పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ..త్వరలో అరెస్ట్ !?

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్దమవుతోంది. న్యాయమూర్తులపై, పోలీసు ఉన్నతాధికారులపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇమ్రాన్ పై పాక్‌ యాంటీ-టెర్రరిజం యాక్ట్‌ సెక్షన్‌ -7 ప్రకారం కేసు నమోదు చేశారు.

Advertisement
Update:2022-08-22 14:33 IST

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చుట్టూ బిగుస్తోంది. ప్ర‌భుత్వం ఆయ‌న అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోంది. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిధులు అందుకున్నార‌న్న కేసులో జారీ చేసిన రెండు నోటీసులకు ఆయన సమాధానం ఇవ్వ‌కపోవడంతో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఎ అరెస్టు చేసే అవకాశం ఉందని స్థానిక మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

ఈ నోటీసుపై పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ అయిన ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా స్పందిస్తూ..నోటీసు ఉప‌సంహ‌రించుకోక‌పోతే న్యాయ‌పోరాటం చేస్తాన‌ని హెచ్చ‌రించారు. ఈ హెచ్చ‌రిక చేసిన రెండు రోజుల్లోనే ఎఫ్ఐఎ రెండో నోటీసు జారీ చేస్తూ విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కోరింది. దీనిని కూడా ఇమ్రాన్ ఖాత‌రు చేయ‌క‌పోగా మ‌రిన్ని విమ‌ర్శ‌లు చేశారు. మూడో నోటీసు కూడా జారీ చేసి దానిపై కూడా ఇమ్రాన్ స్పంద‌న ఇలాగే ఉంటే అరెస్టు చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అభిజ్ఞ వ‌ర్గాలు చెబుతున్నాయి.

నిధుల‌కు సంబంధించిన విష‌యంలోనే గాక ఆయ‌న న్యాయ‌వ్య‌వ‌స్థ పైన‌, న్యాయ‌మూర్తిపైన‌, పోలీసు వ్య‌వ‌స్థ‌పైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ వారి సంగ‌తి చూస్తామ‌న్న రీతిలో హెచ్చ‌రించారు. "ఐజీపీ, డీఐజీ! మేము మిమ్మల్ని విడిచిపెట్టము" అని ఇమ్రాన్ హెచ్చ‌రించాడు. అలాగే "జెబా! సిద్ధంగా ఉండండి, మేము మీపై చర్య తీసుకుంటాము' అంటూ అదనపు సెషన్స్ జడ్జి జెబా చౌదరిని బహిరంగంగానే ఇమ్రాన్ బెదిరించారు. ఇమ్రాన్ స‌న్నిహితుడు పార్టీ వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు షహబాజ్ గిల్‌కు ఫిజికల్ రిమాండ్ విధిస్తూ అడియాలా జైలుకు తరలించాలని ఆమె ఆదేశించారు. అందుకే మ‌హిళా న్యాయ‌మూర్తిని బెదిరించాడు.

వీటికి సంబంధించి కూడా ఆయ‌న‌పై చ‌ట్ట ప‌రంగా చ‌ర్య‌లు తీసుకునేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. ఇస్లామాబాద్‌ మార్గల్లా పోలీసులు ఇమ్రాన్ పై పాక్‌ యాంటీ-టెర్రరిజం యాక్ట్‌ సెక్షన్‌ -7 ప్రకారం కేసు నమోదు చేశారు . దీంతో ఆయ‌న అరెస్టు త‌ధ్య‌మ‌నే అభిప్రాయాలు బ‌లంగా వినిపిస్తున్నాయి.

అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, బెల్జియంలో పనిచేస్తున్న మరో ఐదు కంపెనీలు కూడా ఇమ్రాన్ పార్టీ పిటిఐకి నిధులు స‌మ‌కూరుస్తున్న‌ట్టు ఎఫ్ఐఎ గుర్తించింది. ఈ విష‌యాన్ని పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ కి సమర్పించిన నివేదికలలో పేర్కొనలేద‌ని గుర్తించింది. ఇందుకు త‌గిన సాక్ష్యాధారాలు సంపాదించింద‌ని ఆ వ‌ర్గాలు తెలిపాయి. ఈ వారంలో ఆయ‌న‌కు మరోసారి నోటీసు జారీ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిపాయి. ఇమ్రాన్ కావాల‌నే స‌మాచారాన్ని దాస్తున్నార‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ తెలిపింది. కాగా, భార‌త సంత‌తికి చెందిన వ్య‌క్తి స‌హా 34 మంది నుంచి ఆయ‌న పార్టీకి నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా నిధులు అందాయ‌ని ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. ఇవ‌న్నీ ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు దారితీశాయి. అలాగే ఇమ్రాన్ ప్ర‌సంగాల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌రాదంటూ మీడియాను ఆదేశించింది. ఇమ్రాన్ త‌న చ‌ర్య‌ల‌కు జ‌వాబివ్వ‌వాల‌ని, ఆయ‌న‌పై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి రాణా స‌నాఉల్లా చెప్పారు. అధికారంలో ఉన్న‌ప్పుడంతా బాగానే ఉన్నా ప‌ద‌వి నుంచి దిగిపోయాక లేక దించేశాక మాజీ ప్ర‌ధానులంతా కేసులు ఎదుర్కోవ‌డం, జైలు పాల‌వ‌డం పాకిస్తాన్ రాజ‌కీయాల ప్ర‌త్యేక‌త‌.

Tags:    
Advertisement

Similar News