షాకింగ్.. గాడ్ ఫాదర్ సినిమాని అమ్మలేదంట!
గాడ్ ఫాదర్ మూవీ ని ఎవరికీ అమ్మలేదని బాంబ్ పేల్చారు నిర్మాత ఎన్వీ ప్రసాద్. ఇంతకీ ఏం జరిగింది?
గాడ్ ఫాదర్ సినిమా హిట్టయిన మాట వాస్తవమే. కాకపోతే ఆ సినిమాకు చిరంజీవి ఇమేజ్ కు ఉన్నంత రేంజ్ లో వసూళ్లు రావడం లేదు. విడుదలైన మొదటి రోజు మేకర్స్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు, రెండో రోజు కూడా మరో పోస్టర్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు అవి కూడా ఆపేశారు. ఇప్పుడు ఏకంగా మాట మార్చేశారు.
గాడ్ ఫాదర్ సినిమాను అసలు అమ్మలేదంటున్నారు నిర్మాత ఎన్వీ ప్రసాద్. తెలుగు రాష్ట్రాల్లో తమ సినిమాను సొంతంగా రిలీజ్ చేశామంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 60 కోట్ల షేర్ వచ్చిందని.. ఒక్క అమెరికాలోనే 2 మిలియన్ మార్క్ టచ్ అయిందని చెబుతున్నారు.
ఇక హిందీలో మొదటి వారం 10 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చిందని తెలిపారు. ఇక టికెట్ రేట్లపై స్పందిస్తూ, సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే టికెట్ రేట్లు పెంచకూడదని తామంతా కలిసి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు ప్రసాద్.
"టికెట్ ధరలు పెంచాలనే ఆలోచన మొదటి నుండి లేదు. మన సినిమాలకి మన ఆడియన్స్ కి ఈ రేట్లు సరిపోతాయి. గాడ్ ఫాదర్ ఎగ్జిబిటర్లు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. కోవిడ్ నుండి కూడా ఇండస్ట్రీ దాదాపు బయటపడింది. ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకొని వారి అభిరుచికి తగిన కథలు ఎంపిక చేసుకోవాలి."
రేపు గాడ్ ఫాదర్ సినిమా తమిళ వెర్షన్ తమిళనాట విడుదలకానుంది. మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ కు పోటీగా తమ సినిమాను రిలీజ్ చేయడం ఇష్టం లేక గాడ్ ఫాదర్ ను వారం రోజులు వాయిదా వేసినట్టు తెలిపారు ఎన్వీ ప్రసాద్.