పాక్- బంగ్లాదేశ్ లలో ‘గుంటూరు కారం’ హిట్!

ప్రిన్స్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ తెలుగులో థియేట్రికల్ రన్ ఎంత నిరాశపర్చినా, హిందీ డబ్బింగ్ మాత్రం పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో మంచి హిట్టయ్యింది! నెట్ ఫ్లిక్స్ లో గత అయిదు వారాలుగా టాప్ టెన్ లో 5వ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది.

Advertisement
Update:2024-03-14 15:02 IST

ప్రిన్స్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ తెలుగులో థియేట్రికల్ రన్ ఎంత నిరాశపర్చినా, హిందీ డబ్బింగ్ మాత్రం పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో మంచి హిట్టయ్యింది! నెట్ ఫ్లిక్స్ లో గత అయిదు వారాలుగా టాప్ టెన్ లో 5వ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. టాప్ లో ‘12th ఫెయిల్’ వుంది. రెండవ స్థానంలో హాలీవుడ్ ‘డామ్సెల్’, మూడవ స్థానంలో షారుఖ్ ఖాన్ ‘డంకీ’, నాల్గవ స్థానంలో విజయ్ సేతుపతి ‘మెర్రీ క్రిస్మస్’, ఐదవ స్థానంలో ‘గుంటూరు కారం’ ట్రెండింగ్ అవుతున్నాయి. అప్పుడప్పుడు బంగ్లాదేశ్ లో, ఎక్కువగా పాకిస్తాన్లో హిందీలో డబ్బింగ్ అయిన తెలుగు సినిమాలకి ఆన్ లైన్లో మంచి ఆదరణ వుంది. ప్రభాస్, అల్లు అర్జున్ లు టాప్ ఫేవరేట్ స్టార్లుగా కొనసాగుతున్నారు. ‘బాహుబలి’ తో ప్రభాస్, ‘పుష్ప’ తో అల్లు అర్జున్ పాకిస్తానీలకి పిచ్చెత్తించారు. ఇప్పుడు ‘గుంటూరు కారం’ తో మహేష్ బాబు ఈ లిస్టులో చేరాడు. ‘గుంటూరు కారం’ ఇంకా థియేట్రికల్ విడుదల కాకముందు తెలుగు ట్రైలర్ పాకిస్తాన్లో వైరల్ అయింది!

ఇంకో ఆశ్చర్యమేమిటంటే, ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన, అట్టర్ ఫ్లాపైన ‘బ్రో’ కూడా పాకిస్తాన్లో, బంగ్లా దేశ్ లో ఓటీటీలో హిట్టవడం! ఇది హైందవ పురాణ నేపథ్యపు కథతో కూడిన సినిమా అయినా హిట్టయ్యింది. రెండు పక్కదేశాల్లో తెలుగు సినిమాల పట్ల క్రేజ్ ని చూసి ఇకపై నిర్మాతలు ఓటీటీల నుంచి ఎక్కువ డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదు. ఓటీటీలు వ్యూస్ డేటా వెల్లడి చేయవు. అలాటిది గత డిసెంబర్లో నెట్ ఫ్లిక్స్ తొలిసారిగా ఆరునెలల కాలానికి సంబంధించి 50 వేల గంటలకి పైగా వ్యూస్ సంపాదించుకున్న సినిమాల / సిరీస్ ల లిస్టు ప్రకటించింది. ఇది హాలీవుడ్ నుంచి డిమాండ్ వల్లే సాధ్యమైంది. వ్యూస్ తెలిస్తే ఎంత హిట్టయిందో తెలుస్తుంది, ఎంత హిట్టయ్యిందో తెలిస్తే, పారితోషికాల విషయంలో కళాకారులకి న్యాయం చేయవచ్చు.

అయితే వ్యూస్ డేటా కోసం ఆరునెలలు ఆగనవసరం లేకుండా, ఏ వారానికావారం నెట్ ఫ్లిక్స్ ప్రకటించే ట్రెండింగ్ చార్ట్స్ నిర్మాతలకి ఉపయోగపడొచ్చు. ఇప్పుడు ‘గుంటూరు కారం’ విషయంలో ఇదే జరిగింది. రెండు పక్క దేశాల్లో అయిదు వారాలుగా స్థిరంగా 5 వ స్థానంలో ట్రెండింగ్ అవుతోందంటే, ఈ కొత్త మార్కెట్ ని పరిగణనలోకి తీసుకోవచ్చు నిర్మాతలు. ‘డంకీ’ తో షారుఖ్ ఖాన్, ‘గుంటూరుకారం’ తో మహేష్ బాబు నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్స్ ని ఏలుకుంటున్నారని నెట్ ఫ్లిక్స్ ఫిబ్రవరి 21 న ప్రకటించింది.

