ఉక్రెయిన్ లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం... ముగ్గురు మంత్రులు సహా 18 మంది మృతి!
రాజధాని కీవ్ శివార్లలోని ఓ కిండర్ గార్టెన్ పాఠశాల సమీపంలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఉక్రెయిన్ హోం మంత్రి డెనిస్ మొనాస్టిర్ స్కీ, డిప్యూటీ హోంమంత్రి యెవ్ గెనీ యెనిన్, సహాయ మంత్రి యూరీ లుబ్కోవిచ్ సహా 18 మంది దుర్మరణం పాలయ్యారు. చనిపోయినవారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.
రష్యా దాడితో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్ లో మరో విషాదం జరిగింది. ఘోరమైన హెలికాప్టర్ ప్రమాదంలో హోం మంత్రితో సహా 18 మంది మరణించారు.
రాజధాని కీవ్ శివార్లలోని ఓ కిండర్ గార్టెన్ పాఠశాల సమీపంలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఉక్రెయిన్ హోం మంత్రి డెనిస్ మొనాస్టిర్ స్కీ, డిప్యూటీ హోంమంత్రి యెవ్ గెనీ యెనిన్, సహాయ మంత్రి యూరీ లుబ్కోవిచ్ సహా 18 మంది దుర్మరణం పాలయ్యారు. చనిపోయినవారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.
కాగా, కూలిపోయిన హెలికాప్టర్ ఉక్రెయిన్ ప్రభుత్వ ఎమర్జెన్సీ సేవల విభాగానికి చెందినదని పోలీసులు వెల్లడించారు. హెలికాప్టర్ కూలిపోయిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు.
ఘటన జరిగిన వెంటనే స్పందించిన అధికారులు కిండర్ గార్టెన్ పాఠశాల నుంచి చిన్నారులను, సిబ్బందిని తరలించారు. పాఠశాలం భవనం వద్ద హెలికాప్టర్ శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. హెలికాప్టర్ కూలిపోయిన సమయంలో వెలుతురు సరిగా లేదని, దట్టమైన పొగమంచు అలముకుని ఉందని తెలుస్తోంది .