జపాన్‌లో సరికొత్త చట్టం.. ప్ర‌పంచ దేశాల్లో ఆసక్తిక‌ర చ‌ర్చ‌

ఈ చట్టాన్ని రూపొందించాలనే ఆలోచనకు ప్రధాన కారణం యమగట విశ్వవిద్యాలయంలోని ‘ఫ్యాకల్టీ ఆఫ్‌ మెడిసిన్‌’ చేసిన పరిశోధనలే.

Advertisement
Update: 2024-07-12 07:03 GMT

జపాన్‌లో సరికొత్త చట్టాన్ని రూపొందించారు. దీనిపై ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటా ఆసక్తికరమైన చర్చకు తెర లేచింది. సాధారణంగా ఏ దేశంలోనైనా అక్కడి ప్రభుత్వాలు పాలనాపరమైన చట్టాలు చేస్తాయి. ఇంకా.. నేరాన్ని అదుపులోకి తీసుకురావడానికో, ప్రజల సంక్షేమానికో నిబంధనలు రూపొందిస్తాయి. జపాన్‌లో మాత్రం ప్రతిరోజూ అందరూ నవ్వాలంటూ చట్టం తీసుకొచ్చింది. ఇప్పుడిది సర్వత్రా ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారింది.

జపాన్‌లోని యమగట అనే ప్రిఫెక్చర్‌ (ఒక ప్రాంతం)లో గల స్థానిక ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ‘హాస్యంతో ఆరోగ్యం’ అనే ఆలోచనలో భాగంగా ఈ చట్టాన్ని రూపొందించింది. ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించటమే దీని లక్ష్యమని వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. అలాగే నవ్వుతో కూడుకున్న వాతావరణాన్ని ప్రోత్సహించాలని కంపెనీలను ఆదేశించింది. ప్రతినెలా 8వ తేదీని ప్రత్యేకంగా ’హాస్యంతో ఆరోగ్యం’ కోసం కేటాయించాలని తెలిపింది.

ఇక ఈ చట్టాన్ని రూపొందించాలనే ఆలోచనకు ప్రధాన కారణం యమగట విశ్వవిద్యాలయంలోని ‘ఫ్యాకల్టీ ఆఫ్‌ మెడిసిన్‌’ చేసిన పరిశోధనలే. మెరుగైన ఆరోగ్యం, జీవనకాల పెంపుపై పరిశోధనలు చేసిన అక్కడి పరిశోధకులు తక్కువగా నవ్వే వాళ్లలో కొన్ని రకాల వ్యాధుల వల్ల మరణం ముప్పు పెరుగుతోందని గుర్తించారు. దీని ఆధారంగానే అక్కడి ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.

అయితే.. ఈ కొత్త చట్టాన్ని కొందరు రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల కొందరు నవ్వలేకపోవచ్చునని, ఇది వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. పైగా నవ్వడం, నవ్వకపోవడమనేది భావప్రకటనా స్వేచ్ఛలో భాగమని జపాన్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ తెలిపింది. ఇలాంటి నిబంధనల ద్వారా ప్రజల హక్కులను కాలరాయొద్దని మండిపడింది. ఈ విమర్శలను అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ కొట్టిపారేసింది. తామేమీ బలవంతంగా ప్రజలపై రుద్దడం లేదని, వారి ఇష్టానికే వదిలేస్తున్నామని తెలిపింది. అందుకే జరిమానా వంటి అంశాలను చేర్చలేదని వివరించింది. ప్రజల్లో నవ్వు ప్రాధాన్యత, దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన పెంపొందించడమే దీని లక్ష్యమని తెలిపింది.

Tags:    
Advertisement

Similar News