Adani Group for refinance | అప్పు కోసం అదానీ పాట్లు.. రూ.29.03 లక్షల కోట్ల రీఫైనాన్స్ కోసం అదానీ గ్రూప్ చర్చలు.. కారణం అదేనా?
Adani Group for refinance | అంబుజా సిమెంట్స్‌ను సొంతం చేసుకున్న అదానీ గ్రూప్.. అందుకోసం చేసిన రుణాల చెల్లింపునకు రీఫైనాన్స్ కోసం వివిధ బ్యాంకుల వద్ద భారీ రుణం కోసం సన్నాహాలు చేస్తోందని సమాచారం.
Adani Group for refinance | అంబుజా సిమెంట్స్‌ను సొంతం చేసుకున్న అదానీ గ్రూప్.. అందుకోసం చేసిన రుణాల చెల్లింపునకు రీఫైనాన్స్ కోసం వివిధ బ్యాంకుల వద్ద భారీ రుణం కోసం సన్నాహాలు చేస్తోందని సమాచారం. అంబుజా సిమెంట్స్ కొనుగోలు కోసం చేసిన రుణంలో కనీసం 300 మిలియన్ డాలర్ల మేరకు అదానీ గ్రూప్ చెల్లించాలి. అంబుజా సిమెంట్స్ టేకోవర్ కోసం 380 కోట్ల డాలర్ల రుణం తీసుకున్నది. ఈ రుణం చెల్లింపు కోసం రీఫైనాన్స్ విషయమై అదానీ గ్రూప్‌కు, బ్యాంకులకు మధ్య నెలల తరబడి చర్చలు సాగుతున్నాయి. బ్యాంకర్లు అనుమతిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఆసియాలోనే అతిపెద్ద సిండికేటెడ్ రుణం కానున్నదని సమాచారం. బ్యాంకర్లు కూడా 350 కోట్ల డాలర్ల రుణం ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారని తెలుస్తున్నది.
అదానీ గ్రూప్ సంప్రదింపులు జరుపుతున్న బ్యాంకుల్లో.. డీబీఎస్ గ్రూప్ హోల్డింగ్స్, ఫస్ట్ అబుదాబీ బ్యాంక్ పీజేఎస్‌సీ, మిజుహో ఫైనాన్సియల్ గ్రూప్ ఇంక్, మిత్‌సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్సియల్ గ్రూప్ ఇంక్, సుమిటోమో మిత్సుయి బ్యాంక్ కార్పొరేషన్ ఉన్నాయి. ఒక్కో బ్యాంక్ సుమారు 400 మిలియన్ డాలర్ల చొప్పున రుణ పరపతి కల్పించనున్నాయని తెలియవచ్చింది. మిగతా బ్యాంకులు కొద్ది మొత్తంలో రుణం ఇస్తాయని సమాచారం. ఈ చర్చలు పూర్తిగా ప్రైవేట్ అని పేరు చెప్పడానికి ఇష్టపడని వర్గాల కథనం.
అదానీ గ్రూప్ సంస్థలు ఆస్తుల కంటే రుణభారం ఎక్కువని, స్టాక్ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడుతున్నదని గత జనవరిలో యూఎస్ షార్ట్ షెల్లింగ్ కంపెనీ `హిడెన్‌బర్గ్ రీసెర్చ్` ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హిండెన్‌బర్గ్ ఆరోపణలతో ఒకానొక దశలో 150 బిలియన్ డాలర్లకు పైగా అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ హరించుకుపోయింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ పదేపదే తోసిపుచ్చింది.
దీంతో గ్రూప్ సంస్థల వాణిజ్యాన్ని చక్కదిద్దేందుకు గౌతం అదానీ పూనుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందులో భాగంగా ఇతర సంస్థల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపునకు రీఫైనాన్స్ కోసం బ్యాంకులతో అదానీ గ్రూప్ అధికారుల చర్చలు అడ్వాన్స్ దశకు చేరుకున్నాయన్న సంకేతాలు ఉన్నాయి.
ఆయా బ్యాంకులతో రుణ ఒప్పందాల్లో నిబంధనలు, మార్గదర్శకాల్లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నందున రుణ పరపతి లావాదేవీలు పూర్తి కాలేదు. రుణ ఒప్పందం ఖరారైతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆసియాలో నాలుగో అతిపెద్ద రుణం కానున్నది. దీనిపై స్పందించడానికి అదానీ గ్రూప్ నిరాకరించింది. వదంతులపై స్పందించలేమని స్పష్టం చేసింది. సంబంధిత బ్యాంకింగ్ సంస్థలు సైతం స్పందించానికి ముందుకు రాలేదు.