ఒక్కో సారి
చూపు గుండె మీదికి
నిచ్చెన వేస్తుంది
కొన్ని పదాలను ఎక్కించడానికి
పదాలు పువ్వులు కాదుగదా
అందంగా ఉండటానికి
అవి తెల్ల కాగితంపై
గీసిన నల్ల గీతలే
అయినా ఎందుకో మరి?
ఉన్నవి యాభయ్యారో
ఇరవయ్యారో మరింకెన్నెన్నో
ఆవే ఇటుయటు,అటుయిటు
చదరంగం పావుల్లా కదులుతాయి
చుక్కల ముగ్గుల్లా మల్లె మొగ్గల్లా
పదాకృతులవుతాయి
పలక బట్టినప్రతివాడికి
ఇదేమంత కష్టంకాదు
కష్టమంతా కలం పట్టినవాడికే
హలం పట్టినవాడు రైతు
కలం పట్టినవాడు కవి అన్న అర్థంలోనే సుమా!
పుట్టలోపుట్టినవాడు మొదలుకుని
ఎందరో పుట్టారు గిట్టారు కూడా
మర్త్యులుగనుక వాళ్ళు పొయ్యారు
అక్షరం గనుక అది ఉండి పోయింది
రచనల్లో రసనల్లో
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే
దృష్టి సోకగానే
గుండెమీదికెగబాకేవి
కొన్నే ఉంటాయి
పదాలో పంక్తులో
అది కొందరికే తెలిసిన ఆల్కెమీ గనుక
కొందరికే అక్షరాలను అయస్కాంతీకరించడం
తెలుసుగనుక
ఒక్కో సారి
చూపు గుండె మీదికి
నిచ్చెన వేస్తుంది
కొన్ని పదాలను ఎక్కించడానికి
-తుమ్మూరి రామమోహనరావు