రక్షణకవచం

Advertisement
Update:2022-11-26 09:07 IST

రక్షణకవచం

సాధారణంగా యెప్పుడూ తెల్లవారే నిద్రలేచి, 9గంటలకి ఆఫీసుకి వెళ్ళే కొడుకు, కోడలు, కాలేజీకి, బడికి వెళ్ళే మనవడు,  మనవరాలి కోసం ఉపాహారం, భోజనం కూడా తయారు చేసి, ఆ తరువాతే మిగిలిన పనులు చేసుకుంటుంది అమూల్యమ్మ. మళ్ళీ  సాయంత్రం అయిదు గంటలకు తిరిగివచ్చే వాళ్ళకి అల్పాహారం ఇచ్చాక,  రాత్రి కోడలి సహాయంతో భోజనాల పనితో సతమతమౌతూ,   వారమంతా పనిచేసే ఆమె ఆదివారం వస్తే  హాయిగా ఆరు దాటాక లేస్తుంది ఆ రోజు అన్ని పనులూ కోడలే చేస్తుంది కనుక.  

 కానీ ఈ ఆదివారం అమూల్యమ్మకి విశ్రాంతి లేదు యెందుకంటే పదకొండు గంటలకి వీధిలోని ఆడవాళ్ళందరితో అమూల్యమ్మ గారింట్లో అతిముఖ్యసమావేశం ఉంది – స్త్రీ సంరక్షణ అంశంపై. సమావేశంలో చర్చించవలసిన విషయాలను క్రోడీకరిస్తూ, తనకు తెలిసిన సమస్యలు, వాటి పరిష్కారాలని చక్కగా, పొందికగా ఒక పుస్తకంలో పట్టిక వేసి, రాసింది ఆవీధి మహిళామండలికి ప్రెసిడెంటైన కోడలు సుఖద. మిగిలినవారు సూచించబోయే సమస్యలకు, సలహాలకొరకు కొన్ని పుటలని వదిలేసి, తాము భవిష్యత్తులో చేయవలసిన ప్రణాళికను రాసింది. ఆ పుస్తకాన్ని అత్తగారికి చూపించింది తను యేమైనా వదిలేసిన విషయాలను ఆమె సూచిస్తుందని. 

అమూల్యమ్మ గబ గబా వంట ముగించి, కరవస్త్రంతో చేతులు తుడుచుకుంటూ వచ్చి, ఆ పుస్తకాన్ని తిరగేసింది. తరువాత " అమ్మాయ్! నాకు పది నిమిషాలు కేటాయిస్తే, కొన్ని విషయాలు చెబుతాను. సరేనా?" అంది. " తప్పకుండా అత్తయ్యా! "అంది సుఖద.

అందరూ వచ్చేలోపల భోజనాలు ముగించి, పిల్లలు వసారాని సమావేశానికి తయారు చేశారు. పదిముప్పావుకు  దాదాపు ముప్ఫయ్ మంది మహిళలు అక్కడ సమావేశమయ్యారు. వారందరికీ పిల్లలు మంచినీళ్ళిచ్చారు. 

తరువాత ఠంచనుగా పదకొండు గంటలకి సుఖద మాట్లాడ్డం మొదలుపెట్టింది.

"సఖులారా! శుభోదయం. మనం ఈ రోజు అతి ముఖ్యమైన సమస్య ఐన మన అందరి రక్షణను గురించి వివరంగా చర్చించుకొని,  పరిష్కారించుకోబోతున్నాం. ఆడపిల్లలకి యెక్కువగా రక్షణనివ్వవలసిన తరుణం వచ్చేసింది. ఇంతదాకా మనం వార్తలలో వినేవాళ్ళం  ఆడ పసికందులని కన్న వెంటనే కుప్పతొట్ట్లలో వేస్తున్నట్లు, అది ఆర్థిక సమస్య వల్లో, ఆడపిల్ల కావటం వల్లో, లేక  అక్రమసంబంధం వల్లో కలిగిన సంతానం కావొచ్చు. దాన్ని మనం అంతగా పట్టించుకోలేదు. కానీ వారం క్రితం మన వీధి చివర్లోని  చెత్తకుండీలో ఒక పసికందుని మనమే చూశాం. ఆ పాపని పెద్దమనసుతో మన వీధిలో చెత్త ఊడ్చే రంగయ్య పెంచుకుంటున్నాడు. ఇలా యెంతమంది ఉంటారు? దీనికి అసలు పరిష్కారాన్ని మనం కనుక్కోవాలి. తరువాత బయటికి వెళ్ళిన ఆడపిల్లలు ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేదాకా మనందరి గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. ఇక వయసుతో పనిలేకుండా, పసికందులైనా ఆడపిల్లలని మనకి తెలిసిన, తెలియని మగవారు అతి దారుణంగా బాధించి, తమ కామానికి గురిచేసి పాడుచేస్తున్నారని తెలిసి గుండెలవిసిపోతున్నాయి.  ఇక కాలేజీలలో ర్యాగింగును బ్యాన్ చేసినా, కొంతమంది ఆడపిల్లలు ర్యాగింగ్ వల్లే ప్రాణాలు తీసుకుంటున్నారు. " అంటూ ఆగింది సుఖద.

