గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై మరోసారి సెటైర్‌ ట్వీట్‌

Advertisement
Update:2024-09-26 14:30 IST

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రశ్నల దాడి కొనసాగుతూనే ఉన్నది. # జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ వివిధ అంశాలపై లేవనెత్తున్నారు. ఎవరిని ఉద్దేశించి పోస్టులు పెడుతున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తిరుమల లడ్డూ మహా ప్రసాదం కల్తీపై ఎక్స్‌ వేదికగా ప్రకాశ్‌రాజ్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారిన విషయం విదితమే. దీనిపై ప్రాయశ్చిత దీక్షలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ ప్రకాశ్‌రాజ్‌ పోస్టులపై ఫైర్‌ అయ్యారు. ప్రకాశ్‌ రాజ్‌ అంటే తనకు గౌరవం ఉందంటూనే.. సున్నిత అంశాలపై ఆయన తెలుసుకుని మాట్లాడాలని.. విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని, సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

దీనిపై స్పందించిన ప్రకాశ్‌రాజ్‌ ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్‌ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను అన్నారు. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్‌ చేశారు. 'పవన్‌ కల్యాణ్‌ గారు.. ఇప్పుడే మీ ప్రెస్‌మీట్‌ చూశా. నేను చెప్పిన దానిని మీరు అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నాను. ఈ నెల 30 తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాను. ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి' అని పేర్కొన్నారు.

అప్పటి నుంచి ఆయన వరుసగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. 'చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్‌ ఆస్కింగ్‌ అని నిన్న పోస్ట్‌ చేయగా.. 'గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకీ మనకీ అయోమయం...ఏది నిజం # జస్ట్‌ ఆస్కింగ్‌!' అని తెలుగులో మరో పోస్ట్‌ పెట్టారు. ఇది ఇప్పడు సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నది. 

Tags:    
Advertisement

Similar News