తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. కొద్దిసేపటి కిందట ఓటింగ్ స్టార్ట్ అయింది. టాలీవుడ్ లో జరిగే ఎన్నో ఎన్నికల్లాంటిదే ఇది కూడా అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఇక్కడే మెలిక ఉంది. మా అసోసియేషన్ ఎన్నికలు, నిర్మాతల మండలి ఎన్నికల్లో పెద్దోళ్ల హవా నడుస్తుంది. కానీ ఫిలింఛాంబర్ ఎన్నికలు దీనికి పూర్తి భిన్నం. అదెలాగో చూద్దాం..
ఫిలింఛాంబర్ లో సభ్యుల సంఖ్య 1560 మంది. అంటే వీళ్లందరూ నిర్మాతలే. వీళ్లందరికీ బ్యానర్లు ఉన్నాయి. అంతా ఏదో ఒక టైమ్ లో సినిమాలు నిర్మించినవాళ్లే. అయితే వీళ్లలో బడా నిర్మాతల కంటే చిన్న సినిమాల నిర్మాతలే ఎక్కువమంది. ఇక్కడే దిల్ రాజుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
చిన్న సినిమాలను దిల్ రాజు చిన్న చూపు చూస్తున్నారనే విమర్శ చాన్నాళ్లుగా ఉంది. ఓ పెద్ద సినిమా వచ్చినప్పుడు భారీగా దానికే థియేటర్ల కేటాయింపు ఉంటోందని, ఆ టైమ్ లో వచ్చే చిన్న సినిమాలు నలిగిపోతున్నాయనే వాదన ఉంది. దీనికి సంబంధించి చిన్న సినిమాల నిర్మాతలు, దిల్ రాజుపై గుర్రుగా ఉన్నారు. ఆ కోపం ఇవాళ్టి ఎన్నికల్లో కనిపించే ప్రమాదం ఉంది. నిజానికి ఈ విషయంలో దిల్ రాజు ప్రమేయం తక్కువ. పైకి మాత్రం ఆయన పేరు వినిపిస్తుందంతే. ఇదే విషయాన్ని దిల్ రాజు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా.
ఇదొక కారణమైతే.. దిల్ రాజు కోటరీ అంతా పెద్ద నిర్మాతల మయం. సితార, మైత్రీ, సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ మూవీస్, గీతా ఆర్ట్స్.. ఇలా సాగుతుంది ఆయన వ్యాపారం. అటు డిస్ట్రిబ్యూషన్ వింగ్ లో కూడా పెద్దోళ్లంతా దిల్ రాజు వైపే. అదే టైమ్ లో చిన్న నిర్మాతలంతా సి.కల్యాణ్ వైపు ఉన్నారు.
చాలా ఏళ్లుగా చిన్న నిర్మాతల వైపు ఉంటూ వస్తున్నారు సి.కల్యాణ్. వాళ్ల డిమాండ్స్ ను తెరపైకి తీసుకురావడం, వాళ్ల గొంతును వినిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికీ చాలా మంది చిన్న నిర్మాతలు సి.కల్యాణ్ తోనే టచ్ లో ఉంటారు.
ఇప్పుడు ఎన్నికల ఓటింగ్ మొదలైంది. ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేవాళ్లలో చాలామంది చిన్న నిర్మాతలే ఉన్నారు. వాళ్లంతా సి.కల్యాణ్ కే ఓటు వేస్తారనే టాక్ జోరుగా నడుస్తోంది. దీనికితోడు దిల్ రాజు ఇచ్చిన ఓ స్టేట్ మెంట్ కూడా అతడికి ఎదురుతిరిగే ప్రమాదంగా ఉంది.
తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ఒక నిర్మాతకు ఒక ఓటు అనే పద్ధతి లేదు. ఒక బ్యానర్ కు ఒక ఓటు అనే పద్ధతి నడుస్తోంది. ఉదాహరణకు ఓ నిర్మాతకు 5 బ్యానర్లు ఉంటే, అతడు 5 సార్లు ఓటు వేయొచ్చన్నమాట. ఈ పద్ధతి మారాలంటున్నారు దిల్ రాజు. బ్యానర్ కు ఒక ఓటు కాకుండా.. నిర్మాతకు ఒక ఓటు అనే పద్ధతి రావాలంటున్నారు. ఈ వాదన సబబే. కానీ దీనికి ఎంతమంది అంగీకరిస్తారనేది చర్చనీయాంశం.
ఇప్పటికే 10-15 ఓట్లు వేసే నిర్మాతలు ఛాంబర్ లో చాలామంది ఉన్నారు. వాళ్లంతా దిల్ రాజుకు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. ఇటు చిన్న నిర్మాతలతో పాటు.. అటు బహుళ ఓట్లు కలిగిన నిర్మాతలు దిల్ రాజుకు వ్యతిరేకంగా మారితే.. సి.కల్యాణ్ విజయం నల్లేరు మీద నడకే.
అందుకే దిల్ రాజు ఏకగ్రీవం కావాలన్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే పోటీ చేస్తానని కండిషన్ పెట్టారు. కానీ ఏకగ్రీవం కుదరలేదు, పోటీ అనివార్యమైంది. రేసులో మధ్యలోకి వచ్చి ఆగిన దిల్ రాజుకు పోటీలో నిలబడక తప్పలేదు.
అందుకే ఈసారి ఫిలింఛాంబర్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. చిన్న నిర్మాతలు వెర్సెస్ బడా ప్రొడ్యూసర్స్ అనుకోవాలేమో. దిల్ రాజు గెలిస్తే మాత్రం బై-లాస్ మార్చడం ఖాయం.