సీఎం ను కలిసే యోచనలో తెలుగు సినీ ప్రముఖులు
తెలంగాణలో ఇకపై ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని, సినిమా టికెట్ల ధరలు పెంచబోమన్న ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ఈ నిర్ణయం
సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే యోచనలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నారు. ఈ మేరకు నిర్మాత నాగవంశీ తెలిపారు. అమెరికాలో ఉన్న నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక సీఎంను కలుస్తామని చెప్పారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చిస్తామని నాగవంశీ తెలిపారు.
అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటన పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా పెద్దలకు నేను ఒకటే చెబుతున్నా. సినిమాలు తీసుకోండి. వ్యాపారం చేసుకోండి. డబ్బులు సంపాదించుకోండి. ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సహకాలు పొందండి. ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. అది మా ప్రభుత్వ విధానం. కానీ సినీ పరిశ్రమ అమానవీయంగా ఉండవద్దని హెచ్చరించారు. ప్రకటించారు. మంత్రి కోమటిరెడ్డి కూడా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున 25 లక్షల చెక్కును అందించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఇకపై ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని, సినిమా టికెట్ల ధరలు పెంచబోమన్నారు. ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖులు సీఎంను కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.