చిరంజీవికి ప్రశంసల వెల్లువ
తనను అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్యరాజన్‌కు ట్విట్టర్ వేదికగా చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.
గోవాలో జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో మెగాస్టార్ చిరంజీవిని ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022గా ఎంపిక చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోబోతున్న చిరంజీవికి సినీ, రాజకీయ రంగ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. చిరంజీవికి అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రకటించగానే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ట్విట్టర్ వేదికగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే మరొక కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి కూడా చిరంజీవికి అభినందనలు తెలిపారు. 'ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి గారు ఈ అవార్డుకి వన్నె తీసుకువచ్చారు. చిరంజీవి నట ప్రస్థానం ఇకపైనా ఇలాగే కొనసాగాలి. సేవా కార్యక్రమాలను కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలి' అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. 'ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరో వజ్రం. ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు' అని పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్యరాజన్, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి, సినీ నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేష్, దర్శకుడు బాబీ, యంగ్ హీరో సత్యదేవ్ తదితరులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్ తరపున అల్లు అరవింద్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. తనను అభినందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్యరాజన్‌కు ట్విట్టర్ వేదికగా చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.