వాట్సప్ లో ఎల్ఐసీ సేవలు.. ఎలా వినియోగించుకోవాలంటే..?
LIC services in Whatsapp: 8976862090 మొబైల్ నెంబర్ కి వాట్సప్ లో 'HI' అనే మెసేజ్ పెట్టడం ద్వారా మనం వాట్సప్ లో ఎల్ఐసీ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇందులో 11 రకాల ఆప్షన్లు ఉంటాయి.
గతంలో ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలన్నా, పాలసీ మీద అప్పు తీసుకోవాలన్నా, దానికి వడ్డీ చెల్లించాలన్నా, పాలసీ సరెండర్ చేయాలన్నా.. కచ్చితంగా ఏజెంట్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇటీవల ఆన్ లైన్ సేవలతో ఎల్ఐసీ ఓ అడుగు ముందుకు వేసినా, ఇతర బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, బీమా సంస్థల లాగా ఎల్ఐసీ యూజర్ ఫ్రెండ్లీగా ఉండదు అనే అపవాదు మాత్రం మూటగట్టుకుంది. ఇప్పుడు మరింత అప్ డేట్ అవుతోంది ఎల్ఐసీ. ఆన్ లైన్ యూజర్లకు మరింత దగ్గరయ్యేందుకు వాట్సప్ లో కూడా సేవలను అందిస్తామంటోంది.
8976862090 మొబైల్ నెంబర్ కి వాట్సప్ లో 'HI' అనే మెసేజ్ పెట్టడం ద్వారా మనం వాట్సప్ లో ఎల్ఐసీ సేవలను ఉపయోగించుకోవచ్చు. మెసేజ్ పెట్టిన తర్వాత వెల్కమ్ టు ఎల్ఐసి ఆఫ్ ఇండియా వాట్సప్ సర్వీసెస్ అనే మెసేజ్ వస్తుంది. అందులో 11 రకాల ఆప్షన్లు ఉంటాయి. ప్రీమియం డ్యూ, బోనస్ ఇన్ఫర్మేషన్, పాలసీ స్టేటస్, లోన్ ఎలిజిబిలిటీ కొటేషన్.. ఇలా 11 ఆప్షన్లు చూపిస్తుంది. అందులో మనకి ఏది కావాలో ఆ నెంబర్ ఆధారంగా సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్పటికే మన మొబైల్ నెంబర్ పాలసీలతో అనుసంధానం అయి ఉంటే ఆ పాలసీ వివరాలు వెల్లడవుతాయి. లేకపోతే మీ దగ్గరలోని ఎల్ఐసీ బ్రాంచ్ ని సంప్రదించండి అనే మెసేజ్ వస్తుంది. కొత్తగా ఏదైనా అడగాలనుకుంటే మళ్లీ 'HI' అనే మెసేజ్ తో మొదలు పెట్టాల్సి ఉంటుంది.
ప్రయోగాత్మకంగా ఈ వాట్సప్ సేవలను అందుబాటులోకి తెచ్చినా, మొబైల్ నెంబర్ తో లింక్ అయి ఉన్న పాలసీ వివరాలు మాత్రమే మనకు కనపడతాయి. ఒకే నెంబర్ తో రెండు మూడు పాలసీలు జతచేసి ఉంటే కన్ఫ్యూజన్ తప్పదు. దీన్ని త్వరలో మరింత మెరుగు పరుస్తామని చెబుతున్నారు అధికారులు. ఇకపై ప్రతీ చిన్న పనికి కార్యాలయాలకు పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ ఈ వాట్సప్ నెంబర్ ని ప్రకటించారు. వాట్సప్ సేవలతో ప్రజలకు ఎల్ఐసీ మరింత చేరువ అవుతుందని చెప్పారాయన. ఇతర బీమా సంస్థలతో పోటీ పడుతూ ఎల్ఐసీ మరింత మెరుగైన సేవలు తమ ఖాతాదారులకు అందిస్తుందని అన్నారు.