శ్లోకమాధురి: పరోపకారం -వాదపటిమ -వ్యంగ్య పటిమ

Advertisement
Update:2023-12-06 23:15 IST

పిబన్తి నద్యః స్వయమేవ నామ్భః స్వయం న ఖాదన్తి ఫలాని వృక్షాః ।

నాదన్తి సస్యం ఖలు వారివాహాః పరోపకారాయ సతాం విభృతయః ॥

నదులు వాటిలోని నీటిని అవే తాగడం లేదు, అలాగే చెట్లు తమ పండ్లను తామే తినడం లేదు, పంటలను పండించే ఆ సస్యాన్ని(పంటను)మేఘాలు (వారివాహాః ) తినడం లేదు ఇవన్నీ ఇతరుల కోసమే చేస్తున్నాయి. నదులు కానీ వృక్షాలు కానీ మేఘాలు కానీ కేవలం పరోపకారం కోసమే ప్రవహిస్తున్నాయి, ఫలమిస్తున్నాయి,పండిస్తున్నాయి.

అలాగే వాటితో పెంచబడిన మన ఈ శరీరం కూడా మరి అలాగే పరోపకారం కోసమే ఉండాలి.

ఇతరులు వాటిని అనుభవించి సుఖాన్ని పొందుతున్నా అవి వాటి పనులను నిర్విరామంగా చేసుకుంటున్నాయి. పరోపకారమే జీవిత పరమార్ధమని నమ్ముతున్నాయి. ప్రకృతిలోని వృక్ష జంతు జాలాలన్నీ కూడా “ఇదం న మమ” అన్న తత్వాన్ని జీర్ణించుకుని ఉన్నాయి.

చిన్న సహాయo ఇతరులకు చేస్తే ఎంతో ప్రచారం కావాలి అని తహతహలాడం కంటే, ప్రచారానికి సాధ్యమైనంత దూరంగా ఉండి లోకోపకారకమైన పనులే చేసుకుంటూ ఉండడం ఉత్తమం.  

ప్రజలకు దూరంగా కాకుండా అందుబాటులో ఉండడం ,గర్వం లేకుండా ఉండటం ఇవి పరోపకారుల సహజ గుణాలు. ఆర్తులు, బాధితులు సేవా సహకారాల కోసం మనని చేరుకోవడానికి శ్రమ పడకుండా వారికి మనమే అందుబాటులో ఉండే విధంగా ఉండాలి.

అడిగితే చేసేవారు కొందరు , అడక్కుండానే చేసేవారు కొందరు, అడిగినా చేయని వారు కూడా ఉంటారు. మేఘాలు,చెట్లు,నదులు అడగకుండానే స్వయంగా వాటి ప్రేరణతోటి పరులకు హితం చేస్తున్నాయి.”సర్వం ఖలు ఇదం బ్రహ్మ””విష్ణు మయమిదం జగత్” ఈశావాస్యమిదం సర్వం”పరమేశ్వరార్పణ మస్తు” ఇలాంటి ఉపనిషత్ వాక్యాలు వింటూనే ఉంటాం. శ్రీకృష్ణార్పణమస్తు అని అనుకుంటూ ఉండే మనం ఇతరులకు సహాయం చేయడం మన కనీస ధర్మం.

2

నభేతవ్యం నభోద్ధవ్యం

న శ్రావ్యం వాదినో వచః

జటితి ప్రతివక్తవ్యం

సభాసు విజిగీషుభిః

తార్కికవాదనలలో జయించాలి అని కోరుకునే వాడు ముందుగా భయపడకూడదు (న బేతవ్యం) అర్థం చేసుకోకూడదు (నభోద్ధవ్యం ) మాటలను వినకూడదు(న శ్రావ్యం) ఇంకా వెనువెంటనే ప్రత్యర్థికి జవాబు ఇవ్వాలి ఇవి డిబేట్ సభలలో జయించాలి అనుకునే వాళ్లకు నీలకంఠ దీక్షితుడు కలివిడంబనం అనే కావ్యం లో ఇచ్చిన వ్యంగ్యాత్మక సలహా.

3

ఇది చూడండి:

శివపార్వతుల సరస

సంభాషణకేళీ కలాపం .

విశ్వమంతా తిరిగి త్రిపురాసుర సంహారం గావించి శివుడు ఇంటికొచ్చి తలుపు తడితే , పార్వతి రకరకాల ప్రశ్నలతో ఆపివేస్తున్నది. ఆమె అడిగిన ప్రశ్నలకన్నిటికీ  శివుడుజవాబు ఇస్తున్నాడు పాపం! ఇదంతా పార్వతి కేవలం శివుడిని ఆటపట్టించడం కోసమే అన్నట్లు తోచినా , శివుని మహత్తు ప్రపంచానికి తెలియ చేయడం కోసం మాత్రమే (శ్రీ రామచరిత మానసంలోని మంగళాచరణ శ్లోకం)

కస్త్వం?శూలీ,మృగయభిషజం, నీలకంఠ ప్రియే హం

కేకామేకాం కురు,పశుపతి: నైవదృశ్యే విషాణే!

స్థాణుర్ముగ్దే,నవదతి తరు:, జీవితేశః శివాయాః

గచ్చారణ్యం,ప్రతిహత వచః, పాతు వః చంద్ర చూడః

ఇలా వుంది  వారి సంభాషణ తీరు -

పార్వతి: ఎవరు నువ్వు?

శివుడు: శూలి (శూలం లేదా త్రిశూలం పట్టుకున్నవాడు/మొలలవ్యాధి వున్నవాడు.).

పార్వతి: భిషజుని (వైద్యుని) వెదుకు

శివుడు: ప్రియతమా, నేను నీలకంఠుడను (నీల కంఠం కలవాడు: నెమలి మరియు శివుని పేరు రెండింటినీ సూచిస్తుంది).

పార్వతి: ఐతే నెమలిలా క్రేంకారం చేయి.

శివుడు: (నేను) పశుపతి (జంతువుల ప్రభువు).

పార్వతి: పశుపతి వైతే కొమ్ములు వుండాలి కదా! మరి నీకు లేవే

శివుడు: (నేను) స్థాణువును (ఒక చోట స్థిరంగా ఉండేవాడు).

పార్వతి: ఒక చెట్టు (స్థాణువు ) మాట్లాడదు.

శివ: నేను శివ (అంటే పార్వతి) ప్రాణేశుడను (జీవితం).

పార్వతి: ఓహో! ఆడ నక్క భర్త అయితే అడవికి వెళ్ళు .ఈ విధంగా, పార్వతి మాటలచేత ఓడింప బడిన చంద్రచూడుడు (చంద్రుడిని కొప్పులో ధరించినవాడైన శివుడు) మిమ్ము కాపాడుగాక!

ఇది సంస్కృత శబ్దాల శ్లేష , మాటల గారడీ . శివుడి ఏఏ  పేర్లతో తనను తాను చెప్పుకుంటున్నాడో పార్వతి దానికంటే భిన్నంగా ఊహిస్తూ పరాచికాలాడు తున్నది .పశుపతి అంటే గొర్రెల కాపరి అని కూడా అర్థం. నీలకంఠ అంటే నెమలి అని కూడా అర్థం. స్థాణు అంటే చెట్టు అని కూడా అర్థం. శివా అంటే శృగాలి లేదా ఆడ నక్క అని కూడా అర్థం.

డాక్టర్ భండారం వాణి

Tags:    
Advertisement

Similar News