Gold Investments | బంగారం కొనుగోలు చేస్తున్నారా.. పెట్టుబ‌డుల‌కు ఆరు రూట్లు.. రిట‌ర్న్స్ ఇలా..!!

Gold Investments | మ‌న‌లో చాలా మంది కాక‌పోయినా సాధార‌ణంగా భార‌తీయుల ఇండ్ల‌లో కొంత‌మొత్తం బంగారం ఉంటుంది. సంప్ర‌దాయంగా భార‌తీయులు త‌మ సంపాద‌న పొదుపు చేయ‌డంలో భాగంగా/ ముఖ్య‌మైన ఆర్థిక ల‌క్ష్యాల సాధ‌న కోసం బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు.

Advertisement
Update:2023-09-27 14:05 IST

Gold Investments | బంగారం కొనుగోలు చేస్తున్నారా.. పెట్టుబ‌డుల‌కు ఆరు రూట్లు.. రిట‌ర్న్స్ ఇలా..!!

Gold Investments | మ‌న‌లో చాలా మంది కాక‌పోయినా సాధార‌ణంగా భార‌తీయుల ఇండ్ల‌లో కొంత‌మొత్తం బంగారం ఉంటుంది. సంప్ర‌దాయంగా భార‌తీయులు త‌మ సంపాద‌న పొదుపు చేయ‌డంలో భాగంగా/ ముఖ్య‌మైన ఆర్థిక ల‌క్ష్యాల సాధ‌న కోసం బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆర్థికంగా వెన్నుద‌న్ను కోసం బంగారం కొనుగోలు చేస్తుంటారు. గ‌తంలో కేవ‌లం ఫిజిక‌ల్ గోల్డ్ మాత్ర‌మే ల‌భించేది. కానీ ఇప్పుడు డిజిట‌ల్‌గానూ, ఫిజిక‌ల్‌గానూ బంగారం కొనుగోలు చేయొచ్చు. బంగారం కొనుగోలు చేయ‌డానికి వివిధ మార్గాలు ఉన్నాయి. అలా బంగారంపై పెట్టుబ‌డులు మ‌దుపు చేయ‌డానికి ఆరు మార్గాలు ఉన్నాయి.

బంగారం ఆభ‌ర‌ణాల కొనుగోలు సంప్ర‌దాయం.. కానీ..

ప్ర‌తి భార‌తీయ మహిళ బంగారం ఆభ‌ర‌ణాలు కొనుక్కోవాల‌ని ఆశ ప‌డుతుంటారు. కానీ ఆభ‌ర‌ణాల రూపంలో బంగారం కొనుగోలు చేయ‌డం వ‌ల్ల భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న నెల‌కొంటుంది. అధిక ఖ‌ర్చుల‌తోపాటు కాలం చెల్లిన డిజైన్‌ల‌పై మోజు ఉండ‌దు. ఆభ‌ర‌ణాల త‌యారీకి మేకింగ్ చార్జీలు అద‌నం అవుతాయి. మీరు కొనుగోలు చేసే బంగారం ఆభ‌ర‌ణాల‌ను బ‌ట్టి మేకింగ్ చార్జీలు ఎంత అన్న‌ది తెలుస్తుంది. సంక్లిష్ట‌మైన డిజైన్ ఎంచుకుంటే త‌యారీ చార్జీలు ఎక్కువ‌గా ఉంటాయి.

బంగారం నాణాల్లో స్వ‌చ్ఛ‌త‌కు పెట్టింది పేరు

జ్యువెల్ల‌రీ దుకాణాల నుంచి, బ్యాంకులు, బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌లు, తాజాగా ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్‌ల నుంచి కూడా బంగారం నాణాలు కొనుగోలు చేయొచ్చు. బంగారం నాణాలు, బంగారం క‌డ్డీలు 24 క్యార‌ట్స్ ప్యూరిటీ (99.9 శాతం స్వ‌చ్ఛ‌త‌) కలిగి ఉంటాయి. బంగారం నాణాలు, క‌డ్డీల‌కు బీఐఎస్ స్టాండ‌ర్డ్ ప్ర‌కారం హాల్‌మార్క్ ఉంటుంది. 0.5 గ్రాముల నుంచి 50 గ్రాముల బ‌రువు గ‌ల బంగారం నాణాలు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి.

ప‌సిడి పొదుపు ప‌థ‌కాల్లో ఇలా..!

బంగారం ధ‌ర‌లు పైపైకి దూసుకెళ్తూ ఉండ‌టంతో బంగారం ప్రియుల‌ను ఆక‌ర్షించ‌డానికి ప‌లువురు జ్యువెల్ల‌రీ దుకాణాలు మార్కెట్లోకి బంగారం పొదుపు ప‌థ‌కాలు (Gold savings schemes) ప్రారంభించాయి. బంగారం ధ‌ర‌కు అనుగుణంగా బంగారం లేదా జ్యువెల్ల‌రీ పొదుపు ప‌థ‌కాల్లో చేరిన వారు.. వారు ఎంచుకున్న టెన్యూర్‌ను బ‌ట్టి ప్ర‌తి నెలా నిర్దిష్ట మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ గ‌డువు ముగిసిన త‌ర్వాత బోన‌స్ మొత్తం వ‌స్తుంది. అంతే విలువ గ‌ల బంగారం అదే జ్యువెల్ల‌రీ దుకాణం నుంచి కొనుగోలు చేయొచ్చు. టెన్యూర్ ముగిసిన త‌ర్వాత బంగారం కొనుగోలు చేసిన వారికి క్యాష్ ఇన్సెంటివ్ లేదా గిఫ్ట్ ఇవ్వొచ్చు.

ఇలా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో మ‌దుపు

పేప‌ర్ గోల్డ్ కొనుగోలుకు మ‌రో ఆల్ట‌ర్నేటివ్ రూట్ గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌). బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ), నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)ల్లో పెట్టుబ‌డుల‌తో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో (కొనుగోలు లేదా విక్రయం) మ‌దుపు చేయొచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పార‌ద‌ర్శ‌క ధ‌ర నిర్ణ‌యించ‌డం మ‌రో బెనిఫిట్‌. బంగారంతో స‌మాన విలువ గ‌ల ధ‌ర‌కు ఈటీఎఫ్ కొనుగోలు చేయొచ్చు. మీరు గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబ‌డులు పెట్టాలంటే స్టాక్ బ్రోక‌ర్‌ను సంప్ర‌దించ‌డంతోపాటు డీమ్యాట్ ఖాతా కూడా క‌లిగి ఉండాలి. ఒకేసారి భారీ మొత్తంలో గానీ, సిస్ట‌మాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్‌) కింద గానీ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబ‌డి పెట్టొచ్చు. ఒక గ్రామ్ బంగారం కూడా కొనుగోలు చేయొచ్చు. ఎంట్రీ, ఎగ్జిట్ ఖ‌ర్చుల్లేవు. కానీ, మ్యూచువ‌ల్ ఫండ్స్ మాదిరిగా గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వ‌హ‌ణ‌కు కొంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మీరు గోల్డ్ ఈటీఎఫ్ కొనుగోలు చేసిన ప్ర‌తిసారీ మీ స్టాక్ బ్రోక‌ర్‌కు కొంత సొమ్ము ఫీజుగా చెల్లించాలి.

సావ‌రిన్ బాండ్ల‌లో స‌బ్‌స్క్రిప్ష‌న్‌

ఫిజిక‌ల్ బంగారం కొనుగోళ్ల‌ను నిరుత్సాహ ప‌రిచేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సావ‌రిన్ గోల్డ్ బాండ్ల‌ను జారీ చేస్తున్న‌ది. ఎప్ప‌టిక‌ప్పుడు తాజా సావ‌రిన్ గోల్డ్ బాండ్ల కొనుగోలుకు స్పెష‌ల్ విండో ఏర్పాటు చేస్తుంది. ఏడాదిలో రెండుసార్లు సావ‌రిన్ గోల్డ్ బాండ్ల‌లో స‌బ్‌స్క్రిప్ష‌న్‌కు అనుమ‌తి ఇస్తారు. ఎప్పుడు అనుమ‌తించినా వారం రోజులు స‌బ్‌స్క్రిప్ష‌న్ న‌మోదు చేసుకోవ‌చ్చు.

