చైనా భారత్ సరిహద్దులో మళ్ళీ యుద్దవాతావరణం? డొక్లాం దగ్గర గ్రామాలు నిర్మించిన చైనా

భారత్ , చైనా సరిహద్దుల్లో మళ్ళీ యుద్దవాతావరణం నెలకొననుందా ? లడాఖ్ సరిహద్దుల్లోని డొక్లాం వద్ద చైనా పటిష్టమైన గ్రామాలను నిర్మించింది. అందులో ప్రజలు నివసిస్తున్నట్టు కూడా షాటిలైట్ ఇమేజీలు బైటపెట్టాయి.

Advertisement
Update:2022-07-20 11:03 IST

ఓ వైపు ఇండియాతో చర్చలు అంటూనే మరోవైపు చైనా దొంగచాటు దెబ్బ తీస్తోంది. లడాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తత సృష్టిస్తోంది. డొక్లాం ప్రాంతంలో భూటాన్ వైపున 9 కిలోమీటర్ల దూరంలో చైనా కొత్తగా పూర్తి స్థాయిలో ఓ గ్రామాన్ని నిర్మించింది. దీనికి అప్పుడే 'పంగ్డా 'అని పేరు పెట్టేసిందట. మంగళవారం శాటిలైట్ ఇమేజీల్లో ఈ గ్రామం తాలూకు ఫోటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్పేస్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన మాక్సార్ కంపెనీ వీటిని క్యాప్చర్ చేసింది. నిజానికి ఈ ప్రాంతం ఇండియాకు అత్యంత కీలకం. ఈ గ్రామంలో ప్రతి ఇంటి బయట కార్లు పార్క్ చేసి ఉన్నాయి.అంటే చైనీయులు అప్పుడే ఈ ఇళ్లలో నివాసం ఉంటున్నట్టు తెలుస్తోంది. పైగా వాతావరణాన్ని తెలిపే క్యారేజ్ వే ఈ గ్రామం పొడవునా ఉంది. డొక్లాం భూభాగం లో చైనా దళాల వ్యూహాత్మక చొరబాటుకు ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. . పైగా ఇదే చోట అమో ఛూ నదీ లోయలో మరో.. (రెండో) గ్రామ నిర్మాణం కూడా పూర్తవుతోందని ఈ శాటిలైట్ ఇమేజీలు చూపుతున్నాయి. దక్షిణం వైపున కూడా మూడో గ్రామ నిర్మాణానికి చైనా సన్నాహాలు ప్రారంభించిందట. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు ఇండియా ఈ పరిణామాలపై స్పందించలేదు.


తూర్పు లడఖ్ లో వాస్తవాధీన రేఖతో బాటు సరిహద్దు ప్రాంతాల పొడవునా చైనా క్రమంగా తన మౌలిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నట్టు కూడా వెల్లడైంది. లోగడ డొక్లాం ట్రై-జంక్షన్ వద్ద భారత-చైనా దళాలు 73 రోజులపాటు తలపడ్డాయి. భూటాన్ వైపున రోడ్డు నిర్మించడానికి చైనా సైనికులు ప్రయత్నించగా దాన్ని భారత జవాన్లు అడ్డుకున్న సందర్భంలో ఇరు పక్షాల మధ్య పోరు జరిగింది. చైనాతో భూటాన్ 400 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. భూటాన్-చైనాల మధ్య సరిహద్దు వివాదాల పరిష్కారానికి 24 దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ చర్చల మాటేమో గానీ తాజాగా డొక్లాం ట్రై జంక్షన్ ప్రాంతం ఇండియాకు కీలకమైనందున ఇక్కడ తిరిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడవచ్చునని భయపడుతున్నారు. 2017 లో జరిగిన వార్ వంటి పరిణామాలను సంబంధిత వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

పంగ్డా గ్రామం, దాని ఉత్తర, దక్షిణ వైపు ప్రాంతాల్లో చైనా సైనికులు కనిపిస్తున్నారంటే డొక్లాం భూభాగంపై వారు తమ ఉనికిని బలోపేతం చేసుకునేందుకేనని భావించవలసి వస్తోందని మాజీ లెఫ్టినెంట్ జనరల్ ప్రవీణ్ బక్షి అభిప్రాయపడ్డారు. లోగడ డొక్లాం పోరు సమయంలో ఆయన ఈస్టర్న్ఆర్మీ కమాండర్ గా వ్యవహరించారు. సరిహద్దు ప్రాంతాల్లో చైనా గ్రామాలు వెలుస్తున్నాయి.. అంటే ప్రాదేశిక భూభాగాల మీద తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ఆ దేశం యత్నిస్తోందని అర్థమవుతోంది అని ఆయన పేర్కొన్నారు. లడఖ్ లో చైనా చొరబాటు గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చాలాసార్లు ప్రధాని మోడీ దృష్టికి తెచ్చారు. డ్రాగన్ కంట్రీ దురుద్దేశాలపై మోడీ ఏ మాత్రం స్పందించడం లేదని, చైనా చర్యలను ఖండించడం లేదని ఆయన ఆరోపించారు. బోర్డర్స్ లో చైనా దురాక్రమణ మీద మీ ప్రభుత్వం ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. ఇదేనా మన విదేశాంగ విధానమని దుయ్యబట్టారు. 





Tags:    
Advertisement

Similar News