ఓటీటీలు ఇక చిన్న సినిమాలు తీసుకోవు!

మనదేశంలో ఓటీటీ చందా దారుల సంఖ్య మహమ్మారి తర్వాత పెరిగినా, ఆదాయం కోసం ప్లాట్ ఫామ్స్ కష్టపడుతూనే వున్నాయి.

Advertisement
Update:2023-01-10 13:08 IST

ఓటీటీలు థియేటర్లని, ఛానెళ్ళని బీట్ చేసి వాటి ఆదాయాల్ని మింగేస్తూ వచ్చే ఏటికల్లా దేశంలో 12 వేల కోట్ల రూపాయల బృహత్ పరిశ్రమగా -పెద్దన్నగా- సింహాసనాన్ని అధిష్టిస్తుందన్న అంచనాలని తలకిందులు చేస్తూ ఇరకాటంలో పడుతున్న సూచనలందుతున్నాయి.

దీని ప్రకంపనలు టాలీవుడ్ లో సైతం కనిపిస్తున్నాయి. ఓటీటీలకి ప్రకటనల ఆదాయం (యాడ్ రెవెన్యూ) తగ్గిపోవడం ఇందుకు కారణం. ప్రకటనల రాబడిలో 30-40% పతనంతో ఓటీటీలు కంటెంట్ సముపార్జన గురించి ప్రత్యేకించి జాగ్రత్త వహిస్తున్నాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నిర్వహణకయ్యే మొత్తం ఖర్చుల్లో సుమారు 80% కంటెంట్ ని పొందడానికే వ్యయమవుతోంది.

ఇంకోటేమిటంటే, వినియోగదారులు టెలివిజన్ విషయంలో లాగే ఓటీటీల్లో సైతం తక్కువ సమయం గడిపే అలవాటు క్రమంగా వ్యాప్తి చెందుతోందా అన్న సందేహాలు వెంటాడుతున్నాయి. బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లలో చందాదారుల నుంచి రాబడి 67 % తగ్గినట్టు నివేదికలున్నాయి. 2022 మూడవ త్రైమాసికంలో బ్రిటన్లోని మూడు లక్షల 50 వేల కుటుంబాలు తమ సభ్యత్వాలని పునరుద్ధరించుకోలేదని తెలుస్తోంది.

మన దేశంలో ప్రకటనల ఆధారంగా నడిచే వీడియో ఆన్ డిమాండ్ (విఓడి) మార్కెట్లో ప్రకటనల రాబడిలో భారీ తగ్గుదల నమోదైంది. డిజిటల్ యాడ్స్ రాబడిలో 20% ఆకర్షించే నవీన యుగం కంటెంట్ ప్లాట్ ఫామ్స్ (ఓటీటీలు) 30%-40% భారీ కోతకు గురయ్యాయి.

అతిపెద్ద ప్రకటనదారులైన ఎఫ్‌ఎంసిజి (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్- త్వరితంగా అమ్ముడయ్యే పాలు, పళ్ళు, కూరగాయలు, కిరాణా, ఇతర జనరల్ స్టోర్స్ సరుకులు) తోబాటు, ఆటోమోబైల్ వంటి రంగాలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్ళని ఎదుర్కొంటున్నాయి. అందువల్ల చాలా మంది ప్రకటనదారులు తమ మార్కెటింగ్ ఖర్చుని తగ్గించుకుంటున్నారు.

దీని ప్రభావం ఓటీటీలపై పడుతోంది. ప్రకటనలతో బాటు సబ్‌స్క్రిప్షన్ రాబడిలో తగ్గుదల ఓటీటీ కంటెంట్ ని ప్రభావితం చేస్తోంది. చాలా ప్లాట్ ఫామ్స్ బిగ్ బడ్జెట్ సినిమాలని హోల్డ్ లో వుంచడమే గాకుండా, బాక్సాఫీసు పరంగా ప్రూవయిన కంటెంట్ కోసం వెతుకులాటలో పడ్డాయి.