పాకిస్తానీలు, బంగ్లాదేశీలు పూర్వం నుంచే యూట్యూబ్ లో హిందీ డబ్బింగ్ తెలుగు సినిమాల నాణ్యతని చూసి ఆకర్షితులవుతున్నారు. వాళ్ళకి నాణ్యత, మనకి నామర్దా. యూట్యూబ్‌ లో గోల్డ్ మైన్ టెలి ఫిల్మ్‌ అనే ఛానెల్‌ తెలుగు/తమిళ హిందీ డబ్బింగ్ సినిమాలని పోస్ట్ చేస్తూంటుంది. పాకిస్తానీలు చాలా మంది వీటిని చూస్తారు. బాలీవుడ్ సినిమాల కంటే మంచి కథాంశాల్ని కలిగి వుంటున్నందుకు వీటిని చూస్తున్నట్టు చెప్పుకుంటారు. భాషా అవరోధం పెద్దగా లేదు. కొన్ని తెలుగు సినిమాల్లో విలన్లు వాడే హైదరాబాదీ ఉర్దూని ఎంజాయ్ చేస్తారు. రజనీకాంత్ సూపర్ పవర్స్ గురించి కూడా తెలుసు.

కరాచీలోని కొన్ని ప్రాంతాల్లో ఆంధ్ర, తమిళనాడు, కేరళల నుంచి ముస్లిం వలస సమూహాలు దేశ విభజన సమయంలోవచ్చి స్థిరపడ్డాయి. వీళ్ళు అక్కడి ప్రజల్లో కలిసిపోయారు. వీళ్ళని మద్రాస్ ప్రెసిడెన్సీ వాలాలని పిలుస్తారు. మద్రాసీలు అని కూడా పిలుస్తారు. అప్పటి హైదరాబాద్ రాష్ట్రం నుంచి డెక్కనీ ముస్లింలు కూడా చాలా మంది కరాచీలో స్థిరపడ్డారు. కాబట్టి ఈ దక్షిణ ప్రాంతపు వలస సమూహాలకి సహజంగానే సౌత్ సినిమాల పట్ల ఇష్టం వుంటుంది. పాకిస్తాన్ ఇతర రాష్ట్రాల్లో నేటివ్ పాకిస్తానీలు కూడా తెలుగు/తమిళం డబ్బింగ్ సినిమాల్ని విస్తృతంగా చూస్తారు. తెలుగు సినిమాల్లో హింసతో బాటు శృంగార కంటెంట్ ఎక్కువగా వుండడంతో ఆకర్షితులవుతున్నామని చెప్పుకుంటారు. అలాగే ‘బాహుబలి’ ని చూసిన కొందరు టెర్రరిస్టులు అందులోని మాహిష్మతి కోటని బాంబు పెట్టి పేల్చేయాలని కామెంట్లు చేసినట్టు చెప్పుకుంటారు. పాకిస్తాన్ లో బాలీవుడ్ సినిమాల పట్ల క్రేజ్ కూడా తక్కువేమీ కాదు. బాలీవుడ్ తర్వాత టాలీవుడ్ దే స్థానం. 2017 లో యురీ సైనిక స్థావరం మీద పాక్ ఉగ్రవాదుల దాడితో బాలీవుడ్ లో పని చేస్తున్న పాక్ కళాకారుల్ని నిషేధించడంతో, పాకిస్తాన్ తమ దేశంలో బాలీవుడ్ సినిమాలని థియేటర్లలో ప్రదర్శించడాన్ని నిషేధించింది. అప్పట్నుంచీ పాక్ ప్రేక్షకులు ఆన్ లైన్లో భారతీయ సినిమాల్ని వీక్షిస్తున్నారు. ఆన్‌లైన్‌లో వివిధ వెబ్‌సైట్‌లతో బాటు, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మొదలైన స్ట్రీమింగ్ సర్వీసుల్ని ఆశ్రయిస్తున్నారు. 


Full View


Tags:    
Advertisement

Similar News