ఆరు గ్యారంటీలపై రేవంత్‌ కు పాదయాత్ర చేసే దమ్ముందా?

విద్య కమిషన్‌ లో నక్సల్స్‌ భావజాలం ఉన్నోళ్లకు చోటు కల్పిస్తారా : కేంద్ర మంత్రి బండి సంజయ్‌

Advertisement
Update:2024-11-09 19:59 IST

ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలపై పాదయాత్ర చేసే దమ్ముందా అని సీఎం రేవంత్‌ రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. శనివారం కరీంనగర్‌ లోని ఒక థియేటర్‌ లో బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు, జితేందర్‌ రెడ్డి సినిమా యూనిట్‌ తో కలిసి ఆయన సినిమా చూశారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ, ఒక్క హామీ అమలు చేయకుండానే రేవంత్‌ రెడ్డి మహారాష్ట్రకు పోయి అన్ని చేశాం అని పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడని అన్నారు. విద్య కమిషన్‌ లో నక్సల్స్‌ భావజాలం ఉన్న వాళ్లకు చోటు కల్పించి సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారని ప్రశ్నించారు. వెంటనే విద్య కమిషన్‌ ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నాయకులను గతంలో నక్సల్స్‌ దారుణంగా చంపిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. దేశంలో జాతీయ జెండా కోసం సైనికులు, ఏబీవీపీ కార్యకర్తలు మాత్రమే బలయ్యారని అన్నారు. జితేందర్‌ రెడ్డి బాడీ పోస్ట్‌మార్టం చేస్తే రక్తం కన్నా బుల్లెట్లే ఎక్కువ బయట పడ్డాయని ఆనాడు డాక్టర్లు చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు. ఆయనలాగే వందలాది మంది ఏబీవీపీ కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారన్నారు. రేవంత్‌ మహారాష్ట్రకు పోయి అబద్ధాలు చెప్పడం కాదు.. ప్రజల దగ్గరికిపోయి 11 నెలల్లో ఏం చేశారో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. హిమాచల్‌ ప్రదేశ్‌, కర్నాటక, తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి హర్యానా ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని తెలిపారు. దేశంలో 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నందుకు, 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేసినందుకు, ట్రైబల్‌ యూనివర్సిటీ ఇచ్చినందుకు, ట్రిపుల్‌ ఆర్‌ కు నిధులు ఇస్తున్నందు, స్మార్ట్‌ సిటీలు ఇచ్చినందుకు, గ్రామాలు, నేషనల్‌ హైవేలకు నిధులు ఇస్తున్నందుకు బీజేపీపై రేవంత్‌ యుద్ధం చేస్తారా అని ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News