శివుడి సినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్!

మొదట టీజర్ కి ‘యూ’ సరిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. తర్వాత ట్రైలర్ కి ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇప్పుడు సినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఒకే సినిమాకి మూడు రకాల సర్టిఫికెట్లు! అక్షయ్ కుమార్ నటించిన ‘ఓఎంజీ (ఓమైగాడ్)-2’ మొత్తం మీద సెన్సార్ ఇక్కట్లనుంచి బయట పడి ప్రకటించిన తేదీ ఆగస్టు 11 న విడుదలవుతోంది.

Advertisement
Update:2023-08-01 18:22 IST

మొదట టీజర్ కి ‘యూ’ సరిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. తర్వాత ట్రైలర్ కి ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇప్పుడు సినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఒకే సినిమాకి మూడు రకాల సర్టిఫికెట్లు! అక్షయ్ కుమార్ నటించిన ‘ఓఎంజీ (ఓమైగాడ్)-2’ మొత్తం మీద సెన్సార్ ఇక్కట్లనుంచి బయట పడి ప్రకటించిన తేదీ ఆగస్టు 11 న విడుదలవుతోంది. గత రెండు వారాలుగా సెన్సార్ లో నలుగుతూ వివాదాస్పదంగా మారిన ‘ఓఎంజీ -2’ ఇప్పుడు సన్నీడియోల్ నటించిన ‘గదర్ -2’ తో ఎట్టకేలకు తలపడేందుకు సిద్ధమైంది.

ఈ రోజు తాజా సమాచారం ప్రకారం ‘ఓఎంజీ -2’ ‘ఏ- పెద్దలకు మాత్రమే' సర్టిఫికెట్ పొందింది. అక్షయ్ శివుడి ప్రధాన పాత్ర పోషిస్తున్న శివుడి సినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్ ఏమిటని విస్మయానికి గురవుతున్న వాళ్ళకి ఇది సెక్స్ ఎడ్యుకేషన్ సినిమా అని తెలీదు. పిల్లలకి పాఠశాలల్లో లైంగిక విజ్ఞానం నేర్పాలని సందేశమిచ్చే సినిమాలో శివుడు ఎలా వచ్చాడన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఆగష్టు 11న ‘గదర్ -2’ తో తలపడుతూ విడుదల కావాల్సిన ‘ఓఎంజీ -2’ కి మొదట చాలా సెన్సార్ సెన్సార్ బ్రేకులు పడ్డాయి. సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, సూచించిన కట్ లు, ఏకంగా అక్షయ్ కుమార్ పాత్ర మార్పూ కలిసి విడుదలకి ముందే వివాదంలో చిక్కుకుంది ఈ శివ భక్తి సినిమా. ఎంత శివుడైతే మాత్రం సెక్స్ ఎడ్యుకేషన్ సినిమాలో చూపిస్తారా అంది సెన్సార్ బోర్డు. రామాయణం మీద ‘ఆదిపురుష్’ లాంటి దారుణమైన సినిమాకి ఉదారంగా అనుమతి ఇచ్చేసి అవమానాల పాలైన సెన్సార్ బోర్డు, శివుడి సినిమా విషయంలో అలాటి అపరాధం ఇంకెంత మాత్రం చేయకూడదని నిర్ణయించుకుంది. నిర్మాతలు కూడా తగ్గే ప్రసక్తే లేదని కూర్చున్నారు. రెండువైపులా పట్టుదలలతో సినిమా విడుదల తేదీ నిన్నటి వరకూ సందిగ్ధంలో పడింది.

చివరికి సినిమాలో 35 కట్ లతో బాటు, అక్షయ్ కుమార్ శివుడి పాత్రని శివుడి దూత పాత్రగా మారిస్తే ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పింది సెన్సార్ బోర్డు. అన్ని కట్లు చెప్తే సినిమా కథే ముక్కలవుతుందని నిర్మాతలు అంగీకరించలేదు. అయితే కట్లు లేకుండా, శివుడి పాత్రని మార్చకుండా, ‘ఏ’ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు తేల్చి చెప్పడంతో, విడుదల వొత్తిడితో వున్న నిర్మాతలు దిగిరాక తప్పలేదు. ఇదీ శివుడి సినిమాకి ‘ఏ’సర్టిఫికెట్ వెనకున్న కథ.

