నిర్మాతల మండలి సమావేశం.. తాజా అప్ డేట్స్ ఇవే!
నిర్మాతల మండలి తాజా సమావేశంలో కొన్ని కీలక అంశాలపై నిర్ణయాలు కొలిక్కి వచ్చాయి.. అవేంటో చూద్దాం..
తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలనే అంశంపై ప్రొడ్యూసర్లంతా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే అంశంపై సీరియస్ గా చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా టికెట్ రేట్ల తగ్గింపు, ఓటీటీ రిలీజ్ లాంటి అంశాలు కీలకంగా మారాయి.
నిన్న జరిగిన సమావేశంలో ఓ కీలకమైన అంశంపై మాత్రం అంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. పెరిగిన నిర్మాణ వ్యయాన్ని అదుపులో పెట్టేందుకు, షూటింగ్స్ కొన్నాళ్లపాటు ఆపేయాలని గతంలో అనుకున్నారు. అలాంటి చర్యలకు దిగొద్దని నిర్మాతలు నిర్ణయించారు. షూటింగ్ లు బంద్ చేద్దామా లేక కొత్తవి మొదలు పెట్టకుండా జరుగుతున్న సినిమాల వరకు మాత్రమే షూటింగ్ లు కొనసాగించాలా అనే అంశంపై డిస్కస్ చేసిన మండలి.. అన్ని రకాల సినిమా షూటింగ్స్ ను కొనసాగించాలనే నిర్ణయం తీసుకుంది.
ఇక పని వేళలు, ఫిలిం ఫెడరేషన్ సభ్యుల డిమాండ్లు, కార్మికుల వేతనాలు, పైటర్స్ యూనియన్ సమస్యలు, నటులు-టెక్నీషియన్స్ సమస్యలు, మేనేజర్ల పాత్ర లాంటి అంశాలపై కూడా నిర్మాతలు కొన్ని కీలక సూచనల్ని పొందుపరిచారు.
రేపు ఈ మొత్తం వ్యవహారంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 23వ తేదీన జరిగే సమావేశంలో అన్ని విభాగాలకు చెందిన ప్రతినిధులతో కూర్చొని, అంతిమ నిర్ణయాలు తీసుకుంటామని చెబుతున్నారు నిర్మాతలు. తాజాగా జరిగిన సమావేశానికి దిల్ రాజు, సునీల్ నారంగ్, అభిషేక్ నామా, ఠాగూర్ మధు, శ్రీనివాసా చిట్టూరి లాంటి యాక్టివ్ ప్రొడ్యూసర్లు హాజరయ్యారు. వీళ్లంతా కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు
మరీ ముఖ్యంగా టికెట్ రేట్లకు సంబంధించి ఇంతకుముందు మేజర్, విక్రమ్ సినిమాలకు ఎలాంటి టికెట్ రేట్లు ఉన్నాయో.. ఆ రేట్లనే భవిష్యత్తులో కొనసాగించే అవకాశం ఉందని దిల్ రాజు ఇప్పటికే పరోక్షంగా వెల్లడించారు. దాదాపు అవే రేట్లను, థాంక్యూ సినిమాకు కూడా ఫిక్స్ చేశామని, రాబోయే రోజుల్లో ప్రతి సినిమాకు ఇవే రేట్లు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి రేపటి కీలక నిర్ణయాల్లో ఇది కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు సినీ కార్మికుల వేతనాలపై కూడా రేపు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.