ట్రంప్ మళ్ళీ వేసేశాడు... నాకు అధికారం ఇస్తే 24 గంటల్లో రష్యా, ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపేస్తా

అద్భుతంగా చర్చలు చేయగల తన నైపుణ్యం వివాదాన్ని సులభంగా ముగించగలదని ట్రంప్ తెలిపారు. "నేను అధ్యక్షుడిగా ఉన్నట్లయితే, రష్యా,ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదు, ఇప్పుడైనా సరే, నేను అధ్యక్షుడినైతే ఈ భయంకరమైన, విపరీతమైన దుష్ప్రరిణామాలకు ముగింపు పలక‌గలను" అని రాశారు.

Advertisement
Update:2023-01-27 17:27 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాటలు వింటూ ఉంటే మనకు మన దగ్గర కూడా అలాంటి మాటలు మాట్లాడే కొందరు గుర్తుకు వస్తారు. నా ఎన్నికల ప్రచారానికి 4 దేశాల అధ్యక్షులు వస్తారని, నేను వెళ్తే అమెరికా అధ్యక్షుడు లేచి నిలబడి, ఏం చేయమంటే అది చేస్తారని, నన్ను మునుగోడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే తానే ముఖ్యమంత్రినైపోతానని, నా అపాయింట్ మెంట్ కోసం అమెరికా అధ్యక్షుడు బైడెన్ నుంచి రష్యా అధ్య‌క్షుడు పుతిన్ దాకా ఎదురుచూస్తున్నారని.... ఈమాటలు ఎవరివో చెప్పకుండానే గుర్తుపట్టగల సమర్దులుమీరు. ట్రంప్ కూడా సేమ్ టూ సేమ్ ఇలాంటి వ్యక్తే. అయితే ఓ నాలుగేళ్ళు అధికారం కూడా వెలగబెట్టారు కాబట్టి మాటల‌ వరకే పరిమితం కాకుండా కొన్ని వింత, పిచ్చి పనులు కూడా చేసి అల్లకల్లోలం సృష్టించాడు. ఆ తర్వాత ఓడిపోయినా సరే ఆయన ధోరణి మాత్రం మారలేదు.

12 నెలలుగా రష్యా, ఉక్రెయిన్ యుద్దం నడుస్తోంది. ఆ యుద్దం వల్ల ఆ రెండు దేశాలేకాదు ప్రపంచమంతా ప్రభావానికి గురయ్యింది. చమురు రేట్లు పెరిగిపోవడం దగ్గరినుంచి అనేక వస్తువుల రేట్లు పెరిగిపోయి ప్రపంచం ఆర్థికమాంద్యంలోకి జారుకుంటోంది. ఆ యుద్దం ఆగాలని ప్రపంచ ప్రజలంతా కోరుకుంటూ ఉండగా దాన్ని కొనసాగించడానికే అటు రష్యా ఇటు నాటో కూటమి కంకణం కట్టుకున్నాయి. అయితే తాను అధికారంలో ఉంటే ఆ యుద్దాన్ని 24 గంటల్లో ఆపేవాడినని, ఇప్పటికీ ఆలస్యం జరగలేదని తనను అధ్యక్షుడిని చేస్తే యుద్దం ఆపేస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వక్కాణించారు.

ఆయన తన స్వంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ట్రూత్ లో, ''ఈ వివాదం మానవ జీవితంలో అత్యంత విషాదకరమైనది,వ్యర్థమనిది'' అన్నారు. తాను అధ్యక్షుడిగా ఉంటే అసలు యుద్ధం జరిగేది కాదని ట్రంప్ అన్నారు.

అద్భుతంగా చర్చలు చేయగల తన నైపుణ్యం వివాదాన్ని సులభంగా ముగించగలద‌ని తెలిపారు. "నేను అధ్యక్షుడిగా ఉన్నట్లయితే, రష్యా,ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదు, ఇప్పుడైనా సరే, నేను అధ్యక్షుడినైతే ఈ భయంకరమైన, విపరీతమైన యుద్దానికి  ముగింపు పలక‌గలను" అని రాశారు.

ఇప్పుడు ప్రపంచం ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కాలంటే (చాలా కారణాల్లో ఇదొకటి)రష్యా, ఉక్రెయిన్ యుద్దం ఆగాలి. అది ఆగాలంటే వెంటనే బైడెన్ దిగిపోయి ట్రంప్ అమెరికా అధ్యక్షుడైపోవాలి. దీని గురించి అమెరికా ప్రజలు సీరియస్ గా ఆలోచించాలి మరి!

Tags:    
Advertisement

Similar News