శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు (కథ)

Advertisement
Update:2022-11-21 13:16 IST

శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు (కథ)

అప్పుడే ఆఫీసునుండొచ్చి అలసటతో మంచంపై వెల్లికిలాపడి సేదతీరుతున్న మురళికి ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినపడుతుంది. అప్రయత్నంగానే ఫోన్ అందుకుని కొద్దిగా తెరిచిన కళ్ళతో కాల్ లిఫ్ట్చేసి

"చెప్పు బామ్మా !" అని అంటాడు.

"చెప్పాల్సింది నేను కాదురా పిచ్చి సన్నాసి నువ్వే!!"

అంటూ ఒకింత కోపం కలిగిన స్వరం అటువైపునుండి

కొనసాగిస్తూ... "గుర్తున్నామా...!

అసలు గుర్తున్నామా అంట...!! సొంతూరులో ఉద్యోగంచూసుకోరా అంటే సాఫ్టు వేరు అంటూ పట్నంపోయావు. ఉద్యోగం వచ్చి మూడేళ్ళు అవుతుంది. ఇంటి ముఖం చూసి ఏడాది పైనే కావొస్తోంది.ఎలా ఉంటున్నావో, ఏం తింటున్నావో, ఒక ఫోను

లేదు. ఒక ఫోటోలేదు "అంటూ బ్రేకుల్లేకుండా మాట్లాడుతుంది బామ్మ సరోజిని.

అసలే అలసటగా వున్న మురళి బామ్మ మాటలకు అడ్డుపడుతూ... "బామ్మా... ఇప్పుడే ఆఫీసునుండి వచ్చానే. పనిఒత్తిడికి తోడు ట్రాఫిక్కి తలకూడా పట్టేసింది. నువ్వేమో నీ పంథాలో నువ్వు మాట్లాడుకుంటూ పోతున్నావు" అంటూ ఫోనుని భుజంతో నొక్కిపట్టి పక్కనే ఉన్న దిండుని మడతపెట్టి తలకింద పెట్టు కుంటూ "ఏంటి విషయాలు... విశేషాలు" అన్నాడు.

"నీ పెళ్ళిని మించిన పెద్ద విషయం... విశేషం...ఏముంటుంది మాకు" అంది బామ్మ స్థిమితపడుతూ.

"పెళ్ళిగురించి అమ్మకు, నాన్నకు ఏ విషయం తేల్చి చెప్పటంలేదని నీ చేత అడిగిస్తున్నారా.. "నవ్వుతూ అన్నాడు మురళి

"వాళ్ళు అడగటం కాదబ్బాయ్ !

నాకు ఉండదా నీ తల మీద నాలుగు అక్షింతలు వేయాలని "అంది బామ్మ కొంచెం గొంతు పెంచి,"విషయం... విశేషం... ఏంటని అడిగావుగా.... నీకో పిల్లని చూశాం, అమ్మాయికూడా నీలాగే సాఫ్టువేరు ఇంజనీరు, పేరు సుమ. పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది.నీకు సరిజోడి. మా అందరికి నచ్చింది.నీకూ తప్పక నచ్చుతుంది" అని తన మాటల

పరంపరతో పెళ్ళి ప్రస్తావన తెచ్చి కాబోయే పెళ్ళికూతురు గురించి చెప్పేసింది బామ్మ.

"బామ్మా అదీ... "అంటూ ఏదో చెప్పబోతున్న మురళీని వారిస్తూ... "ఇంకా ఎంతకాలం ఒంటికాయి సొంటికొమ్ములాగా ఉంటావ్రా.... ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాల్రా వెర్రి నాగన్నా !" అని బుజ్జగింపుగా కసిరింది బామ్మ.

"సరే మీ ఇష్టం" అన్నాడు మురళి.

"అదీ నా మనవడంటే" అని సరోజిని అంటూ "అమ్మాయి ఫోటో,తదితర వివరాలు నాన్న నీకు పంపు తాడ్రా. ఇక మేము పెళ్ళి పనుల్లో పడతాం. ముహూర్తాలు పెట్టి కబురుచేస్తాం "అని మనవడు ఒప్పుకున్నాడన్న ఆనందంతో ఫోన్పెట్టేసింది బామ్మ.

