ఐశ్వర్యరాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు కోరిన పాక్ మాజీ క్రికెటర్

పాకిస్తాన్ క్రికెటర్ల ఫర్ఫార్మెన్స్, కోచింగ్ వ్యూహాల గురించి ప్రస్తావించాడు. ఆటగాళ్లు గెలవాలన్న సంకల్పం, పట్టుదల ప్రదర్శించలేదని విమర్శించాడు.

Advertisement
Update:2023-11-15 15:15 IST

బాలీవుడ్ అందాల తార‌ ఐశ్వర్యరాయ్‌ని అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ క్షమాపణలు కోరాడు. రజాక్ వ్యాఖ్యలను పాకిస్తాన్, భారత్ లోని పలువురు క్రికెటర్లు ఖండించారు. భారత్‌లో జరుగుతున్న ఇంట‌ర్నేష‌న‌ల్ వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆడిన 9 మ్యాచ్ లలో నాలుగింట మాత్రమే గెలిచిన పాక్ ఇంటి దారి పట్టింది.

ఈ విషయం గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ లో అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ క్రికెటర్ల ఫర్ఫార్మెన్స్, కోచింగ్ వ్యూహాల గురించి ప్రస్తావించాడు. ఆటగాళ్లు గెలవాలన్న సంకల్పం, పట్టుదల ప్రదర్శించలేదని విమర్శించాడు. ఈ సందర్భంగా ఈ చర్చలో ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ పేరును మధ్యలో ప్రస్తావిస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు.

'నేను ఐశ్వర్య రాయ్‌ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అందమైన, పవిత్రమైన పిల్లలు పుట్టరు కదా. ముందు సంకల్పం దృఢంగా ఉండాలి' అని సంబంధం లేని విషయాన్ని రజాక్ ప్రస్తావించాడు. రజాక్ కామెంట్లను పక్కనే ఉన్న షాహిద్ ఆఫ్రిదీ, ఉమర్ గుల్ వారించాల్సింది పోయి చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు.

కాగా, ఐశ్వర్యరాయ్‌పై రజాక్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర విమర్శలు చెలరేగాయి. సంబంధం లేని విషయంలోకి ఐశ్వర్యరాయ్‌ని లాగి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని పాకిస్తాన్, భారత్‌కు చెందిన పలువురు క్రికెటర్లు మండిపడ్డారు. నెటిజన్లు రజాక్‌ను టార్గెట్ చేసి ట్రోల్స్ చేశారు.

తనపై విమర్శలు తీవ్రమవుతుండటంతో తాజాగా రజాక్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేసి ఐశ్వర్యరాయ్‌ని క్షమాపణలు కోరాడు. 'నేను క్రికెటర్లను విమర్శించే క్రమంలో ఐశ్వర్య పేరును తప్పుగా ఉపయోగించాను. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు. ఐశ్వర్య రాయ్ కి వ్యక్తిగతంగా క్షమాపణలు కోరుతున్నాను' అని ఆ వీడియోలో రజాక్ పేర్కొన్నాడు.

Tags:    
Advertisement

Similar News