తమిళనాట సినిమా తారల రాజకీయ రంగ ప్రవేశం జోరందుకుంటోంది. రెండు రోజుల కిందటే అగ్ర హీరో విజయ్ పార్టీ ప్రారంభించారు. ఇప్పుడు అదే దారిలో మరో హీరో విశాల్ కూడా ప్రయాణం మొదలుపెట్టబోతున్నారు. త్వరలోనే ఆయన పార్టీ పెట్టబోతున్నారు.
ఇంట గెలిచి.. రచ్చగెలవాలని ప్రయత్నం
తెలుగువాడైన విశాల్ కృష్ణారెడ్డి (విశాల్)కు కోలీవుడ్‌లో మంచి ఆదరణ ఉంది. దీంతోపాటు సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారం కోసం పాటుపడే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘం, నిర్మాతల మండలి ఎన్నికల్లో గెలిచారు. సినీపరిశ్రమలో ఇంట గెలిచానని.. ఇక రచ్చ గెలవడమే తరువాయి అన్నట్లుగా రాజకీయ రంగ ప్రవేశం కోసం ప్రయత్నించారు.
ఆర్‌కేనగర్ ఉప ఎన్నికలో నామినేషన్.. తిరస్కరణ
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆర్‌కేనగర్‌కు ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో పోటీకి విశాల్ నామినేషన్ వేశారు. అయితే అది తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో విశాల్ తన అభిమాన సంఘాన్ని విశాల్ మక్కల్ నల ఇయక్కం (విశాల్ ప్రజా సంక్షేమ సంఘం)గా మార్చి ప్రతి జిల్లాలోనూ ఇన్‌ఛార్జులను నియమించారు. ఇప్పుడు దాన్ని పార్టీగా మార్చి ముందుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.