ప్రిన్స్ హ్యారీ బుక్‌కి భారీ క్రేజ్.. - తొలిరోజే 4 లక్షల కాపీల విక్రయం
హార్డ్ కాపీతో పాటు ఈ-బుక్, ఆడియో ఫార్మాట్‌లలోనూ ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇవన్నీ కలిపి తొలిరోజే యూకే వ్యాప్తంగా 4 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి.
తొలిసారి ఓ నాన్ ఫిక్షనల్ పుస్తకానికి భారీ స్థాయిలో డిమాండ్ వచ్చింది. తొలిరోజే ఏకంగా 4 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. యూకేలో ఇప్పటివరకు అత్యంత వేగంగా అమ్ముడవుతున్న పుస్తకంగానూ ఇది రికార్డు సృష్టించింది. బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ ఈ పుస్తకాన్ని రాశాడు. తన స్వీయ జీవిత చరిత్రను ఈ పుస్తకం రూపంలో ఆయన ప్రపంచం ముందుకు తీసుకొచ్చాడు. `స్పేర్` (spare) అనే పేరుతో రాసిన ఈ పుస్తకం కోసం యూకేలో భారీ డిమాండ్ ఏర్పడింది.
మంగళవారం నుంచి ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ పుస్తకాన్ని అధికారికంగా విడుదల చేసేందుకు బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న పుస్తక దుకాణాలు సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు ప్రత్యేకంగా తెరుచుకున్నాయి. అప్పటికే పుస్తక దుకాణాల వద్ద క్యూ కట్టిన అభిమానులు ప్రిన్స్ హ్యారీ రాసిన పుస్తకాన్ని భారీ సంఖ్యలో కొనుగోలు చేశారు.
హార్డ్ కాపీతో పాటు ఈ-బుక్, ఆడియో ఫార్మాట్‌లలోనూ ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇవన్నీ కలిపి తొలిరోజే యూకే వ్యాప్తంగా 4 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. ఈ పుస్తకం వాస్తవ ధర 28 పౌండ్లు. అయితే తొలిరోజు చాలా దుకాణాలు దీనిని సగం ధరకే విక్రయించాయి. అమెజాన్‌లోనూ సగం ధరకే.. అంటే 14 పౌండ్లకే ఇది అందుబాటులో ఉంది.
సాధారణంగా బ్రిటన్‌లో హ్యారీపోటర్ లాంటి ఫిక్షనల్ పుస్తకానికి తొలిరోజు భారీ డిమాండ్ ఉంటుంది. అలాంటి ఓ నాన్ ఫిక్షనల్ పుస్తకానికి ఈ స్థాయిలో డిమాండ్ రావడం ఇదే తొలిసారని విక్రయదారులు చెబుతున్నారు.
ఈ పుస్తకంలో తన జీవిత చరిత్రను రాసిన ప్రిన్స్ హ్యారీ.. రాజ కుటుంబంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలను బయటపెట్టారు. తన తండ్రి కింగ్ చార్లెస్, సవతి తల్లి కెమిల్లా, అన్నయ్య ప్రిన్స్ విలియం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. తన భార్య మేఘన్ మెర్కెల్‌ను రాజ కుటుంబం వేదనకు గురిచేసిన విషయాన్ని ఈ పుస్తకంలో వివరించారు.
ఈ పుస్తకం అధికారికంగా మంగళవారమే మార్కెట్‌లోకి విడుదలైనప్పటికీ.. ఇందులోని పలు కీలక విషయాలు ఇంతకుముందే బ్రిటన్ పత్రికల్లో కథనాలుగా వచ్చాయి. దీంతో ఈ పుస్తకంపై ప్రజల్లో ఇంతగా క్రేజ్ ఏర్పడింది. అయితే.. ఈ పుస్తకంలోని అంశాల గురించి రాజ కుటుంబం నుంచి ఎలాంటి స్పందనా వెలువడలేదు.