కంటెంట్ సృష్టికర్తలతో ప్రయోగాలు చేయడం మాని, యూనివర్సల్ అప్పీలుండే కమర్షియల్ కంటెంట్ క్రియేటర్లని మాత్రమే అన్వేషిస్తున్నాయి. డిస్నీ ప్లస్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి కంపెనీలైతే ప్రకటనల మార్కెట్ తిరోగమనం కారణంగా - కంటెంట్ పై వ్యయాన్ని తగ్గించడానికి తక్కువ బడ్జెట్ లో పూర్తయ్యే భారత్ వంటి దేశాల్లో తమ షోస్ ని షూట్ చేసే ఆలోచనలో పడ్డాయి.

టెలివిజన్‌లో కూడా కంటెంట్ ఖర్చుల క్రమ బద్ధీకరణ జరుగుతోంది. చాలా టీవీ ఛానెల్స్ రియాల్టీ షోలపై తమ వ్యూహాన్ని పునః పరిశీలిస్తున్నట్టు ప్రముఖ కంటెంట్ ప్రొడక్షన్ కంపెనీ అధినేత చెప్పారు. రియాలిటీ షోస్ కి ఫిక్షన్ కంటే మూడు రెట్లు ఎక్కువ ఖర్చవుతుంది. అయితే ప్రకటనల డబ్బుని కూడా అంతే ఆకర్షిస్తుంది. ప్రకటనదారులు బడ్జెట్స్ ని బిర్ర బిగించడంతో, ఛానెల్స్ రియాలిటీ షోస్ ని తగ్గించుకునే ఆలోచనలో వున్నాయి. ఇందుకు స్టార్ ఛానెల్ వైపు చూస్తున్నాయి. స్టార్ కేవలం ఒకే ఒక్క రియాలిటీ షోని, అదీ వారాంతాల్లో ప్రసారం చేస్తోంది.

మనదేశంలో ఓటీటీ చందా దారుల సంఖ్య మహమ్మారి తర్వాత పెరిగినా, ఆదాయం కోసం ప్లాట్ ఫామ్స్ కష్టపడుతూనే వున్నాయి. 140 కోట్ల జనాభా గల మన దేశంలో 35.32 కోట్ల మంది ఓటీటీ చందాదారులున్నారు. అయితే మహమ్మారి లాక్ డౌన్ సమయాల నుంచే ఓటీటీల ప్రకటనల ఆదాయం తగ్గి, ఇప్పుడు ద్రవ్యోల్బణం కారాణంగా మరింత పతనమై నానా యాతనలు పడుతున్నాయి. లైబ్రరీల్లో చూపించుకోవడానికి కంటెంట్ ని నింపేస్తున్నా ఆ మేరకు ఆదాయం పెరగకపోవడానికి ప్రకటనల కొరతే కారణం. దీంతో కంటెంట్ పై కోత విధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ కోత టాలీవుడ్ కీ వర్తిస్తోంది.

ఇకపై చిన్న సినిమాలని నేరుగా తీసుకునేది లేదు. థియేటర్లో విడుదల చేస్తేనే తీసుకునే విషయం పరిశీలించాలని నిర్ణయించారు. థియేటర్లో విడుదల చేయడం మౌలిక అర్హత పొందడమవుతుంది. ఆ పై తీసుకోవాలావద్దా అన్నది క్వాలిటీపై ఆధారపడుతుంది. నేరుగా తీసుకుంటే పబ్లిసిటీ ఖర్ఛుల భారం ఓటీటీల పైనే పడుతుంది. అందుకని ఆ పబ్లిసిటీ ఖర్చులు నిర్మాతలే భరించుకుని, థియేట్రికల్ విడుదల చేసుకుని రావాల్సి వుంటుంది.

చిన్న సినిమాలకి బయ్యర్లు వుండరు. నిర్మాతలే విడుదల చేసుకుని, రెంటల్స్ భరించి కనీసం మూడు రోజులు ఆడించుకుంటే తప్ప ఓటీటీకి నో ఛాన్స్. అప్పుడుకూడా క్వాలిటీ వుంటేనే ఓటీటీ ఒప్పందం. ఆ ఒప్పందంలో పే పర్ వ్యూ క్లాజ్. ఇది ఇప్పుడున్నదే. కాబట్టి చిన్న సినిమాలు తీసేముందు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. 2022 లో 250 చిన్న సినిమాలు తీసినట్టు ఇకపై సాధ్యం కాకపోవచ్చు.

Tags:    
Advertisement

Similar News