పేమెంట్ యాప్స్‌తో డిజిట‌ల్ గోల్డ్‌లో పెట్టుబ‌డులు ఇలా..

పేటీఎం, ఫోన్‌ఫే, గూగుల్‌పే వంటి మొబైల్ యాప్ ఆధారిత యూపీఐ వాలెట్ల‌ను ఉప‌యోగించి కూడా `డిజిట‌ల్ గోల్డ్‌`లో పెట్టుబ‌డులు పెట్టొచ్చు. రూ.1 విలువ గ‌ల బంగారం కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ పేమెంట్ యాప్స్‌లో అత్య‌ధికం కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీతోపాటు స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన పీఏఎంపీ ఎస్ఏ జాయింట్ వెంచ‌ర్ (ఎంఎంటీసీ-పీఏఎంపీ)తో భాగ‌స్వామ్య ఒప్పందం క‌లిగి ఉన్నాయి.

బంగారంపై 10 శాతంలోపే పెట్టుబ‌డులు ప‌రిమితం కావాలి

జ్యువెల్ల‌రీ ఆభ‌ర‌ణాలు కొనుగోలు చేసినా.. బంగారం నాణాలు, క‌డ్డీలు కొనుగ‌లు చేసినా, మొత్తం మీ ద‌గ్గ‌ర ఉన్న సొమ్ములో ప‌ది శాతం మాత్ర‌మే బంగారంపై పెట్టుబ‌డులు పెట్టాలి. సావ‌రిన్ గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌.. రెండు బాండ్ల‌లోనూ పెట్టుబడి పెట్టొచ్చు. సావ‌రిన్ గోల్డ్ బాండ్ల‌పై పెట్టుబ‌డుల‌కు ఎంట్రీ కాస్ట్ ఉండ‌దు. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబ‌డుల‌కు సుమారు ఒక‌శాతం ఖ‌ర్చ‌వుతుంది. సావ‌రిన్ బాండ్ల‌లో పెట్టే పెట్టుబ‌డులు ఎనిమిదేండ్ల త‌ర్వాత మెచ్యూర్ అవుతాయి. అయినా, ఐదేండ్ల త‌ర్వాత లాక్ ఇన్ పీరియ‌డ్ ముగుస్తుంది. సావ‌రిన్ గోల్డ్ బాండ్ల‌తోపోలిస్తే గోల్డ్ ఈటీఎఫ్‌లు మెరుగైన ద్ర‌వ్య‌ల‌భ్య‌త‌నిస్తాయి. ఎనిమిదేండ్లు దాటిన త‌ర్వాత సావ‌రిన్ బాండ్ల‌పై వ‌చ్చే రిట‌ర్న్స్ మీద ప‌న్ను రాయితీ ఉంటుంది. కానీ, లాక్ ఇన్ పీరియ‌డ్ దాటాక మ‌నీ విత్‌డ్రా చేసుకుంటే మాత్రం ఆదాయం ప‌న్ను చెల్లించాల్సిందే.

మ్యూచువ‌ల్ ఫండ్స్‌, గోల్డ్ ఈటీఎఫ్‌ల‌పై ప‌న్ను నిబంధ‌న‌ల్లో మార్పులు తెచ్చింది కేంద్ర ప్ర‌భుత్వం. 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌చ్చాయి. దీని ప్రకారం ఇన్వెస్ట‌ర్లు.. ప్ర‌తి ఆర్థిక సంవ‌త్స‌రంలో త‌మ ఆదాయంలో 35 శాతం లోపే మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో గానీ, గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్‌లో గానీ పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. సావ‌రిన్ గోల్డ్ బాండ్ల (ఎస్‌జీబీ)ల్లో పెట్టుబ‌డుల‌పై ప్ర‌తిఏటా 2.5 శాతం అద‌న‌పు రిట‌ర్న్స్ ల‌భిస్తాయి.

Tags:    
Advertisement

Similar News