ఒక్కోసారి అంతే...!

Advertisement
Update:2023-01-22 16:42 IST

ఎక్కడున్నా

చుట్టూ నక్షత్రాలు మొలిచి

మంచుపూల రెక్కలతో సరాగాలాడతాయి

మబ్బుకొసలట్టుకు జారి

దిగివచ్చిన తూనీగలు

లేతచిగుళ్ళ బుగ్గలు నిమిరి దోబూచులాడే వెలుగురేఖల మధ్య

సరిగమలు పొదిగే చిన్ని కోయిల కూనలవుతాయి

ఒక్కో అక్షరం ముక్కా

ఒక్కో మయూరమై

పురివిప్పి రంగులను ఆరబెడుతు౦ది

తొక్కుడు బిళ్ళాడుతున్న బిడియం పరాగ ధూళి

మొహమంతా అలుముకుని ఎరుపెక్కిన కళ్ళు

పాలిపోయిన పెదవులు

ఒదిగి ఒదిగి హత్తుకున్న గుండెల్లో

పసిపాపలై

కాగితం పాలపుంత పరచుకు పాకుతాయి

మంత్రం దండం ఒకటి

అదృశ్యంగా అక్షర చిత్రాలు అల్లుతూనే పోతుంది

కాస్సేపు ఒక మంత్రనగరిలో విహరించి వచ్చాక

అమావాస్య చీకట్లలోనూ

వెన్నెల వెలుగులు ప్రవహిస్తాయి

వెన్నెల రూపమై వెలుగు ఒకటి

తెల్ల పావురంలా

కంటి రెప్పలపై వాలి

ఓదార్పు లాలిపాటగా మారుతుంది

ఎక్కడో జీవితం పుటల మధ్య దాచుకున్న

నెమలీక నడిచి వచ్చి

పెదవులపై

నులివెచ్చని సంతకాలు

వదిలి వెళ్తుంది

-స్వాతీ శ్రీపాద

Tags:    
Advertisement

Similar News