బ్లూ ఫిల్మ్‌లా.. వెబ్ సిరీస్‌లా.. ఇంట్లో అందరితో కలిసి చూసే పరిస్థితి ఉందా?
ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఉన్నాడు కదా.. అని కుటుంబ సమేతంగా చూడటం మొదలుపెట్టి.. ఆ తర్వాత అందులోని అసభ్య సన్నివేశాలు చూడలేక నిమిషాల వ్యవధిలోనే టీవీలను కట్టేస్తున్నారు.
సినిమాల్లో ఏ మాత్రం అసభ్యకర సన్నివేశాలున్నా అభ్యంతరం వ్యక్తం చేయడానికి సెన్సార్ బోర్డు సభ్యులు ఉన్నారు. అయితే ఓటీటీలకు మాత్రం సెన్సార్ అవసరం లేదు. కరోనా సమయం నుంచి ఓటీటీ యాప్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. కొత్తగా వస్తున్న టీవీలు ఓటీటీ యాప్ లను సపోర్ట్ చేస్తుండటంతో ఇంటిల్లిపాది కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఇంట్లోనే కూర్చొని చూస్తున్నారు.
అయితే రెండు మూడేళ్ల కిందట కొన్ని కొన్ని వెబ్ సిరీస్ లలోనే అడల్ట్ కంటెంట్ ఉండేది. కానీ, ఇప్పుడొచ్చే ప్రతి వెబ్ సిరీస్ లో అసభ్యకర సన్నివేశాలు ఉంటున్నాయి. ప్రతి ఎపిసోడ్ లో కనీసం ఒక్క బూతు సీన్ అయినా ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేసుకుంటున్నారు.
దానికి తోడు సిరీస్ మొత్తం బూతు మాటలు ఉండేలా స్క్రిప్ట్ రాసుకుంటున్నారు. మీర్జాపూర్, రాస్ భరీ వంటి వెబ్ సిరీస్ లు హిట్ అయిన తర్వాత ప్రతి వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటీవల వెంకటేష్, రానా కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై తీవ్ర విమర్శలకు గురవుతోంది. దీనిని చూసిన వారందరూ అందులోని అడల్ట్ కంటెంట్ చూసి షాక్ అవుతున్నారు.
ఫ్యామిలీ హీరో వెంకటేష్ ఉన్నాడు కదా.. అని కుటుంబ సమేతంగా చూడటం మొదలుపెట్టి.. ఆ తర్వాత అందులోని అసభ్య సన్నివేశాలు చూడలేక నిమిషాల వ్యవధిలోనే టీవీలను కట్టేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ను చూసిన సీనియర్ నటుడు శివకృష్ణ మాట్లాడుతూ.. అదొక బ్లూ ఫిలిం అని పేర్కొన్నాడు. ఇంట్లో అందరి ముందర ఆ సిరీస్ చూడలేకపోయానని, పిల్లలు వచ్చినప్పుడు ఆపేసినట్లు చెప్పాడు. ఓటీటీలను కూడా సెన్సార్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డాడు.
తాజాగా రానా నాయుడు సిరీస్ పై నటి విజయశాంతి కూడా స్పందించారు. రానానాయుడు పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఈ సిరీస్ పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటీటీలను కూడా కఠినమైన సెన్సార్ విధానంలోకి తీసుకురావాలని సూచించారు. మహిళల్లో ఈ సిరీస్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, దీనిని నిర్మాతలు వెంటనే యాప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని మరింత గౌరవంతో నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా అంటూ.. పరోక్షంగా వెంకటేష్ పై విమర్శలు చేశారు విజయశాంతి. కాగా, రానానాయుడు రెండు, మూడో భాగాలకు కూడా వెంకటేష్ కమిట్ అయ్యాడు. ఈ సిరీస్ పై భారీ ట్రోల్స్ వచ్చిన నేపథ్యంలో మిగిలిన భాగాల్లో ఆయన నటిస్తాడా..? లేక తప్పుకుంటాడా..? అన్నది ప్రశ్న.