సైబర్ నేరాల్లో డబ్బు కోల్పోతే.. ఏం చేయాలో తెలుసా?
ఫేక్ కాల్స్ లేదా ఫేక్ మెసేజ్‌లను నమ్మి లక్షల కొద్దీ సొమ్ము పోగొట్టుకున్న కేసులను చూస్తూనే ఉంటాం. మరి ఇలాంటి సందర్భాలు మనకు లేదా మన సన్నిహితులకు ఎదురైనప్పుడు ఏం చేయాలి? ఆన్‌లైన్‌లో మోసపోయి డబ్బు పోగొట్టుకున్నప్పుడు వెంటనే చేయాల్సిన పనేంటి?
ఫేక్ కాల్స్ లేదా ఫేక్ మెసేజ్‌లను నమ్మి లక్షల కొద్దీ సొమ్ము పోగొట్టుకున్న కేసులను చూస్తూనే ఉంటాం. మరి ఇలాంటి సందర్భాలు మనకు లేదా మన సన్నిహితులకు ఎదురైనప్పుడు ఏం చేయాలి? ఆన్‌లైన్‌లో మోసపోయి డబ్బు పోగొట్టుకున్నప్పుడు వెంటనే చేయాల్సిన పనేంటి?
సాధారణంగా సైబర్ నేరాల్లో రికవరీ శాతం చాలా తక్కువ అని సైబర్ నిపుణులు చెప్తుంటారు. అయితే మోసపోయిన వాళ్లు వెంటనే సమాచారం అందిస్తే రికవరీ చేసేందుకు కొంత అవకాశం ఉంటుందట. ఆన్‌లైన్ మోసాల ద్వారా డబ్బు పోగొట్టుకున్నప్పుడు బాధితులు వెంటనే కొన్ని పనులు చెయాల్సి ఉంటుంది. దీన్నే స్టాండర్డ్ ప్రొసీజర్ అంటారు. ఇదెలా ఉంటుందంటే..
ప్రొసీజర్ ఇదీ..
సైబర్ మోసాల్లో డబ్బు పోగొట్టుకుంటే బాధితులు వెంటనే ‘1930’ హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేసి కంప్లయింట్ చేయాలి. లేదా ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్( ఎన్‌సీఆర్‌పీ)’ వెబ్‌సైట్‌లో కూడా కంప్లెయింట్ చేయొచ్చు.
కంప్లెయింట్ అందిన వెంటనే సంబంధిత పోలీసు ఆఫీసర్‌తో పాటు బ్యాంకు నోడల్ అధికారి విచారణ మొదలుపెడతారు. డబ్బు ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్‌కు వెళ్తుందో ట్రాక్ చేస్తారు. మోసం జరిగినట్టు గుర్తిస్తే.. ‘సీఆర్‌పీసీ సెక్షన్–102’ కింద ఆ అకౌంట్లను ఫ్రీజ్ చేస్తారు.
ఒకవేళ కంప్లెయింట్ చేయడం లేట్ అయితే డబ్బు నిముషాల్లో మల్టిపుల్ అకౌంట్లు, వ్యాలెట్స్, క్రిప్టో కింద మారిపోతుంది. అప్పుడు వాటిని ట్రాక్ చేయడం కష్టం. కాబట్టి వీలైనంత త్వరగా కంప్లెయింట్ చేయాలి. డబ్బు కోల్పోయిన అరగంటలోపు కంప్లయింట్ చేస్తే ఎక్కువశాతం రికవరీకి వీలుంటుంది. గంట తర్వాత కంప్లెయింట్ చేస్తే కనీసం సగం రికవరీకి అవకాశాలున్నాయి. లేట్ అయ్యేకొద్దీ రికవరీ శాతం తగ్గుతుంది.
ఒకవేళ డబ్బు క్రిప్టో కరెన్సీలోకి మారితే వాటిని ట్రాక్ చేయడం కష్టం. క్రిప్టో వ్యాలెట్ల విషయంలో యూజర్లకు తప్ప మరెవరికీ యాక్సెస్ ఉండదు. కాబట్టి డబ్బు రికవరీ అవ్వాలంటే వీలైనంత వేగంగా కంప్లెయింట్ ఇవ్వాలి. సాధారణంగా సైబర్ మోసాలు.. బ్యాంకు సెలవు దినాల్లో అంటే.. శని, ఆదివారాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి ఆ రోజుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. గుర్తు తెలియని కాల్స్, మెసేజ్, ఇ–మెయిల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.