నీటిచప్పుడు:
------------
తను నడుస్తున్నంత సేపూ
కరవాణి లో మాట్లాడుతూనేవుంది -
కన్నీళ్ళు ధ్వనించకుండా జాగ్రత్తపడుతూ
అమ్మతో కాబోలు!!
పిడప సుందరి
---------------
ఈవిడెవరో పార్క్ లోకి
పిడపవేసుకుని మరీ
పవిత్రంగా విచ్చేసింది -
చేసంచితో
చేమంతులకాజేత కోసం!
హిమస్నాతసుమాలు
ఉలికిపడుతున్నాయి
కరకువేళ్ళ దురుసుతో!!
చరచరవాణి:
——————
అతడు వేగపునడకతోనే
ఆదేశిస్తున్నాడు
పనులపరుగుల ఇల్లాలిని-
స్నానానికి నీళ్ళు సిద్ధం
చెయ్యమని!
ఇంకా చెయ్యలేదంటూ ఆవేశిస్తున్నాడు కూడా -
చరవాణితో ఆమె
అగచాట్లు రెట్టింపు!!
వైరుద్ధ్యం
————-
కరవాణి మోగింది -
పనమ్మాయి!
నా గుండె గుభిలు -
ఇవాళ రాదు కాబోలు!!
చుట్టూ సౌందర్యంతో
తలంట్లు పూర్తికాకనే
ఇంట వేచివున్న
అంట్లగిన్నెలవైపు
సగమూ సాగని తాపీనడ
తహతహల పరుగయింది
- ఘంటసాల నిర్మల
Advertisement