ఇరాన్‌లో భారీ పేలుళ్లు.. 73 మంది మృతి, 170 మందికి పైగా గాయాలు
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లోని అత్యంత శక్తివంతమైన ఖుద్స్ ఫోర్స్‌కు నేతృత్వం వహించిన ఖాసీం సులేమానీ.. 2020 జనవరి 3న అమెరికా డ్రోన్ దాడిలో మృతిచెందారు.
ఇరాన్‌లో బుధవారం భారీ పేలుళ్లు సంభవించడంతో 73 మంది మృతిచెందారు. మరో 170 మందికి పైగా గాయపడ్డారు. అక్కడి మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇరాన్ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సులేమానీ సంస్మరణ కార్యక్రమంలో ఈ దారుణం చోటుచేసుకుంది. కెర్మాన్‌లోని ఆయన సమాధి సమీపంలో జంట పేలుళ్లు సంభవించాయని, వీటిని ఉగ్రవాద దాడులుగా భావిస్తున్నామని ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఇజ్రాయెల్– హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ పేలుళ్లు జరగడం గమనార్హం. గాజాపై దాడులను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లోని అత్యంత శక్తివంతమైన ఖుద్స్ ఫోర్స్‌కు నేతృత్వం వహించిన ఖాసీం సులేమానీ.. 2020 జనవరి 3న అమెరికా డ్రోన్ దాడిలో మృతిచెందారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ దాడికి అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. దానిపై అప్పట్లో ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది.
తాజాగా సులేమానీ నాలుగో వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పేలుళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ దారుణ ఘటన వెనుక ఎవరి హస్తం ఉందనేది తెలియాల్సి ఉందని ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సులేమానీ మృతిచెందిన 2020లో ఆయన అంత్యక్రియల సమయంలోనూ 56 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో భారీ సంఖ్యలో జనం హాజరుకావడంతో తొక్కిసలాట వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది.