రూ. 92 వేల మార్కుకు చేరువలో బంగారం ధరలు
ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన ధర బుధవారం మరో రూ. 700 పెరిగి రూ. 91,950కి చేరినట్లు తెలిపిన ఆలిండియా సరఫా అసోసియేషన్;
దేశీయంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భారీ డిమాండ్ కారణంగా ఇటీవల రూ. 90 వేల మార్కును దాటిన పసిడి.. తాజాగా రూ. 92 వేల మార్కుకు చేరువైంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన ధర బుధవారం మరో రూ. 700 పెరిగి రూ. 91,950కి చేరినట్లు ఆలిండియా సరఫా అసోసియేషన్ తెలిపింది. పెండ్లిళ్ల సీజన్ కావడంతో దేశీయంగా బంగారానికి డిమాండ్ పెరిగినట్లు పేర్కొన్నది. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు తోడు, అమెరికా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నెమ్మదించడం కూడా పసిడివైపు పెట్టుబడులు మళ్లేందుకు దోహదం చేస్తున్నాయి. దీంతో అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరిగింది.
ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర మంగళవారం రూ. 91,250 గా ఉండగా.. బుధవారం రూ. 700 పెరిగి రూ. 91,950కి చేరింది. 99.5 శాతం స్వచ్ఛమైన బంగారం కూడా 10 గ్రాములు రూ. 91,500 పలుకుతున్నది. అటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ స్పాట్ గోల్డ్ ఔన్సు 3039 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. ఇంట్రాడేలో 3045 డాలర్లకు చేరింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ట్రంప్ అధికారంలోకి వచ్చాక నెలకొన్న వాణిజ్య భయాలు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి బంగారం పెట్టుబడులపై మొగ్గుచూపుతున్నారని అబన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా తెలిపారు.