సానుభూతి

Advertisement
Update:2022-11-20 12:14 IST

పంజరంలోని పిట్ట హృదయంలో

యేముంటుందో తెలుసు

పర్వతాల లోయల మీదుగా

భానుని కిరణాలు కాంతులు విరజిమ్ముతుంటే

యెదుగుతోన్న పచ్చిక నడుమ

వసంతగాలులు మృదువుగా వీస్తుంటే

వొరుసుకునే తీరపు దేహాల మధ్య

గాజు ప్రవాహంలా నది ప్రవహిస్తుంటే

చిగురింత కలల కాలాన్ని

స్వాగత గీతాలని పిట్టలు ఆలపిస్తుంటే

విచ్చుకునే కొత్త మొగ్గలు

లేత పరిమళాలని

పంజరంలోని పిట్ట మనసులో

యేముంటుందో తెలుసు.

కర్కశమైన వూచల మీద

తన నెత్తుటి యెరుపు మెరిసేట్టు

పంజరంలోని పిట్ట తన రెక్కలనెందుకు

బాదుతుందో తెలుసు.

పురా గాయాల ఆనవాళ్ళలో

నొప్పి మళ్ళీ మళ్ళీ

సలుపుతూనేవుంది

వుక్కు వూచల్ని పదేపదే

పొడుస్తూనే వుంది.

పక్షి తన రెక్కలని అలా

యెందుకు బాదుతుందో తెలుసు

రెక్కలు గాయాలై

గుండె పుండై

వూచల్ని కొట్టి కొట్టి

స్వేచ్ఛని పొందినప్పుడు

పంజరంలోని పిట్ట

యెందుకు పాడుతుందో తెలుసు

ఆ పాట

నిస్సందేహంగా ఆనందగీతమైతే కాదు

గుండె గొంతులో కొట్టుకులాడే ప్రార్థన

స్వర్గసీమల్లో విహరించబోతూ చేసే

చిట్టచివరి ప్రార్ధన

పంజరంలోని పిట్ట

యెందుకు పాడుతుందో

యేమి పాడుతుందో

తెలుసు.. నాకు తెలుసు.

(రెండో కవిత )

తొలకరి... !!

బహుశా..

అప్పుడు నేనూ, మేఘం కలిసి నడుస్తున్నాం

శిఖరం వంగి తొంగి చూసింది.

అంతే...

వాన

గ్రీష్మ సంగీతాన్ని నిండుగా నింపుకొని

తొలకరి.

అప్పుడు

యెండిన నది వడ్డున కూర్చొని.

నేనూ, చిన్న పచ్చిక సంభాషించుకొంటున్నాం.

వో తడి గాలి తెమ్మెర వీచిందో లేదో

అంతే..

వాన

యెండిన నదిని నింపే ధారలతో

తొలకరి.

అప్పుడు

నేనూ, సీతాకోకచిలుక కలిసి

వాడిపోయిన తోటలో పయనిస్తున్నాం

తూనీగల ఝుంకారం.

అంతే..

వాన

రైతుల యెదురుచూపులలో ప్రతిబింబిస్తూ

తొలకరి.

అప్పుడు

నేనూ, ఆకలి కలిసి నెరెలిచ్చిన నేల మీద నడుస్తున్నాం.

దుఖం రివ్వున వీస్తున్న యుద్ధ భూమి.

అంతే..

వాన

కడుపు తీపి ఆదుర్దాని తొలగిస్తూ

శాంతి పరిమళాలని విరజిమ్ముతూ

తొలకరి.

అప్పుడు

నేనూ, సముద్రం కలిసి కూర్చున్నాం

యిద్దరి మధ్యా యినుప కటకటాలు

రేపనేది కచ్చితంగా వస్తుంది.

అంతే..

వాన

అనేక శభ్దాల్ని దొంగిలిస్తూ..

అనేక నిలువెత్తు గోడలని కూలుస్తూ..

తొలకరి.

రండి.. మనమంతా

స్వేచ్ఛని నిర్బంధించిన వడగాల్పులని ప్రశ్నిద్దాం

తను వెంటపెట్టుకొచ్చే కరువుని నిలదీద్దాం.

మేఘాన్ని చూసి

నాగలిని భుజానికెత్తుకొన్న

రైతు ఆశని వమ్ము చేయొద్దని

రుతువులిని వేడుకొందాం!!

వాన

తొలకరి వాన

గుండెను తడుపుతూ

మనసుల్ని మృదువుగా చేస్తూ..

ప్రేమని హమ్ చేస్తూ..

వాన

తొలకరి వాన..

________

పాల్ లారెన్స్

తెలుగు సేత :

కుప్పిలి పద్మ.

Tags:    
Advertisement

Similar News