Vistara Crisis | పైలట్లపై ఒత్తిడి తగ్గింపు లక్ష్యం.. సర్వీసులు తగ్గించిన విస్తారా.. కారణం అదేనా..?!
Vistara Crisis | టాటా సన్స్ జాయింట్ వెంచర్ ఎయిర్‌లైన్స్ విస్తారా సంక్షోభం మరో మలుపు తిరిగింది.
Vistara Crisis | టాటా సన్స్ జాయింట్ వెంచర్ ఎయిర్‌లైన్స్ విస్తారా సంక్షోభం మరో మలుపు తిరిగింది. బడ్జెట్ క్యారియర్‌గా పేరొందిన విస్తారా ఎయిర్‌లైన్స్‌ను టాటా సన్స్ మరో అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియాలో విలీనం చేయాలని నిర్ణయించింది. విలీన ప్రక్రియలో భాగంగా ఎయిర్ ఇండియాలో చేరే వారి వేతన ప్యాకేజీలో వివక్షపై విస్తారా పైలట్లు నిరసన తెలుపుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా విస్తారా ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులు రద్దు చేసింది. సర్వీసుల నిర్వహణలో జాప్యం వల్ల ఆన్‌టైం పెర్ఫార్మెన్స్ మెరుగుదల కోసం రోజురోజుకు పరిస్థితి విషమిస్తుండటంతో ఆదివారం విస్తారా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నది. పైలట్లపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రతి రోజూ 25-30 విమాన సర్వీసులు నిలిపివేయాలని నిర్ణయించింది. మెరుగైన వేతన ప్యాకేజీతో 98 శాతం పైలట్లు నూతన వేతన కాంట్రాక్టులపై సంతకాలు చేసినా.. వారిలో చాలా మంది అనారోగ్యం భారీన పడినట్లు పేర్కొనడంతో విమాన సర్వీసులు రద్దు చేశామని వెల్లడించింది. దీనివల్ల విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రయాణికులకు అసౌకర్యం కలగకూడదన్న ఆలోచనతోనే అత్యధికంగా దేశీయ రూట్లలోనే విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు విస్తారా ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న విమాన సర్వీసుల్లో సుమారు 10 శాతం అంటే రోజూ 25-30 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నామన్నారు. త్వరలో ఫిబ్రవరి నాటి స్థాయికి విమాన సర్వీసులను ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని ఆ ప్రతినిధి వెల్లడించారు. ఈ నెలాఖరులోగా పరిస్థితిని చక్కదిద్దుతామన్నారు.
ఎయిర్ ఇండియాలో విలీనం కోసం విస్తారా పైలట్ల ఫిక్స్‌డ్ చెల్లింపు, విమాన ప్రయాణాలకు అనుగుణంగా వేతన ఇన్సెంటివ్‌ల ఖరారులో యాజమాన్యం తీరుపై సిబ్బంది నిరసనకు దిగారు. మార్చి 31 నంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకూ విస్తారా సర్వీసులు ఆలస్యం కావడం, భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు చేయడంతో ప్రయాణికులకు అసౌకర్యంగా మారింది. విమాన సర్వీసుల రద్దు, జాప్యం పైనా నివేదిక సమర్పించాలని విస్తారా యాజమాన్యాన్ని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ ఆదేశించింది. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో నెలకొన్న సంక్షోభాన్ని కేంద్ర విమాన యాన శాఖ సైతం నిశితంగా పరిశీలిస్తోంది. ఈ సమస్య పరిష్కరానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని విస్తారా యాజమాన్యం వివరణ ఇస్తోంది. ఇటీవలి కాలంలో విస్తారా ఎయిర్‌లైన్స్‌లో కనీసం 15 మంది సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లు రాజీనామా చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది.
టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ విస్తారా ఎయిర్‌లైన్స్. వెయ్యి మంది పైలట్లు, 2500 మంది క్యాబిన్ సిబ్బందితోపాటు 6,500 మంది ఉద్యోగులు విస్తారాలో పని చేస్తున్నారు. మార్చి 31 నుంచి ప్రారంభమైన సమ్మర్ షెడ్యూల్ ప్రకారం రోజూ 300 పై చిలుకు విమాన సర్వీసులు నడపాల్సి ఉంటుంది. ఇప్పుడు సుమారు 800 మంది పైలట్లు మాత్రమే విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఉన్నారు.