సీఎంతో ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ భేటీ

ఆ వివాదాలకు చెల్లుచీటి రాసినట్టేనా?

Advertisement
Update:2024-10-09 15:15 IST

సీఎం రేవంత్‌ రెడ్డితో ఎల్‌ అండ్‌ టీ సంస్థ చైర్మన్‌, ప్రతినిధులు భేటీ అయ్యారు. బుధవారం సెక్రటేరియట్‌ లో ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ సుబ్రమణ్యం, సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి సీఎం సహాయనిధికి రూ.5.50 కోట్లు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కేవలం సీఎం సహాయ నిధికి విరాళం ఇవ్వడం కోసమే ఆ సంస్థ చైర్మన్‌ హైదరాబాద్‌ కు వచ్చారా.. ఈ భేటీ వెనుక ఇంకా ఏదైనా ఎజెండా ఉందా అనే చర్చ మొదలైంది. రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎల్‌ అండ్‌ టీని టార్గెట్‌ చేశారనే ప్రచారం ఉంది. ఎయిర్‌ పోర్ట్‌ మెట్రో అలైన్‌మెంట్‌ మార్పు, మేడిగడ్డ బ్యారేజీ విషయంలో అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రయోగిస్తామని హెచ్చరించడం లాంటి చర్యలతో నేరుగా సీఎం రేవంత్‌ రెడ్డినే ఎల్‌ అండ్‌ టీ సంస్థను టార్గెట్‌ చేశారని ప్రభుత్వంలోని ముఖ్యుల మధ్యనే చర్చ నడుస్తోంది. ఒకానొక దశలో మెట్రో విస్తరణ పనుల నుంచి ఎల్‌ అండ్‌ టీ తప్పుకుంటుందనే ప్రచారం కూడా సాగింది. ఎల్‌ అండ్‌ టీ తప్పుకుని తెలంగాణ నుంచి ఎగ్జిట్‌ అయితే పారిశ్రామికంగా, పెట్టుబడుల పరంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినేది. ఏం జరిగిందో.. ఎవరు మధ్యవర్తిత్వం నెరిపారో కానీ ఎల్‌ అండ్‌ టీ సంస్థ చైర్మన్‌ హైదరాబాద్‌ లో ల్యాండ్‌ అయ్యారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5.50 కోట్ల భారీ విరాళం చెక్కును స్వయంగా రేవంత్‌ రెడ్డికి అందజేశారు.

రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టును కనెక్ట్‌ చేసే మెట్రో కారిడార్‌ కు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన డీపీఆర్‌ ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు అందజేసి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జీవో 111 పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ కోసమే ఈ మెట్రో కారిడార్‌ ను అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాతిపాదించిందని ఆరోపిస్తూ రేవంత్‌ సర్కార్‌ దానిని రద్దు చేసింది. తెరపైన బీఆర్‌ఎస్‌, రియల్‌ ఎస్టేట్‌ అనే ఆరోపణలు చేసినా తెరవెనుక ఇంకేదో జరిగిందనే ప్రచారం అప్పటి నుంచే ఉంది. రేవంత్‌ డిమాండ్లకు ఎల్‌ అండ్‌ టీ తలొగ్గకపోవడంతోనే ఆ సంస్థను టార్గెట్‌ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌ పోర్ట్‌ మెట్రో కారిడార్‌ ను రద్దు చేసి ప్రత్యామ్నాయ రూట్ల కోసం స్టడీ చేసి డీపీఆర్‌ రూపొందించే పనిలో ఉన్నారు. మెట్రో రైల్‌ విస్తరణలో భాగంగా ఫ్యూచర్‌ (ఫోర్త్‌) సిటీకి సైతం మెట్రో రైల్‌ ప్రతిపాదించారు. అత్యధిక జనసంచారం ఉన్న హైదరాబాద్‌ నగరంలోనే మెట్రో రైల్‌ ప్రాజెక్టు నష్టాల్లో సాగుతోందని.. తక్కువ జన సంచారం ఉండే ఫ్యూచర్‌ సిటీకి మెట్రో రైల్‌ అంటే ఏమాత్రం వయబుల్‌ కాదనే ఆందోళనలో ఎల్‌ అండ్‌ టీ సంస్థ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం తమను టార్గెట్‌ చేయడం, ఫోర్త్‌ సిటీ పేరుతో మరిన్ని నష్టాలు వాటిల్లేలా చేయడంపై ఆ సంస్థ గుర్రుగా ఉందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ మెట్రో రైల్‌ విస్తరణ ప్రాజెక్టు నుంచి ముందుగానే వైదొలగాలనే ఆలోచనలో ఆ సంస్థ ఉందనే ప్రచారం సాగుతోంది.

మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌ లో మూడు పిల్లర్లు కుంగిపోయాయి. ఒకానొక దశలో బ్యారేజీ ఫ్యూచర్‌ పైనే సందేహాలు వెల్లువెత్తాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం ద్వారా ఎల్‌ అండ్‌ టీ రాష్ట్ర సంపదను దోపిడీ చేసిందని, ఆ బ్యారేజీకి ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి రాబట్టేందుకు ఆర్‌ అండ్‌ ఆర్‌ యాక్ట్‌ ప్రయోగిస్తామని స్వయంగా సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. టెండర్‌ అగ్రిమెంట్లు, ఇతర న్యాయ పరమైన రక్షణలకు ఎల్‌ అండ్‌ టీకి ఉన్నాయి. బ్యారేజీలోని ఏడో బ్లాక్‌ కుంగిపోవడంలో ఫీల్డ్‌ ఇంజనీర్ల వైఫల్యం ఎంత ఉందో.. ఆ బ్యారేజీ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎల్‌ అండ్‌ టీది అంతే పాత్ర. ఇది ఎవరూ కాదనలేని నిజం. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు తామే మేడిగడ్డకు మరమ్మతు చేస్తామన్న ఎల్‌ అండ్‌ టీ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే మాట మార్చింది. దీంతోనే రేవంత్‌ రెడ్డి ఆ సంస్థపై కోపం పెంచుకున్నారని కాంగ్రెస్‌ నేతలు చెప్తుంటారు. మేడిగడ్డ రిపేర్లు, శంషాబాద్‌ మెట్రో రైల్‌ కారిడార్‌ పైకి కనిపించేవి.. తెరవెనుక ఇంకేదో జరిగిందని.. ఆ చర్యలతోనే తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని ఎల్‌ అండ్‌ టీ నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు తెలంగాణ నుంచి ఎగ్జిట్‌ అయ్యే ప్రయత్నంలో ఉండటం.. ఫాక్స్‌ కాన్‌ విస్తరణ నుంచి వెనక్కి తగ్గింది. ఈ పరిస్థితుల్లో ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ సెకండ్‌ ఫేజ్‌ పనుల నుంచి తప్పుకుంటే ఇప్పటికిప్పుడు ఇంకో ఇన్వెస్టర్‌ ఇటువైపు రావడం కష్టమేనని.. ఆ సంస్థతో రాజీ చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈక్రమంలో ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ హైదరాబాద్‌ వరకు వచ్చి సీఎం రేవంత్‌ రెడ్డితో సమావేశమయ్యారని.. ఇకపై కలిసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చారని చెప్తున్నారు. సీఎం, ఎల్‌ అండ్‌ టీ మధ్య రాజీతో ఇన్నాళ్లు ఉన్న వివాదాలు సమసి పోయినట్టేనని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News