Indian 2 | భారతీయుడు వెనక అసలు కథ ఇది
Kamal Haasan Bharateeyudu - భారతీయుడు సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు నటుడు కమల్ హాసన్.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది.
జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు హీరో శింబు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, నెల్సన్, నిర్మాత ఏ ఎం రత్నం, ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో శృతి హాసన్, మౌనీ రాయ్, శంకర్ కూతరు అదితీ శంకర్, కొడుకు అర్జిత్ శంకర్ లైవ్ పర్ఫామెన్స్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు హీరో కమల్ హాసన్.
"28 ఏళ్ల క్రితం ఇండియన్ సినిమా టైంలో నేను శివాజీ గణేశన్ గారితో ఓ సినిమా చేయాలి. ఆ టైంలోనే శంకర్ ఇండియన్ కథతో వచ్చారు. రెండు కథలు కొంచెం దగ్గరదగ్గరగా ఉన్నాయి. అదే విషయాన్ని శివాజీ గణేశన్ గారితో చెప్పాను. ‘శంకర్ గారితోనే సినిమా చేయండి.. ఆయన ఆల్రెడీ ఓ సినిమాను తీశారు. మనం ఇప్పటికే ఎన్నో సినిమాలు కలిసి చేశాం’ అని నాతో ఆయన అన్నారు. ఆయన అన్న ఒక్క మాటతో, ఆ నమ్మకంతోనే శంకర్ గారితో ఇండియన్ సినిమా చేశాను. ఆ టైంలో నేను గానీ, శంకర్ గానీ రెమ్యూనరేషన్‌ల గురించి మాట్లాడుకోలేదు. ఏ ఎం రత్నం గారు సినిమాను అద్భుతంగా నిర్మించారు. ఆ టైంలోనే నేను శంకర్ గారితో సీక్వెల్ గురించి మాట్లాడాను. కానీ శంకర్ గారు మాత్రం కథ రెడీగా లేదని అన్నారు. మళ్లీ ఇన్నేళ్లకు అంటే 28 ఏళ్ల తరువాత ఇండియన్ 2 చేశాం."
భారతీయుడు 2 సినిమా జులై 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ప్రస్తుతం ఆయన కంపోజ్ చేసిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.