బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్లు, 105 మంది మృతి

ప్రభుత్వం ఎన్ని నిషేధాలు విధించినా తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు తెగేసి చెబుతున్నారు. ఈ మరణాలకు ప్రధాని షేక్ హసీనానే కారణమని, ఆమె వెంటనే తన పదవికి రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Update:2024-07-20 11:22 IST

విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళనలతో బంగ్లాదేశ్‌ అట్టుడుకుతోంది. హింసాత్మక ఘటనలు చెలరేగుతుండటంతో షేక్ హసీనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. విద్యార్థుల ఆందోళనలను అదుపు చేయడంలో పోలీసులు విఫలం కావడంతో మిలటరీ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ ఆందోళనల్లో 105 మంది ప్రాణాలు కోల్పోయారు.


బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. నిరసనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు శుక్రవారం కాల్పులు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ఈ అల్లర్లలో 105 మంది చనిపోగా.. దాదాపు 2500 మంది గాయపడ్డారు. ఒక్క రాజధాని నగరంలోనే పోలీసుల కాల్పులకే 52 మంది మృతి చెందారని సమాచారం. పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో దేశ రాజధాని ఢాకాలో ర్యాలీలు, ప్రదర్శనలు, ప్రజలు గుమికూడడాన్ని నిషేధించారు. ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ప్రభుత్వం దేశవ్యాప్త కర్ఫ్యూ విధించింది. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో సైన్యాన్ని రంగంలోకి దించింది. అయితే ప్రభుత్వం ఎన్ని నిషేధాలు విధించినా తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు తెగేసి చెబుతున్నారు. ఈ మరణాలకు ప్రధాని షేక్ హసీనానే కారణమని, ఆమె వెంటనే తన పదవికి రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నర్సింగ్డి జిల్లాలో ఆందోళనకారులు జైలులోకి దూసుకెళ్లి ఖైదీలను విడుదల చేశారు. అనంతరం జైలుకు నిప్పు పెట్టారు. దీంతో జైలు నుంచి వందలాదిమంది ఖైదీలు పారిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు.




బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింసపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. దీన్ని ఆ దేశ అంతర్గత విషయంగా తాము పరిగణిస్తున్నట్లు పేర్కొంది. 8,000 మంది విద్యార్థులతో సహా 15,000 మంది భారతీయులు బంగ్లాదేశ్‌లో ఉన్నారని, వారంతా క్షేమమని వెల్లడించింది. ఆందోళ‌న‌ల ఈ నేపథ్యంలో అక్కడ విద్యను అభ్యసిస్తోన్న భారతీయ విద్యార్థులు గుంపులు గుంపులుగా స్వదేశానికి వచ్చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చేందుకు కీలకమైన రెండు మార్గాలు త్రిపురలోని అఖురాహ్, మేఘాలయలోని ద్వాకీ గుండా శుక్రవారం 300 మంది విద్యార్థులు స్వదేశానికి వచ్చినట్టు అధికారిక సమాచారం.

Tags:    
Advertisement

Similar News