మురళీ వెడ్స్ సుమల వివాహ ఆహ్వానంతో విచ్చేసిన బంధు గణంతో అంగరంగ వైభవంగా జరిగింది పెళ్ళి, మూడుముళ్ళతో ఒక్కటైన ఇద్దరూ ఒద్దికగా మూడురాత్రులను ముగించుకుని తగిన సరంజామాతో హైదరాబాద్ చేరుకున్నారు.

కొత్త కాపురానికి శ్రీకారంచుట్టాలని కొత్తింట్లో అడుగుపెట్టారు. తొలినాళ్ళలోచెట్టాపట్టాలతో , చుట్టూ చుట్టాలతో బాగానే ఉన్నా ఆరు నెలల్లో అంతా తారు మారయింది.

వేరు వేరు కంపెనీల్లో ఉద్యోగాలు కావటంతోషిఫ్ట్ ల కారణంగా సరదాగా మాట్లాడు కోవటం, సరసంగాపోట్లాడుకోవటం అరుదైపోయింది. ఉద్యోగాల్లో పై స్థాయికి చేరారు. లక్షల్లో జీతం. క్షణం .

తీరికలేని జీవితం. పనిలో పడితే పడక గది పలకరించినా పట్టించుకోనంత బిజీ అయిపోయారు. శృంగారం గారంచేస్తేతప్ప దగ్గరవ్వరు.

దగ్గరైనంతసేపు కూడా పట్టదు దూరమైపోతారు.ఇలా ఉరుకుల పరుగుల నగరంలో బిజీబిజీగారోజుని గడిపేస్తూ రెండేళ్ళు పూర్తిచేశారు.

"పెళ్ళై రెండేళ్ళు కావస్తున్నా ఏం విశేషం లేదా "అన్నఇరుగుపొరుగు మాటలకు ముఖముఖాలు చూసుకుంటూ మాట దాటవేసేవారు. ఒకరిపై ఒకరికి ప్రేమ లేదా అంటే బోలెడంత. మరి ఆ ప్రేమకు ఫలితం ఏదీ అంటే నవ్వుతారు. దగ్గరగా చూసినవారు ఎవరైనా ఈ అంటీ అంటని కాపురం ఏంటని అడిగితే పని ఒత్తిడంటూ ఆ ప్రస్తావన తోసిపుచ్చేసేవారు.

ఫోన్లో పలకరింపులకే పరిమితమైన వారి జీవితాలు కలిసికట్టుగా వచ్చిన కుటుంబసభ్యుల రాకతో పులకరించాయి.

ఎప్పుడూ ల్యాప్టాప్లు ముందేసుకుని ఒకరి కొకరు పట్టనివారు సెలవుపెట్టి మరీ వచ్చినవారితో ఆనందంగా గడిపారు.

ప్రయాణమయ్యే రోజున సుమనుపక్కకు పిలిచి పిల్లల ప్రస్తావన తెచ్చారు అమ్మ, అత్తయ్యలు. "ఇప్పుడేం అంత తొందర" అంది సుమ.

పిల్లలు మీకు ఉండకపోవచ్చు పెద్దోళ్ళం మాకు ఉండదా అన్నారు వియ్యపురాళ్ళు..

పెళ్ళై రెండేళ్ళు అవుతొంది. ఏదైనా సమస్య ఉందేమో ఇద్దరూ పరీక్ష చేయించుకోండి.

ఆశ్రద్ధ చేయకండి అని హితవు పలికారు.

బామ్మ తప్ప అందరూ వెళ్ళిపోయారు. అందరినీ బస్టాండులో వదిలి వచ్చేటప్పుడు అమ్మ, అత్తయ్యలు అన్న మాటను మురళి చెవిన వేసింది సుమ .

