బ్రిటన్ ప్రధాని పదవికి దగ్గరవుతున్న నారాయణమూర్తి అల్లుడు

అధినేత పదవి కోసం కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల నాలుగో రౌండ్ ఓటింగ్‌లో కూడా రిషి సునక్ అగ్రస్థానంలో నిలిచారు.

Advertisement
Update:2022-07-20 13:40 IST


బ్రిటన్ ప్రధాని పదవి రేసులో భారత మూలాలున్న రిషి సునక్ జోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్‌లోనూ దూకుడు ప్రదర్శించిన రిషి సునక్, ప్రధాని పదవికి మరింత దగ్గరయ్యారు. అధినేత పదవి కోసం కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల నాలుగో రౌండ్ ఓటింగ్‌లో కూడా రిషి సునక్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ రౌండ్‌లో సునక్ 118 ఓట్లతో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.

బోరిస్ జాన్సన్ ఖాళీ చేసిన ప్రధాన పదవిని చేపట్టాలంటే.. కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికవ్వాలి. అందుకు పార్లమెంటులో ఉన్న ఆ పార్టీ ఎంపీలు పలు రౌండ్ల ద్వారా ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి. చివరకు ఇద్దరు మిగిలే వరకు పోలింగ్ నిర్వహిస్తుంటారు. ప్రతీ రౌండ్‌లో రిషి సునక్ ప్రత్యర్థులు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. తాజాగా నిర్వహించిన నాలుగో రౌండ్‌లో కెమి బడెనోచ్ కేవలం 59 ఓట్లు సాధించి పోటీ నుంచి బయటకు వచ్చేశారు.

ఇక కన్జర్వేటివ్ పార్టీకి పార్లమెంటులో ఉన్న ఎంపీలలో మూడోంతుల ఓట్లు, అంటే 120 ఓట్లు సాధిస్తే పూర్తి మెజార్టీ సాధించినట్లు. నాలుగో రౌండ్‌లో రిషి సునక్‌కు 118 ఓట్లు లభించాయి. దీంతో ఆయన తర్వాతి రౌండ్‌లో స్పష్టమైన ఆధిక్యత సాధిస్తారని విశ్లేషకులు చెప్తున్నారు. మూడో రౌండ్‌లో 115 ఓట్లు రాగా, ఈ సారి మరో ముగ్గురిని తన వైపు తిప్పుకోగలిగారు.

బుధవారం చివరి రౌండ్ ఓటింగ్ జరుగనున్నది. నాలుగో రౌండ్‌లో వెనుదిరిగిన కెమి బడెనోచ్ 59 ఓట్లు సాధించారు. ఆయన వెనుదిరగడంతో ఇప్పుడు ఆ ఓట్లు ఎవరివైపు మొగ్గు చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది. రేసులో మిగిలిన రిషి సునక్, పెన్నీ మోర్డాంట్, లిజ్ ట్రూజ్‌లలో ఎవరికి ఈ ఓట్లు చీలితే వారు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

నాలుగో రౌండ్‌లో రిషి సునక్ 118, పెన్నీ మోర్డాంట్ 92, లిజ్ ట్రూస్ 86 ఓట్లు దక్కించుకున్నారు. మిగిలిన ఓట్లలో సునక్ కనీసం 10 నుంచి 15 ఓట్లు తనవైపు తిప్పుకోగలిగితే.. ఆయనదే అగ్రస్థానం అని చెప్పుకోవచ్చు. అయితే మిగిలిన ఇద్దరిలో ఎవరు రెండో స్థానంలో నిలుస్తారనేదే ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ గెలిస్తే అది ఒక రికార్డు అవుతుంది. ఆ దేశానికి ప్రధాని అయిన తొలి ఆసియన్ వ్యక్తిగా చరిత్ర సృష్టించనున్నాడు.

Tags:    
Advertisement

Similar News