మరో సినిమా ప్రకటించే ఆలోచనలో రవితేజ
ప్రస్తుతం రవితేజ చేతిలో 3-4 సినిమాలున్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు మరో సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మూవీ ఉండే ఛాన్స్ ఉంది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం రవితేజ స్టయిల్. తను నటించిన సినిమాలు హిట్టవుతున్నాయా, ఫ్లాప్ అవుతున్నాయా, అసలు ఎలా ఉన్నాయనే సంగతి ఈ హీరోకు అనవసరం. ఓ సినిమా కంప్లీట్ అయిన వెంటనే మరో సినిమాను లైన్లో పెడుతుంటాడు. ఈ క్రమంలో ఇప్పుడు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు రవితేజ.
సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీకి ఈగల్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇంతకుముందు నిఖిల్ హీరోగా నటించిన సూర్య వెర్సెస్ సూర్య సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు కార్తీక్ ఘట్టమనేని. తర్వాత సినిమాటోగ్రాఫర్ గానే కెరీర్ కొనసాగిస్తూ వచ్చాడు. ఇప్పుడు మరోసారి మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు.
ఈ ప్రాజెక్టును పీపుల్ మీడియా బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇదే బ్యానర్ పై ధమాకా అనే సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ మూవీతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే సినిమా, వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు ప్రాజెక్ట్ కూడా నడుస్తోంది. వీటితో పాటు చిరంజీవి నటిస్తున్న ఓ సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
వీటిలో ధమాకా ముందుగా రిలీజ్ అవుతుంది. అది థియేటర్లలోకి వచ్చిన వెంటనే ఈగల్ సినిమా మొదలవుతుంది.