దతుగా నిలబడింది. ఈ సారి మళ్ళీ భారత్ కు తన మద్దతును ప్రకటించింది రష్యా.
భద్రతా మండలి (UNSC)లో భారతదేశానికి శాశ్వత స్థానం కోసం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ రష్యా మద్దతును పునరుద్ఘాటించారు.
" ప్రస్తుతం ఆర్థిక వృద్ధి పరంగా భారతదేశం అగ్రగామి దేశాల్లో ఒకటి అని నేను భావిస్తున్నాను. ఆ దేశ జనాభా త్వరలో ఇతర దేశాల కంటే పెద్దదిగా ఉండబోతుంది. వివిధ రకాల సమస్యలను పరిష్కరించడంలో న్యూ ఢిల్లీకి అపారమైన దౌత్య అనుభవం ఉంది. " అని లావ్రోవ్ చెప్పారు.
మాస్కోలోని ప్రిమాకోవ్ రీడింగ్స్ ఇంటర్నేషనల్ ఫోరమ్‌లో మీడియా ప్రశ్నలకు ప్రతిస్పందనగా లావ్‌రోవ్ ఈ ప్రకటనలు చేశాడు.
ఐక్యరాజ్యసమితి, షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) వంటి వివిధ దక్షిణాసియా ఏకీకరణ సంస్థలలో భారతదేశం పాల్గొంటుందని ఆయన పేర్కొన్నారు.
ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలను భద్రతా మండలిలో చేర్చడం ద్వారా ఆ సంస్థ మరింత ప్రజాస్వామ్యంగా మారుతుందని, లావ్రోవ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన 77వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలోపేర్కొన్నాడు.
"భారతదేశం, షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO)లో దక్షిణాసియాలోని అనేక రకాల ఏకీకరణ నిర్మాణాలలో భాగం. ఆ దేశం ఐక్యరాజ్యసమితిలో చురుకైన పాత్ర పోషిస్తుంది. భారతదేశం ఒక బహుళ ధృవ ప్రపంచాన్ని రూపొందించడంలో చురుకుగా ఉంది " అని లావ్రోవ్ తన ప్రసంగంలో చెప్పాడు. భారత్‌తోపాటు బ్రెజిల్‌కు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఆయన కోరారు..