Gautam Adani - Mukesh Ambani | ముకేశ్‌ను క్రాస్ చేసిన గౌతం అదానీ.. ఐదు నిమిషాలకో బిలియనీర్.. హురున్ ఇండియా రిచ్ లిస్ట్..!
Hurun India Rich List 2024: 2024- హురున్ ఇండియన్ రిచ్ లిస్ట్‌లో తిరిగి గౌతం అదానీ మొదటి స్థానంలోకి వచ్చేశారు.
Gautam Adani - Mukesh Ambani | భారతీయ కుబేరుల జాబితాలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అండ్ ఫ్యామిలీని అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ (62) నిలిచారు. 2024- హురున్ ఇండియన్ రిచ్ లిస్ట్‌లో తిరిగి గౌతం అదానీ మొదటి స్థానంలోకి వచ్చేశారు. గౌతం అదానీ సంపద రూ.11.6 లక్షల కోట్లు. గతేడాది ప్రతి ఐదు రోజులకో బిలియనీర్ అవతరించాడని హురున్ ఇండియా రిచ్ లిస్ట్ పేర్కొంది. 2024 జూలై 31 నాటి గణాంకాల ఆధారంగా హురున్ తన రిచ్ లిస్ట్ రూపొందించింది. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ రూ.10,14,700 కోట్ల సంపదతో భారత్‌లో రెండో అతిపెద్ద కుబేరుడిగా అవతరించారు. తొలిసారి బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్.. భారతీయ కుబేరుల జాబితాలో చోటు దక్కించుకుంటే, ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలు కుబేరులయ్యారు.
హురున్ ఇండియా ఫౌండర్, చీఫ్ రీసెర్చర్ అనాస్ రహమాన్ జునైద్ మాట్లాడుతూ.. ఆసియాలో సంపద సృష్టికర్తగా భారత్ అవతరించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన చైనాలో కుబేరుల సంఖ్య గత ఏడాది కాలంలో 25 శాతం తగ్గితే, భారత్‌లో కుబేరుల సంఖ్య 29 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో బారతీయ కుబేరుల సంఖ్య 334 మందికి చేరింది అని పేర్కొన్నారు.
ప్రముఖ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్ నాడార్ అండ్ ఫ్యామిలీ రూ.3.14 లక్షల కోట్లతో భారత్‌లో మూడో బిలియనీర్‌గా నిలిచింది. వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ సైరస్ ఎస్ పూనావాలా అండ్ ఫ్యామిలీ, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ అధినేత దిలీప్ సంఘ్వీ వరుసగా మూడో, నాలుగో స్థానాల్లో నిలిచారు.
గత ఐదేండ్లలో ఆరు సంపన్నులు భారత్ కుబేరుల్లో టాప్-10లో కొనసాగుతున్నారు. వారిలో గౌతం అదానీ అండ్ ఫ్యామిలీ, ముకేశ్ అంబానీ అండ్ ఫ్యామిలీ, శివ్ నాడార్, సైరస్ ఎస్ పూనావాలా అండ్ ఫ్యామిలీ, గోపిచంద్ హిందుజా అండ్ కుటుంబం, డీమాట్ అధినేత రాధాకిషన్ దమానీ అండ్ ఫ్యామిలీ ఉన్నాయి.
క్విక్ కామర్స్ స్టార్టప్ జెప్టో కో- ఫౌండర్ కైవల్య వోహ్రా (21), అతని కో -ఫౌండర్ ఆదిత్ పచిలా (22) హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న యువ పారిశ్రామిక వేత్తలు. జెప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 500 కోట్ల డాలర్లు.
తొలిసారి హురున్ భారత్ రిచ్ లిస్ట్‌లో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. తన ఐపీఎల్ ఫ్రాంచైసీ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో తన వాటా విలువ పెరగడంతో హురున్ భారత్ రిచ్ లిస్ట్‌లో పేరు సొంతం చేసుకున్నారు. కేవలం ఏడాది కాలంలోనే రూ.40,500 కోట్ల ఆదాయం సంపాదించడంతో కొత్తగా హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో వినోద రంగం నుంచి ఏడుగురు కొత్త వ్యక్తులు చోటు దక్కించుకున్నారు.
టాప్-10 భారతీయ కుబేరులు వీరే
గౌతం అదానీ & కుటుంబం - రూ.11,61,800 కోట్లు - అదానీ గ్రూప్
ముకేశ్ అంబానీ అండ్ కుటుంబం - రూ.10,14,700 కోట్లు - రిలయన్స్ ఇండస్ట్రీస్
శివ్ నాడార్ అండ్ కుటుంబం - రూ.3,14,000 కోట్లు - హెచ్‌సీఎల్
సైరస్ ఎస్ పూనావాలా అండ్ కుటుంబం - రూ.2,89,800 కోట్లు - సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
దిలిప్ సంఘ్వీ - రూ.2,49,900 కోట్లు - సన్ ఫార్మాస్యూటికల్స్
కుమార మంగళం బిర్లా - రూ.2,35,200 కోట్లు - ఆదిత్య బిర్లా
గోపిచంద్ హిందుజా అండ్ ఫ్యామిలీ - రూ.1,92,700 కోట్లు - హిందుజా
రాధాకిషన్ దామన్ అండ్ కుటుంబం - రూ.1,90,900 కోట్లు - అవెన్యూ సూపర్ మార్కెట్స్ (డిమాట్)
అజీం ప్రేమ్ జీ అండ్ ఫ్యామిలీ - రూ.1,90,700 కోట్లు - విప్రో
నీరజ్ బజాజ్ అండ్ ఫ్యామిలీ - రూ. 1,62,800 కోట్లు- బజాజ్