ప్రముఖ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకుని ఇల్లు చేరారు. వచ్చీ రావడంతోనే రిపోర్టు కవర్ టేబుల్ మీద పడేసి ల్యాప్టాప్లు అందుకుని చెరో గదిలో కూర్చుని పనిలో పడ్డారు ఇద్దరూ. వారంరోజులు గడిచాయిఒక్క స్నానంతప్ప అన్నీ ఆయంత్రంముందే కావిస్తూ,షిఫ్టుల ఉద్యోగంతో ఎవరివంటకువారు తంటాలు పడుతూ, ఉరుకుల పరుగులతో యాంత్రిక జీవనం సాగిస్తున్న తీరును చూసి ఇంట్లో ఉన్న సరోజినికి కథంతా అర్థం అయింది.

ఓ రోజు మురళి సుమ ఇంచుమించుగా ఒకే సమయానికి ఇల్లు చేరారు .గదిలో విశ్రాంతి తీసుకుంటున్నవారిని "ఒకసారి ఇటు రండర్రా" అని పిలిచింది బామ్మ. 'అర్జంటా' అని అన్నాడు.

మురళి గదిలోనుండే. 'చాలా...' అంది బామ్మ.

ఆ మాటతో సుమ, మురళి సరోజిని ముందు ప్రత్యక్షం అయ్యారు. ఆ రోజు టేబుల్ పై పడవేసిన

కవర్ అప్పటినుండి అక్కడే ఉంది.

"ఏమిట్రా ఆ కవర్ "అని అడిగింది బామ్మ. ఇదా...అని మురళి సాగదీస్తూ... "పెళ్ళై రెండేళ్ళు

అవుతో oది.ఇంకా పిల్లలు కలగకపోవటం ఏంటని

అమ్మ, అత్తయ్యలు పరీక్ష చేయించుకో

మని సుమకు చెప్పారట. చేయించు

కున్నాం. అది ఆ రిపోర్టే" అన్నాడు అసహనంగా,

"రిపోర్టులో ఏమని వచ్చింది.

అడిగింది "బామ్మ పరిశీలనగా. "నువ్వన్నీఅలా గుచ్చి గుచ్చి అడిగితే ఎలా "విసుక్కుంటూ అన్నాడు మురళి

"చెప్పరా తిక్క సన్నాసి నా దగ్గర

బెరుకెందుకు" అని కసిరింది సరోజిని,

"మరి... నాకేమో కణాలు తగ్గాయట, తనకేమో నీటితిత్తులు ఉన్నాయట. అవి ఈ మధ్యనే వచ్చాయట "

అన్నాడు మురళి నేల చూపులు చూస్తూ...

"బహుశా అందుకేనేమో ఇంకా పిల్లలు కలగలేదు"అంది సుమ తలదించుకుని.

"మీకు పిల్లలు కలగక పోవటానికి ఇవి కారణాలు మాత్రమే. లోపాలు కాదు. అసలైనవి వేరే ఉన్నాయని బామ్మ అనేసరికి 'అవేమిటి? అన్నట్టు తల పైకెత్తి చూశారు.

"తిళ్ళు. ఒత్తిళ్ళు". అంది సరోజిని. ఒకింత సంశయాన్ని వారిముఖాల్లో కనబరుస్తూ 'అవునా'అన్నారు ఇద్దరూ.'అవును' తలూ పింది బామ్మ. నేనువచ్చినప్పటి నుండి చూస్తున్నా.... ఎవరి

పనులు వారివి , ఎవరి పలుకులు వారివి. ఎవరిపరుగులు వారివి ,ఎవరి పరుపులు వారివి. కాపురం అంటే ఎలా ఉండాలి కాపడం పెట్టినంత కమ్మగా ఉండాలి. వేడి ఆవిర్లతో మేనుతడవాలి. కలయికను ఆహ్వానించాలి..

కదలికను ఆస్వాదించాలి. గోరింటతో చేయిపండాలి. తాంబూలంతో నోరు పండాలి. శృంగారంతోసంసారం పండాలి. "ఇలా చెప్పుకు పోతున్న బామ్మవైపు తదేకంగా చూస్తుండిపోయారు సుమ, మురళి.

