Yatra 2 | యాత్ర-2 నట్టికుమార్ కన్ను
Yatra 2 - వ్యూహం మళ్లీ రివ్యూ కమిటీ వద్దకు చేరింది. ఇప్పుడు యాత్ర-2 వంతు వచ్చింది. ఈ సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు నట్టికుమార్.
వైఎస్ జగన్ కు అనుకూలంగా తీసిన వ్యూహం సినిమా సంగతి ఏమైందో తెలిసిందో. సెన్సార్ పూర్తయినప్పటికీ ఆ సినిమా థియేటర్లలోకి రాలేదు. తెలంగాణ హైకోర్టు, వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేసింది. రివ్యూ కమిటీ మరోసారి సినిమా చూడాలని ఆదేశించింది. ఇప్పుడు యాత్ర-2కు కూడా అదే సెగ తగిలేలా ఉంది.
మహి వి రాఘన్ తెరకెక్కించిన సినిమా యాత్ర-2. యాత్ర సినిమాలో వైఎస్ఆర్ రాజకీయ జీవితాన్ని అద్భుతంగా చూపించిన మహి వి రాఘవ్.. యాత్ర-2లో వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణాన్ని చూపించాడు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫీవర్ ఊపందుకున్న వేళ, ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడం తగదంటున్నాడు నిర్మాత నట్టికుమార్.
తెలుగు రాజకీయ కథా చిత్రం "యాత్ర-2" సెన్సార్ ను లోక్ సభ ఎన్నికల తర్వాతే చేయాలన్న అభిప్రాయాన్ని ప్రముఖ నిర్మాత, ఫిలిం డిస్ట్రిబ్యూటర్, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు నట్టి కుమార్ వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు.
నారా చంద్రబాబు నాయుడుకు, కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీకి వ్యతిరేకంగా యాత్ర-2 సినిమా తీయడంతో పాటు వారి పాత్రలను కించపరుస్తూ, వ్యంగ్యంగా ఈ చిత్రంలో చిత్రీకరించారని ఆయన వివరించారు. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌నే ఇందుకు ఓ ఉదాహరణ అని, వారితో దగ్గరి పోలికలు ఉన్న ఆర్టిస్టులను ఈ సినిమాలో పెట్టి కుట్రదారులుగా చూపించారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియాగాంధీని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడును చులకనగా చూపించడం వెనుక.. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలన్న ఉద్దేశ్యం కనిపిస్తోందని తెలిపారు.