Bandla Ganesh - మళ్లీ రాజకీయాల్లోకి బండ్ల గణేశ్
Bandla Ganesh - ఆమధ్య రాజకీయాలు ట్రై చేశారు బండ్ల గణేశ్. ఆ వెంటనే తప్పుకున్నారు. ఇప్పుడు మరోసారి పాలిటిక్స్ పై కన్నేశారు.
నటుడు-నిర్మాత బండ్ల గణేశ్ మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నాడు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఈ నిర్మాత, ఆ తర్వాత పొలిటికల్ గా స్తబ్దుగా మారారు. ఇకపై తను రాజకీయాలు చేయనని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడీ నిర్మాత మరోసారి మాటమార్చాడు. తను రాజకీయాల్లోకి పునఃప్రవేశం చేయబోతున్నట్టు ప్రకటించాడు బండ్ల.
"రాజకీయాలంటే నిజాయితీ. రాజకీయాలంటే నీతి. రాజకీయాలంటే కష్టం. రాజకీయాలంటే పౌరుషం. రాజకీయాలంటే శ్రమ. రాజకీయాలంటే పోరాటం. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి, అందుకే వస్తా. బానిసత్వానికి బై బై. నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై. నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా."
ఇలా తన రాజకీయ పునఃప్రవేశంపై విస్పష్టంగా ప్రకటన చేశారు బండ్ల గణేష్. అయితే ఆయన ఏ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వస్తారనేది మాత్రం చెప్పలేదు. గత తెలంగాణ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా ఆయన కాంగ్రెస్ నుంచే బరిలోకి దిగుతారా లేక బీఆర్ఎస్ లేదా బీజేపీ వైపు అడుగులు వేస్తారా అనేది చూడాలి.
మరోవైపు ఏపీ రాజకీయాలపై కూడా ఆయన ఆసక్తి చూపిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. రోజులు గడిచేకొద్దీ బండ్ల గణేశ్ ఎంచుకునే రాజకీయ పార్టీపై ఓ క్లారిటీ వస్తుంది. ఈలోగా ఆయన డ్రాప్ అవ్వకుండా ఉంటే, పొలిటికల్ రీఎంట్రీ ఉన్నట్టే.