Gold Rate | బంగారం వెండి వెలవెల.. అమెరికా డాలర్ మిలమిల.. కారణాలివేనా?!
Gold Rate | బంగారం, వెండి ధరలకూ.. యూఎస్ డాలర్లకు.. అమెరికా ప్రభుత్వ, ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలకు అవినాభావ సంబంధం ఉంది.
Gold Rate | బంగారం, వెండి ధరలకూ.. యూఎస్ డాలర్లకు.. అమెరికా ప్రభుత్వ, ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచినా.. డాలర్ ఇండెక్స్ విలువ పెరిగినా.. ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా ఉన్న బంగారం గిరాకీ పడిపోతుంది. ఆదివారం షట్ డౌన్ ముప్పును జో బైడెన్ సర్కార్ నివారించగలిగింది. దీంతో బంగారం, వెండి ధరలపై ప్రతికూల ప్రభావం చూపింది. దేశీయ బులియన్ మార్కెట్‌లో అదే ప్రభావం కనిపిస్తుంది. గ్లోబల్, దేశీయ బులియన్ మార్కెట్లలో మంగళవారం బంగారం ధరలు ఏడు నెలల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి.
మంగళవారం మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.56,734 వద్ద తచ్చాడుతున్నది. గత శుక్రవారం ధరతో పోలిస్తే 1.50 శాతం తక్కువ. సెప్టెంబర్ 29న రూ.57,600 వద్ద తులం బంగారం ధర ముగిసింది. మంగళవారం ఎంసీఎక్స్‌లో పది గ్రాముల బంగారం శుక్రవారం కంటే తక్కువ ధర (డిసెంబర్ ఎక్స్‌పైరీ) రూ.57,426 వద్ద ప్రారంభమై.. ఇంట్రా డే ట్రేడింగ్‌లో రూ.56,565కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో సోమవారం ముగింపుతో పోలిస్తే 0.35 శాతం పతనమై 1815 డాలర్లు పలుకుతున్నది.
శుక్రవారం ముగింపుతో పోలిస్తే మరోవైపు ఎంసీఎక్స్‌లో కిలో వెండి మంగళవారం ధర రూ.69,255 వద్ద తక్కువ ధర వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ట్రేడింగ్ మొదలైన కొన్ని నిమిషాలకు ఇంట్రాడే ట్రేడింగ్‌లో అత్యంత కనిష్ట స్థాయి రూ.65,666 లకు పడిపోయింది.శుక్రవారం ముగింపు కిలో వెండి ధర రూ.69,857 వద్ద నుంచి 3.79 శాతం పతనమై ప్రస్తుతం రూ.67,210 వద్ద నిలిచింది.
బంగారం వెండి ధరలు ఇలా పతనం..
అక్టోబర్ ఒకటో తేదీన షట్‌డౌన్ ముప్పును అమెరికా ప్రభుత్వం నివారించడంతో డాలర్ విలువ మరింత బలోపేతం అయింది. యూఎస్ డాలర్ ఇండెక్స్ 11 నెలల గరిష్ట స్థాయిని తాకింది. ఫలితంగా ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా ఉన్న బంగారం, వెండి ధరలు ఇటు దేశీయంగా, అటు గ్లోబల్ బులియన్ మార్కెట్లలో ఏడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమొడిటీ అండ్ కరెన్సీ హెడ్ అనూజ్ గుప్తా తెలిపారు. డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడంతోపాటు యూఎస్ బాండ్ల విలువ పైపైకి దూసుకెళడంతో బంగారం, వెండిపై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడిందని యాక్సిస్ సెక్యూరిటీస్ కమొడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దేవేయా గాగ్యాలనీ చెప్పారు.
మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1815 డాలర్లకు పడిపోయింది. దీని తక్షణ మద్దతు ధర 1800 డాలర్లు ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమొడిటీ అండ్ కరెన్సీ హెడ్ అనూజ్ గుప్తా తెలిపారు. స్పాట్ గోల్డ్‌కు 1770 డాలర్ల వద్ద కీలక మద్దతు లభించవచ్చునన్నారు. మరోవైపు దేశీయంగా ఎంసీఎక్స్‌లో బంగారానికి రూ.56వేల వద్ద తక్షణ మద్దతు లభించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. పది గ్రాముల బంగారానికి రూ.55,300 వద్ద కీలక మద్దతు పొందొచ్చునని చెప్పారు.