May Box Office | గత నెల ఒక్క హిట్ లేదు
May Month Tollywood Review - మే నెలలో దాదాపు 25 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఎన్ని హిట్టయ్యాయి? ఏ సినిమా క్లిక్కయింది?
టాలీవుడ్ చరిత్రలో మరో నెల కలిసిపోయింది. పాతిక సినిమాలు రిలీజ్ అయితే, ఒక్కటి కూడా హిట్ స్టేటస్ అందుకోలేకపోయింది. ఎటుచూసినా ఫ్లాపులు, డిజాస్టర్లు, కాస్ట్-ఫెయిల్యూర్స్. కనీసం యావరేజ్ టాక్ సినిమాలు కూడా లేకపోవడం బాధాకరం.
మే నెల మొదటి వారంలో... ఆ ఒక్కటి అడక్కు, బాక్, ప్రసన్న వదనం, శబరి, ది ఇండియన్ స్టోరీ, వకీల్ సాబ్ (రీ-రిలీజ్) అయ్యాయి. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాపై మాత్రమే ఓ మోస్తరు అంచనాలుండేవి. కానీ ఈ సినిమాతో పాటు, మిగతా సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి.
రెండో వారంలో.. ప్రతినిధి 2, బ్రహ్మచారి, కృష్ణమ్మ, లక్ష్మీకటాక్షం, ఆరంభం సినిమాలొచ్చాయి. సరిగ్గా ఎన్నికల టైమ్ చూసి ప్రతినిధి-2 రిలీజ్ చేశారు. కానీ ఆ ఎత్తుగడ ఫలించలేదు. సినిమా డిజాస్టర్ అయింది. ఎన్నికల భాషలో చెప్పాలంటే డిపాజిట్లు కూడా దక్కలేదు. మిగతా సినిమాల గురించి మాట్లాడ్డం కూడా అనవసరం.
మూడో వారంలో.. మిరల్, దర్శిని, నటరత్నాలు, అక్కడ వారు ఉన్నారు, అపరిచితుడు (రీ-రిలీజ్) సినిమాలొచ్చాయి. ఇవి కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. అసలీ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయనే విషయాన్ని కూడా ఆడియన్స్ గుర్తించకపోవడం బాధాకరం.
నాలుగో వారంలో.. లవ్ మీ, బిగ్ బ్రదర్, వ్యాన్, సిల్క్ శారీ, డర్టీ ఫెలో, సీడీ సినిమాలు రాగా.. విడుదలకు ముందు లవ్ మీ మాత్రమే ఎట్రాక్ట్ చేసింది. ఎందుకంటే ఇది దిల్ రాజు సినిమా. దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ నటించిన సినిమా. కీరవాణి, పీసీ శ్రీరామ్ లాంటి టెక్నీషియన్స్ పనిచేసిన సినిమా. అయితే ఇవేవీ పనిచేయలేదు. సినిమా ఫ్లాప్ అయింది. దీంతోపాటు వచ్చిన మిగతా సినిమాలదీ అదే దారి.
మే 31వ తేదీన.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, హిట్ లిస్ట్, గం గం గణేశ, భజే వాయువేగం సినిమాలొచ్చాయి. వాటిలో హిట్ లిస్ట్ ఫ్లాప్ అవ్వగా, మిగతా 3 సినిమాలు థియేటర్లలో నిలదొక్కుకోవడానికి కుస్తీ పడుతున్నాయి.