డైరెక్టర్ మిస్కిన్ పై విశాల్ ఆగ్రహం
ఇళయరాజాపై మిస్కిన్ వ్యాఖ్యలు సరికాదని మండిపాటు
దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు విస్కిన్ పై నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళయరాజా సంగీతం వల్ల తనలాంటి ఎంతో మంది మద్యానికి బానిసలయ్యారని మిస్కిన్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానించే ఇళయరాజాపై మిస్కిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని విశాల్ మండిపడ్డారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని మిస్కిన్ ఇప్పటికే క్షమాపణలు చెప్పినా ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎదుటివారి గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడటం.. తర్వాత క్షమాపణలు చెప్పడం మిస్కిన్ కు పరిపాటిగా మారిందని విశాల్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి తమ మనసుకు అనిపించిన విషయాలపై మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని.. ఆ పేరుతో ఎదుటి వారిని అగౌరవపరచడం మంచిది కాదన్నారు. ఇళయరాజాపై మిస్కిన్ చేసిన వ్యాఖ్యలు క్షమార్హమైనవి కావని మండిపడ్డారు.