అమ్మలోని ‘అ’కారం నాన్నలోని ‘న్న’కారం కలిస్తే అన్నఅన్నమాట నిజమే ననిపించింది నేను మాతృమూర్తినైనపుడు.
చిన్నపుడు చీటికి మాటికి పెన్సిల్, బలపాల ముక్కలని, అమ్మ ఇచ్చిన నావంతు చేగోడీలు, మిఠాయిలు కొంత బుజ్జగించి, కొంత బలవంతంగా లాక్కున్న అన్న, దీపావళి మతాబాలను కొంత అడిగి, కొంత అడగక తీసుకున్న అన్న,తను చేసిన తప్పులకి నేను దెబ్బలు తిని యేడుస్తున్నపుడు ముసిముసినవ్వులు నవ్విన అన్న, రాత్రి చిమ్మచీకటిలో నల్లని దుప్పటి కప్పుకుని దెయ్యాల కథలు చెప్పి నన్ను భయపెట్టిన అన్న పెద్దయ్యాక నాకొక మంచి స్నేహితుడయ్యాడు.
ఆసుపత్రిలో ప్రసవానికని వెళ్ళినపుడు, కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని, ఆపరేషన్ చెయ్యాలని వైద్యులు చెప్పినపుడు, ఆందోళనతో అన్నకళ్ళల్లో నీరు చిప్పిల్లింది. కానీ నేను డీలా పడిపోకూడదని, నాకు ధైర్యం చెప్పాడు. పాపాయి పుట్టాక ఆహారం యేది ఇచ్చినా, అంతా వమనరూపంలో బయటికి వస్తోందని అమ్మ అంటే, దిగాలు పడిపోయాడు. తానే నాకు ముద్దలు చేసి అన్నం తినిపించాడు. తిన్న మరుక్షణం అంతా వమనంగా బయటికి వచ్చింది. వెంటనే దానిని తన దోసిలిలో పట్టుకున్నాడు ఏవగించుకోకుండా. వెంటనే చేతులని శుభ్రం చేసుకువచ్చి, నా మూతిని తడిబట్టతో, ఆపై పొడిబట్టతో తుడిచి, నన్ను పడుకోబెట్టి, వెంటనే వైద్యుల దగ్గరికి పరిగెత్తాడు ఔషధంకోసం.
అప్పుడక్కడున్న నర్సమ్మ లందరూ అన్నయ్య చర్యని చూసి “ అబ్బ! ఇంతటి అనురాగమూర్తి ఐన అన్నయ్యని సినిమాలో చూశాం. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం” అని అన్నారు. నా బంగారు అన్నకి వారి దృష్టి తగలకూడదని, మనసులోనే అన్నకి దిష్టి తీసాను, అన్న వెళ్ళిన వైపే మురిపెంగా చూస్తూ.
ఈ సంఘటన జరిగింది సరిగ్గా 30 యేళ్ళక్రితం. ఇప్పటికీ మనసులో తాజాగా, అన్నయ్య ప్రేమానురాగాల మధురగీతాన్ని ఆలపిస్తూనే ఉంది. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల అటువంటి అనురాగమూర్తిని అన్నగా పొందాను.
డా. తిరుమల ఆముక్తమాల్యద
(చెన్నై)