జాబ్ ఇంటర్వ్యూల్లో తప్పక అడిగే ప్రశ్నలు ఇవే..

ఇంటర్వ్యూలో మొదట అడిగే ప్రశ్న.. మీ గురించి చెప్పమని. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. మీ గురించి ఒక ఐడియా వచ్చేలా పాజిటివ్ ఇంప్రెషన్ కలిగించాలి.

Advertisement
Update:2023-11-24 14:00 IST

జాబ్‌కు సెలక్ట్ అవ్వాలంటే అన్నింటికంటే చివరి దశ అయిన ఇంటర్వ్యూలో నెగ్గాల్సి ఉంటుంది. అకడెమిక్ ప్రతిభ ఎంత ఉన్నా ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోలేకపోతే ఫలితం ఉండదు. కాబట్టి ఇంటర్వ్యూ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం ఇంటర్వ్యూల్లో తరచూ అడిగే కొన్ని ప్రశ్నలకు మీవైన సమాధానాలు రెడీ చేసి పెట్టుకోవచ్చు.

ఇంటర్వ్యూలో మొదట అడిగే ప్రశ్న.. మీ గురించి చెప్పమని. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. మీ గురించి ఒక ఐడియా వచ్చేలా పాజిటివ్ ఇంప్రెషన్ కలిగించాలి. మీ నేపథ్యం, వ్యక్తిత్వంతో పాటు మీలో ఉన్న స్కిల్స్‌ను చెప్పకనే చెప్పాలి. ముందుగా ప్రిపేర్ అయినట్టుగా కాకుండా సహజంగా మాట్లాడాలి.

మా కంపెనీ గురించి నీకేమి తెలుసు?

ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే ఇంటర్వ్యూకు వెళ్లేముందే ఆ కంపెనీ గురించి కాస్త రీసెర్చ్ చేయాలి. కంపెనీ నేపథ్యం, పాలసీలతోపాటు సంస్థ ప్రత్యేకతలను కూడా ప్రస్తావించాలి. అప్పుడే కంపెనీ పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఇంటర్వ్యువర్‌‌కు తెలుస్తుంది.

మీ బలాలు, బలహీనతల గురించి చెప్పండి..

ఈ ప్రశ్నకు సమాధానం మీరే వెతుక్కోవాలి. అయితే మీకున్న అన్నిరకాల బలాల గురించి వాళ్లకు అవసరం లేదు. మీరు చేయబోయే ఉద్యోగానికి అవి సరితూగుతాయా లేదా అన్నది ముఖ్యం. కాబట్టి మీ ఉద్యోగానికి పనికొచ్చే క్వాలిటీస్ మీలో ఉంటే వాటిని స్పష్టంగా తెలియజేయాలి. మీ స్ట్రెంత్స్‌ను నిరూపించే ఉదాహరణలు, సందర్భాలు కూడా అడగొచ్చు. కాబట్టి రెడీగా ఉండాలి. అలాగే మీలో ఉన్న బలహీనతల గురించి కూడా చెప్తూ.. వాటిని అధిగమించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో చెప్పాలి.

మిమ్మల్ని ఎందుకు సెలక్ట్ చేయాలి?

ఇంటర్వ్యూల్లో చాలా కామన్‌గా అడిగే ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు అర్థం ‘మీలో ఉన్న యునిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి?’ అని. కాబట్టి మీలో ఉన్న ప్రత్యేకతల గురించి ప్రస్తావించాలి. అవి ఉద్యొగానికి ఎలా మేలు చేస్తాయి? సంస్థకు మీరు ఏయే రకాలుగా ఉపయోగపడగలరు? అనే విషయాలు చెప్పాలి. ఉదాహరణకు ఇండిపెండెంట్‌గా అలాగే టీమ్‌తో కలిసి పనిచేయగలరని, ఒత్తిడిని ఎదుర్కోడానికి మీకంటూ కొన్ని పద్ధతులున్నాయని చెప్పొచ్చు.

ఐదేళ్లలో మిమ్మల్ని మీరు ఏ పొజిషన్‌లో చూడాలనుకుంటున్నారు?

ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానానికి బదులు.. మీకున్న అర్హతలు, అనుభవాన్ని బట్టి ఒక్కో మెట్టు ఎదగాలని కోరుకుంటున్నట్టు చెప్పాలి. కచ్చితంగా ఎదుగుదలను ఆశిస్తున్నట్టు చెప్పాలి. మీ లాంగ్ టర్మ్ గోల్స్ గురించి కూడా ప్రస్తావించొచ్చు.

ఇకవీటితోపాటు ఎంత కాలం మాతో కలిసి పనిచేస్తారు? అని అడిగితే కచ్చితమైన సమయం చెప్పకూడదు. వీలైనంత ఎక్కువకాలం పనిచేయాలనుకుంటున్నట్టు చెప్పాలి. జీతం ఎంత ఆశిస్తున్నారని అడిగినప్పుడు కూడా కచ్చితమైన సంఖ్యకు బదులుగా సుమారుగా చెప్పాలి.

Tags:    
Advertisement

Similar News