"అవును. అన్నీ దారుణాలే. పెద్దలు తమ కోరికలను పిల్లలపై రుద్ది, వాళ్ళు ఇంజనీర్లో, డాక్టర్లో కావాలని పిల్లలకి నచ్చని చదువులను చదవమని నిర్బంధిస్తున్నారు.  పిల్లలు తమ కోరికలను అణచుకుని, తలిదండ్రుల కోరికలను తీర్చలేక, మానసిక ఒత్తిడితో సతమతమౌతూ, కొంతమంది ఆత్మార్పణ చేసుకుంటున్నారు, మరికొంతమంది చెడు సహవాసాల వలలో పడి, జీవితాలు పాడుచేసుకుంటున్నారు. మరి ఆ తలిదండ్రులకి యెలా నచ్చజెప్పగలం? వీటిని మనం అరికట్టలేమా?"  ప్రశ్నించింది రమణి.

"మొన్న ప్రక్క వీధిలోని  సరళ ఊరికెళ్ళిందని ఆమె కూతుర్లు దగ్గర్లో ఉన్న కర్రీ పాయింట్లోంచి అనుపానాలు తెప్పించుకున్నారట. ఆ డెలివరీ అబ్బాయి వాళ్ళతో స్నేహంగా మాట్లాడి, తన మొబైల్ లో వారిని ఫోటో తీసి, అందులో కొంత మార్పు చేసి,  నాతో ఒక రోజు గడిపితే సరే, లేకపోతే, అసభ్యంగా ఫేస్బుక్లో పెడతాను. అని బ్లాక్ మెయిల్ చేశాడట. ఆ పిల్లలు అరిచి, ప్రక్కింటి వారిని పిలవడంతో, వాడు పారిపోయాడట. సరళ ఈ విషయం యేడుస్తూ చెబితే, నేను తట్టుకోలేకపోయానండీ" అన్నది శ్లోక.

ఇంతలో అందరికీ నిమ్మరసం తెచ్చిచ్చిన అమూల్యమ్మ  "అసలు పరిష్కారం మన దగ్గరే ఉంది. పూర్వం ఉమ్మడి కుటుంబాలలో ఇలాంటి సమస్యలుండేవి కావు. ఎందుకంటే ఇంట్లో యెవరో ఒకరు ఉండేవారు పిల్లల బాగోగులు చూసుకునేందుకు. ఇప్పుడవి లేవు కనుక, మనమందరమూ ఒక ఇంటివాళ్ళలాగా మెలుగుదాం. కర్రీ పాయింట్స్ కి వెళ్ళేబదులు మనమే ఆ కర్రీస్ చేయడం, క్రెచ్ కి పసిపిల్లలని పంపకుండా మన ఇళ్ళలోనే ఒక గదిని క్రెచ్ గా మార్చి, ఆ పిల్లలను చూసుకోవడం, హోటల్స్ కి వెళ్ళకుండా, వారానికొకసారి, మనమే తలా ఒక పదార్థం చేసుకుని ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ ఇంట్లో కలిసి భోంచేద్దాం.  అలాగే వంతులు వేసుకుని పిల్లలని బడిలో దింపడం, ఇళ్ళకి తీసుకురావడం చేద్దాం. వీటి వలన మనకు భద్రత, ఆరోగ్యం. మనలో ఒక బాంధవ్యం యేర్పడుతుంది. పిల్లలు కూడా బాగా కలిసి, మెలిసి ఉంటారు. మా ఇంటి మేడమీద వసారాని శుభ్రం చేయించి, అందరూ చదువుకొనేట్లు  గ్రంథాలయం,  ఇన్డోరు గేమ్స్ పెడదాం. దీంతో పిల్లలు మొబైల్స్ కి దూరంగా ఉంటారు. అలాగే సాయంత్రాలు ట్యూషన్కి బయటికి పంపకుండా, మనమే పిల్లలకి  పాఠాలు చెప్పిస్తే సమయం సద్వినియోగపరుచుకున్నట్లుంటుంది. ట్యూషన్ల డబ్బుని మనందరి సంక్షేమానికి  వాడుకుందాం. అందులో మన వీధి శుభ్రత కూడా ఉంటుంది. మన వీథిలో ఒక సీసీటీవి క్యామెరాని అమర్చుదాం. ఎవరైనా క్రొత్తవారు వస్తే తెలిసేందుకు. ఎవరికి యెటువంటి అవసరమొచ్చినా, అపరిచిత వ్యక్తులు వచ్చినా, వెంటనే అందరికీ తెలపాలి. అందుకు మొదట మనందరిదీ ఒక వాట్సాప్ గ్రూప్ తయారుచేయాలి.

