Sovereign Gold Bonds | ఈ ఎస్‌జీబీ ఇన్వెస్టర్లకు 101 శాతం మెచ్యూరిటీ రిటర్న్స్.. ఇవీ డిటైల్స్..!
Sovereign Gold Bonds | ప్రతియేటా ఆర్బీఐ నాలుగు విడుతల్లో ఎస్‌జీబీ బాండ్లను విడుదల చేస్తుంది.
Sovereign Gold Bonds | బంగారం పెట్టుబడులకు ఆల్టర్నేటివ్ రూట్. దేశీయంగా బంగారం కొనుగోళ్లను నిరుత్సాహ పరిచేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్లు తీసుకొచ్చింది. అవి 2024 ఫిబ్రవరి ఎనిమిదో తేదీ మెచ్యూర్ అవుతాయి. 2024 జనవరి 29-ఫిబ్రవరి 2 తేదీల మధ్య బంగారం ధర సగటు ఆధారంగా తొలిసారి 2016లో రిలీజ్‌చేసిన ఎస్జీబీ రీడిమ్షన్ విలువ ఖరారు చేశారు. ఈ నెల ఎనిమిదో తేదీన రిడిమ్షన్ చేసే ఎస్‌జీబీ యూనిట్ విలువ రూ.6,271గా నిర్ణయించారు. ఎస్‌జీబీల్లో ఇన్వెస్ట్ చేసిన మదుపర్లకు తొలి విడుత (2016) ఎస్‌జీబీ రీడిమ్షన్ విలువ ప్రకారం 11 శాతం రిటర్న్స్ లభించనున్నాయి.
2016 జూలైలో విడుదల చేసిన ఎస్‌జీబీ యూనిట్ విలువ (గ్రామ్ బంగారం విలువ రూ.3,119). ఎస్‌జీబీ యూనిట్ ఫైనల్ రీడిమ్షన్ విలువ రూ.6,271గా ఉంటుంది. ఎస్‌జీబీ స్కీమ్ గైడ్‌లైన్స్ ప్రకారం ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) గతవారం (సోమవారం-శుక్రవారం) ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం గ్రామ్ ధర సగటు ప్రకారం రీడిమ్షన్ విలువను ఫిక్స్ చేస్తారు.
ఉదాహరణకు ఎస్‌జీబీ ఆఫరింగ్ ప్రకారం ఒక ఇన్వెస్టర్ 35 గ్రాముల బంగారంలో పెట్టుబడి పెట్టాడని అనుకుందాం. గ్రామ్ బంగారం ధర రూ.3119 ప్రకారం మొత్తం రూ.1,09,165 పెట్టుబడి పెట్టినట్లవుతుంది. మెచ్యూరిటీ ధర యూనిట్ బంగారం రూ.6,271 (గ్రామ్) ప్రకారం ఇన్వెస్టర్‌కు రూ.2,17,595 రిటర్న్స్ లభిస్తాయి. అంటే 101 శాతం మెచ్యూరిటీ రిటర్న్స్ అందుకుంటారు. ఎస్‌జీబీపై వడ్డీతో సంబంధం లేకుండా కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) 9.12 శాతం వృద్ధి రేటు లభిస్తుంది. ఒకవేళ, వడ్డీరేట్‌ను పరిగణనలోకి తీసుకోకుంటే 101.05 శాతం రిటర్న్స్ అందుతుంది.
సావరిన్ గోల్డ్ బాండ్లపై ప్రారంభ పెట్టుబడులపై వార్షిక ప్రాతిపదికన 2.75 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం ఎస్‌జీబీలపై వడ్డీరేటు 2.5 శాతానికి కుదించేశారు. ఎస్‌జీబీల్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత ఎనిమిదేండ్ల తర్వాత మెచ్యూరిటీ సొమ్ము సంబంధిత ఇన్వెస్టర్ల ఖాతాలో జమ అవుతుంది. ఎస్‌జీబీలపై వడ్డీరేటు సెమీ వార్షిక ప్రాతిపదికన ఇన్వెస్టర్ల ఖాతాలో జమ చేస్తారు. తుది వడ్డీ చెల్లింపు మాత్రం ప్రిన్సిపల్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత తుది వడ్డీ చెల్లిస్తారు.
ప్రతియేటా ఆర్బీఐ నాలుగు విడుతల్లో ఎస్‌జీబీ బాండ్లను విడుదల చేస్తుంది. ప్రతి ఇన్వెస్టర్ ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక గ్రామ్ నుంచి నాలుగు కిలోల బంగారం విలువ గల బాండ్లపై పెట్టుబడులు పెట్టొచ్చు. ఇన్వెస్టర్ తమ అభిమతం మేరకు ఎస్‌జీబీల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఆర్బీఐ నిర్దేశిత విలువ ప్రకారం ఎస్‌జీబీల్లో పెట్టుబడులు మదుపు చేయవచ్చు. మిగతా సొమ్ము మొత్తం ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాలో తిరిగి జమ అవుతుంది. ఆదాయం పన్ను చట్టం-1061లోని 43 సెక్షన్ ప్రకారం ఎస్జీబీలపై వడ్డీ ఆదాయం మీద పన్ను చెల్లించాల్సిందే. ఎస్‌జీబీలు రీడిమ్షన్ తర్వాత మదుపర్లు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ నుంచి మినహాయింపు పొందొచ్చు.