వారిరువురిని గమనించిన బామ్మ

" ఆ రసాస్వాదన మాటల్లోనే ఇంత తియ్యగా ఉందంటే చేతల్లో ఇంకెంతతియ్యగా ఉంటుందో ఊహించుకోండి. ఆడదాన్ని అందులో ముసలిదాన్ని నేనే ఇన్ని

మాట్లాడుతున్నాను అంటే యవ్వనద్వయం మీరు ఇంకెన్ని ఆట్లాడాలి "అంది బామ్మ.

చెప్పేది చక్కగా వింటున్నారని తెలిసి, "ఇదిగోఅమ్మాయ్, అబ్బాయ్ మీరు అమ్మానాన్నలు కావా లన్నా, మీ ప్రేమకు ప్రతిరూపాన్ని ఇవ్వాలన్నా నా

దగ్గర ఒక మంచి ఉపాయం ఉందర్రా..."

"ఏమిటది?" అన్నారు. మీరు ఓ ఆరునెల్లు ఆఫ్ సుకి సెలవుపెట్టాల్రా "

"ఆరునెల్లా...!!" అంటూనోరెళ్ళ

బెట్టి కుదరదన్నట్టు తల అడ్డంగా ఊపింది సాఫ్టువేరు జంట.

"ఆ...ఆరునెల్లు కాకపోతే ఓ... మూడునెలలైనాసెలవు పెట్టాల్సిందే. లేకపోతే ఉపాయం పండదు.

ముందే చెప్తున్నా" అంటూ హెచ్చరించింది బామ్మ.

"సరేప్రయత్నిస్తాం కానీ మూడునెల్లు సెలవు పెట్టిఏంచేయాలి?"

అన్నారు ఆత్రుతగా...

"ఆ... అక్కడికే వస్తున్నా "అంది బామ్మ. "ఆసుపత్రి గట్రా వద్దు, మందుమాకు ముట్టొద్దు, బయట తిళ్ళు మానేయటమే కద్దు. వంటని, ఒంటిని కొసరి కొసరి వడ్డించుకోవటంలోనే ఉంది ముద్దు" అంటూ ప్రాసల ప్రవాహంతో వెల్లువెత్తాయి బామ్మ మాటలు.

పిలిచి పాత చింతకాయపచ్చడి పద్ధతులు చెప్తుందనుకున్న బామ్మ కొత్తావకాయ కబుర్లు చెప్తుంటే వారిమీద వారికే జాలికలిగింది. ఇంత కాలం వారేం కోల్పోయారో అర్థమైంది. అది గమనించిన బామ్మవచ్చిన పని అయ్యిందని గ్రహించి "ఈ రాత్రికి నేను బయలుదేరుతున్నా... ఈ నాలుగు

మాటలు చెప్పటానికే ఇన్నాళ్ళూ ఇక్కడ ఉన్నా "అన్న బామ్మ మాటలకు వద్దని వారించినా వినదని తెలిసి ఇద్దరూ ఒక్కసారిగా బామ్మ కాళ్ళపై పడతారు.

'శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు' అంటూ దీవించి అక్కడనుండి బయలుదేరుతుంది బామ్మ. లగేజీ అందుకుని వదిలి పెట్టడానికి కూడా వెళ్తాడు మురళి.

బొమ్మను వదిలి పెట్టి ఇల్లు చేరిన మురళి సుమ వంటగదిలో ఉందని తెలిసి వెళ్ళి వెనుకనుండి గట్టిగా హత్తుకుంటాడు. "బామ్మ మాటలు తలకెక్కాయే"అంది సుమ సరసంగా.

"ఏ నీకెక్కలేదా" అంటూ సుమను తన వైపు తిప్పుకుని పెదవుల్ని అందుకున్నాడు. మురళి సుతారంగా...

ఒత్తిడితో ఏదీ జయించదు, జనిం చదు అన్నసత్యాన్ని తెలుసుకున్న సాఫ్టువేరు జంటసంవత్సరం తిరిగేలోపే బామ్మ మాటను నిజం చేశారు.

-వెంకు సనాతని

Tags:    
Advertisement

Similar News