6.3 తీవ్రతతో అఫ్గానిస్తాన్‌లో మరో భారీ భూకంపం

అఫ్గానిస్తాన్‌లో గత 20 ఏళ్లలో సంభవించిన భారీ భూకంపాల్లో ఇదీ ఒకటని అధికారులు పేర్కొన్నారు. అయితే శనివారం నాటి భూకంపాన్ని మరచిపోకముందే ఇవాళ మరోసారి భూకంపం అఫ్గాన్‌ను వణికించింది.

Advertisement
Update:2023-10-11 11:21 IST

ఎటుచూసినా శిథిలాల కుప్పలు.. కనుచూపు మేర ఎక్కడ చూసినా తమవారి ఆచూకీ కోసం వెతుకుతున్న ప్రజలు.. సరిగ్గా ఇదంతా జరుగుతుండగానే మరోసారి అఫ్గానిస్తాన్‌పై ప్రకృతి తన విశ్వరూపం చూపించింది. మరో పెను భూకంపం అఫ్గానిస్తాన్‌ను వణికించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.3గా నమోదైంది. హెరాత్ సిటీకి సమీపంలో ఈ తెల్లవారు జామున 6:11 గంట‌ల‌కు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. దీని తీవ్రతను 6.3గా రికార్డ్ చేసింది జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్.




శనివారం సంభవించిన ప్రకృత్తి విపత్తు గ్రామాలను గ్రామాలనే తుడిచిపెట్టేసింది. అఫ్గానిస్తాన్‌ పశ్చిమ ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 4 వేలు దాటినట్లు అక్కడి ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు.




అఫ్గానిస్తాన్‌లో గత 20 ఏళ్లలో సంభవించిన భారీ భూకంపాల్లో ఇదీ ఒకటని అధికారులు పేర్కొన్నారు. అయితే శనివారం నాటి భూకంపాన్ని మరచిపోకముందే ఇవాళ మరోసారి భూకంపం అఫ్గాన్‌ను వణికించింది. వాయువ్య అఫ్గాన్‌లో ఇవాళ(బుధవారం) మరోసారి 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది, అయితే ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి సమాచారం అందలేదు. భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున చోటు చేసుకున్న పెను కదలికల వల్ల ఈ ప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదు అయ్యాయి. ఫలితంగా స్థానికులు తమ నివాసాల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. రోడ్ల మీదే గడుపుతున్నారు. మరోవైపు మట్టిదిబ్బల్లా మారిన ఇళ్ల శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం స్థానికులు, సహాయక సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు.




సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. అంతర్జాతీయ సమాజం స్పందించాలంటూ ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చినా ఇప్పటివరకూ అంతర్జాతీయ సమాజం నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఐక్యరాజ్యసమితి యొక్క మానవతా కార్యాలయం భూకంప ప్రతిస్పందన కోసం 5 మిలియన్ డాలర్లు విలువైన సాయం ప్రకటించింది. తాలిబాన్లు అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ దేశానికి అంతర్జాతీయ సహాయం నిలిపివేయ‌బ‌డింది. 

Tags:    
Advertisement

Similar News