2012 లో ఇదే అక్షయ్ కుమార్ నటించిన సూపర్ హిట్ ‘ఓమైగాడ్’ కి ‘ఓఎంజీ-2’ సీక్వెల్ కాని సీక్వెల్. ‘ఓ మైగాడ్’ తెలుగులో రీమేకైంది. ‘ఓ మై గాడ్’ హిందీ ఒరిజినల్లో అక్షయ్ కుమార్ శ్రీ కృష్ణుడి పాత్ర ధరిస్తే, పరేష్ రావల్ నాస్తికుడైన విగ్రహాల వ్యాపారిగా నటించాడు. ఇప్పుడు ‘ఓఎంజీ -2’ కథా కథనాలు తెలుసుకున్న బిజెపి పక్షపాతియైన పరేష్ రావల్ ఇందులో నటించడానికి ఒప్పుకోలేదు. దీంతో శివ భక్తుడి పాత్ర పంకజ్ త్రిపాఠీ నటించాడు. అమిత్ రాయ్ రచన, దర్శకత్వం వహించిన ఈ వ్యంగ్య హాస్య రస ప్రధాన మూవీలో ఇంకా యామీ గౌతమ్, గోవింద్ నామ్‌దేవ్, అరుణ్ గోవిల్ లు కీలక భూమికలు పోషించారు.

ఇక సెన్సార్ బోర్డుతో గట్టెక్కగానే,స్వాములతో సమస్య ఎదురైంది. ఉజ్జయిని పుణ్యక్షేత్రంలో చిత్రీకరించిన దృశ్యాల్ని తొలగించాలని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయానికి చెందిన పూజారి డిమాండ్ చేయడంతో నిర్మాతలు ఇరుకున పడ్డారు. మహాకాల్ ఆలయంలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు వీక్షకుల మతపరమైన మనోభావాలని కించపరిచేలా వున్నాయనీ, వాటిని తొలగించాలనీ, లేకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామనీ పూజారి నుంచి హెచ్చరిక వెలువడింది.

అనేక వరుస ఫ్లాపుల తర్వాత అక్షయ్ కుమార్ ఆశలు పెట్టుకున్న మూవీ ఇది. 2012 నాటి ‘ఓమైగాడ్’ పేరుని వాడుకుని తిరిగి ప్రాచుర్యంలోకి రావాలన్న ప్రయత్నమిది. ‘ఓ మై గాడ్’ తెలుగు రీమేక్ ‘గోపాల గోపాల’ లో పవన్ కళ్యాణ్- వెంకటేష్ నటించారు. ఇది హిట్టయ్యింది. వాస్తవంగా ‘ఓమైగాడ్’ మరాఠీ నాటకం ఆధారంగా తీశారు. ఉమేశ్ శుక్లా దర్శకత్వం వహించాడు. 60 కోట్ల బడ్జెట్ కి 193 కోట్ల బాక్సాఫీసు వచ్చింది. ఇందులో నాస్తికుడైన విగ్రహాల వ్యాపారి దేవుణ్ణి చులకనగా చూస్తాడు. ఒకరోజు భూకంపం వచ్చి వూరంతా బావుండి తన షాపు ఒక్కటే ధ్వంసం అవుతుంది. నాస్తికుడికి దేవుడు బాగా బుద్దిచెప్పాడని అనుకుంటారు జనం. ఈ దైవిక ఘటనకి బీమా లేదు పొమ్మంటే వెళ్ళి కోర్టులో నష్టపరిహారం కోసం దేవుడి మీద కేసు వేస్తాడు. చాలా వ్యంగ్యం, హాస్యంతో కూడిన ఆలోచనాత్మక మూవీ ఇది. ఇప్పుడు పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ అని చెబుతున్న ‘ఓఎంజీ-2’ ఇప్పుడున్న మనోభావాలు దెబ్బతినే వాతావరణ పరిస్థితుల్లో ఏమవుతుందో 11వ తేదీ చూడాలి!

Tags:    
Advertisement

Similar News