మన ఈ ప్రణాలికలో మగవారిని కూడా చురుకుగా పాలుపంచుకొనేట్లు చేయాలి. మన పిల్లలు చక్కని నడవడికతో ఉండేట్లు, ముఖ్యంగా ఆడపిల్లలు జుట్టు విరబోసుకోవడాలు, చాలీచాలని దుస్తులకు దూరంగా ఉండేట్లు, వారికి చెడు, మంచి స్పర్శల గురించి తెలపడం, అబ్బాయిలు అమ్మాయిలను గౌరవించే విధంగా చూసుకోవడం మనందరి బాధ్యత. సరేనా? మనం పిల్లలతో ప్రేమతో, వారి ఆలోచనలను, అభిప్రాయాలను గౌరవిస్తూ, వారికి మంచి స్నేహితులుగా ఉంటే, వారు తమ సమస్యలను మనతో నిర్భయంగా చర్చించే అవకాశం ఉంటుంది. వారికి మన అండదండలున్నాయన్న నమ్మకాన్ని కలిగిస్తే, వారు చెడుదారివైపు పోయే అవకాశం అసలు ఉండదు. అంతే కాదు. పిల్లలకి అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, జ్ఞాపకశక్తి లాంటివి మంచి ఆహారపుటలవాట్లు, సానుకూల దృక్పథం, మంచి నడవడిక, క్రమశిక్షణ వల్ల వస్తాయే కానీ కేవలం ప్రకటనల వలన రావని స్పష్టపరచాలి. ఇక మీ అభిప్రాయాలు తెలపండి. " అంది.  

అందరూ కరతాళధ్వనులతో అమూల్యమ్మ అభిప్రాయాలని ఆమోదించారు.

అప్పుడు నిపుణ "వాట్సాప్, ఫేస్బుక్ లోని పరిచయాలు స్నేహంగా, ప్రేమగా మారి  విషాదాంతమైన అమ్మాయిల గాథలు పునరావృతం కాకుం డా చూసే బాధ్యత కూడా మనమీద ఉంది. అలాగే నెగటివిటీతో, పగ, ద్వేషాలను రగిలించే ధారావాహికలను చూసి, మనసు పాడుచేసుకోకుండా, సమయం వృథా కాకుండా, టెర్రస్ గార్డెన్, యోగాభ్యాసం,  కుట్లు, అల్లికలు, వ్యర్థాలను ఉపయోగించడం, రకరకాల పొడులు, పచ్చళ్ళు తయారుచేయడానికి, మనకు తెలిసిన ఇతర  చేతిపనులకై కు వాడుకుందాం. ఇవి కాక వేరేయేవైనా ఉంటే వాట్సాప్లో తెలపండి " అంది. సుఖద

"మన నేటి సమావేశం ముగిసింది. ఇలా మనం తరుచూ కలుసుకుని, మన సమస్యలనన్నింటినీ హాయిగా పరిష్కరించుకుందాం. మన ఐకమత్యమే మన బలం, రక్షణ కవచం" అని ముగించింది. అంతదాకా ఆందోళన చెందిన అందరి ముఖాలు హాయిగా ఆనందంతో వెలిగాయి.

-డా. తిరుమల ఆముక్తమాల్యద

Tags:    
Advertisement

Similar News